ప్రచార రథం కదిలింది.. బస్ యాత్ర ఆగింది..

తాను ఒకటి తలిస్తే... దైవం మరోటి తలచిందన్న చందాన ఉంది ఏపీ రాజకీయ నాయకుల పరిస్థితి. అధికారపార్టీ వైఫల్యాలను చంద్రబాబు ఎండగట్టాలనుకున్నారు.;

Reporter :  The Federal
Update: 2023-11-29 23:47 GMT
CM Y.S.Jagan Mohan Reddy Vs Chandra Babu Naidu


తాను ఒకటి తలిస్తే... దైవం మరోటి తలచిందన్న చందాన ఉంది ఏపీ రాజకీయ నాయకుల పరిస్థితి. అధికారపార్టీ వైఫల్యాలను చంద్రబాబు ఎండగట్టాలనుకున్నారు. నాలుగేళ్లుగా బాబు బొక్కలు ఎక్కడ దొరుకుతాయా అన్నట్టు చూసిన ప్రభుత్వ పెద్దలకు స్కిల్ డెవలప్మెంట్ కేసు దొరికింది. ఇంకేముంది నంద్యాలలో సెప్టెంబరు 8 అర్థరాత్రి అరెస్టు... 9న కోర్టులో హాజరు ఆదేరోజు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి చంద్రబాబు తరలింపు. ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. చంద్రబాబు చేపట్టిన బస్సుయాత్ర నంద్యాలలో ఆగిపోయింది. అప్పటి వరకూ పాదయాత్రలో ఉన్న చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ తండ్రి అరెస్టుతో తూర్పుగోదావరి జిల్లాలో అర్థాంతరంగం తన పాదయాత్రను నిలిపివేశారు. అంతకు ముందు అమరావతి రైతులు 2022 సెప్టెంబరు 12న మొదలు పెట్టిన అమరావతి టు అరసవెల్లి మహా పాదయాత్ర కూడా అర్థాంతరంగా ఆగిపోయింది. దీనికి మహాపాదయాత్ర చేస్తున్న వారిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని పోలీసులు నిలిపివేశారు. హైకోర్టులో అమరావతి రైతులు పిటిషన్ దాఖలు చేసినా.. ఇప్పటికీ అమరావతి రైతులు మహా పాదయాత్ర తిరిగి ప్రారంభం కాలేదు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలన్ని అర్ధాంతరంగా ముగింపు :

వడ్డించేవాడు మనవాడైతే... చివరాఖరు బంతిలోకూర్చున్నా బాధలేదన్న సామెతలా ప్రతిపక్షాల బస్సుయాత్ర, పాదయాత్ర, మహాపాదయాత్రలు ఎక్కడికక్కడ ఆగిపోతే... అక్టోబరు 26నుండి అధికార వైసీపీ సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సు యాత్ర మొదలు పెట్టింది. ఒకేసారి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుండి సాధికార యాత్ర రోడ్డెక్కింది. ఉత్తరాంధ్రా ప్రాంతం లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, డెల్టా ప్రాంతమైన గుంటూరు-తెనాలి, రాయలసీమలోని అనంతపురం జిల్లా సింగనమల నుండి వైసీపీ యాత్రలు ప్రారంభించింది. అక్కడ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు బస్సుయాత్ర, తనయుడు లోకేష్ పాదయాత్ర చేపడితే... అధికారపార్టీ మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా ప్రతినిధుల సామాజిక సాధికార యాత్రను చేపట్టి ప్రజల మనసులను ఎంతో చాకచక్యంగా పక్కకు మళ్లించిందని రాజధాని అమరావతి రైతు నీలంశెట్టి సాంబశివరావు నిట్టూర్చారు.

ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులు చూస్తుంటే... మరో మద్రాసు రాజకీయాలు గుర్తుకు వస్తున్నాయని గుంటూరుకు చెందిన రైతు శీలం బాబూరావు, చల్లంగి మహేశ్వరరావు ఆపాత రోజులను గుర్తుకు తెచ్చారు. తమిళనాడులో డీఎంకే-ఏఐఏడీఎంకే అధినేతలు జయలలిత, కరుణానిధి మధ్య రాజకీయ పరిస్థితులు ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్నాయన్నారు. అంతే కాదంటోయ్... ఎంతో చాకచక్యంగా టీడీపీ యాత్రల్ని అధికార వైసీపీ నేర్పుతో పక్కదారి పట్టించిందని అంటున్నారు జనసేన పార్టీకి చెందిన గుంటూరు నాయకుడు శ్రీధర్ రెడ్డి.

ఏది ఏమైనా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇటీవల కాలంలో ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేమంటోంది విజయయవాడ లోని సిద్ధార్ధ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని సీ.హెచ్.ప్రవళిక. ప్రతిపక్షపార్టీ రాజకీయ ప్రచారాన్ని ఎంతో నేర్పుతో వైసీపీ నేతలు అడ్డుకొని, తమ బస్సుయాత్రకు శ్రీకారం చుట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని కాంగ్రెస్పార్టీకి చెందిన సుంకర పద్మశ్రీ అంటున్నారు. ఏదైనా ఇప్పటి రాజకీయాలు అంత ఆరోగ్యకరంగా కనిపించడం లేదని ఆమె ఒక్కింత ఆందోళన వ్యక్తం చేశారు. అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఈ పొలిటికల్ వార్ లో ఎవరు గెలుస్తారో..? ఎవరు అధికారం వైపు పరుగులు తీస్తారో అన్నది తేలాలంటే.. 2024 ఏప్రిల్ వరకూ వేచిఉండాల్సిందే.

Similar News