నోరు తెరిచిన మ్యాన్ హోల్ లో పడ్డ చిన్నారి

పాతబస్తీ యాకుత్ పురాలో ఘటన;

Update: 2025-09-11 13:08 GMT

హైదరాబాద్ లో మూత తెరిచి ఉన్నమ్యాన్ హోల్స్ వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. వర్షాకాలం ప్రారంభం అవుతూనే ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. గురువారం స్కూల్‌కు వెళుతున్న చిన్నారి.. మూత తెరిచి వదిలేసిన మ్యాన్ హోల్‌లో పడిపోయింది. తల్లి పక్కనే ఉండటంతో వెంటనే చిన్నారిని బయటకు తీసింది. దీంతో ఆ అపాయం నుంచి చిన్నారి ప్రాణాలతో బయటపడింది. పాత బస్తీ యాకుత్ పురాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాన్ హోల్ లో గతంలో చాలామంది పడినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదు. కాగా ఇటీవలె అక్కడ ఒక సీసీటీవీ అమర్చారు. అందులో గురువారం చిన్నారి పడిన ఘటన రికార్డు కావడంతో విషయం బయటకు పొక్కింది. సోషల్ మీడియాలో ఈ వీడియోచక్కర్లు కొట్టడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

జలమండలి సూచనలు పట్టించుకోకపోవడం వల్లే...

హైదరాబాద్ నగరంలోని రహదారులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యాన్ హోళ్లు తెరిస్తే కఠిన చర్యలుంటాయని జలమండలి అధికారులు చెబుతూనే ఉన్నారు. వర్షాకాలం ప్రారంభం కాగానే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు జలమండలి కఠిన సూచనలు చేసినప్పటికీ ప్రజల్లో అవగాహనా రాహిత్యం వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 

వర్షాకాల ప్రణాళికలో భాగంగా జలమండలి ఇప్పటికే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. లోతైన మ్యాన్ హోళ్ల తో పాటు 25 వేలకు పైగా మ్యాన్ హోళ్లపై ఇప్పటికే సేఫ్టీ గ్రిల్స్ బిగించినప్పటికీ పాతబస్తీలో అటువంటివి జాగ్రత్తలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ‘‘ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్ తో సీల్ చేసి, రెడ్ పెయింట్ ఏర్పాటు చేసినప్పటికీ పాతబస్తీలో అటువంటి ముందు జాగ్రత్త తీసుకోలేదు’’ అని స్థానిక అలియాబాద్ డివిజన్ బిజెపి నేత పొన్నం చలపతి ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఈఆర్టీ), సేఫ్టీ ప్రోటోకాల్ టీమ్ (ఎస్పీటీ) వాహనాలను రంగంలోకి దింపినప్పటికీ క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలు అందించడం లేదని ఆయన ఆరోపించారు.

ఈ బృందాలకు కేటాయించిన వాహనాల్లో జనరేటర్ తో కూడిన డీ వాటర్ మోటార్ ఉంటుంది. దీని సాయంతో వర్షపు నీటిని తొలగిస్తారు. వీరంతా ఆయా ప్రాంతాల్లో వర్షం కురవగానే అప్రమత్తంగా ఉండి పనిచేస్తారు. ఈ టీమ్ లు అన్నీ.. అధికంగా నీరు నిలిచే ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారిస్తాయి. వీటితో పాటు ఎయిర్ టెక్ మిషన్లు సైతం అందుబాటులో ఉన్నాయి. మ్యాన్ హోళ్ల నుంచి తీసిన వేస్ట్ (సిల్ట్) ని ఎప్పటికప్పుడు తొలగిస్తారు.

మ్యాన్ హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్ నుంచి సీవర్ ఇన్ స్పెక్టర్ నేతృత్వంలో ఒక సీవరేజీ బృందం ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని న్యాయవాది గూడ వెంకటేశ్వర్ రావు ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. వీరు ఉదయాన్నే క్షేత్ర స్థాయిలో వారి పరిధిలోని ప్రాంతాలకు వెళ్లి పరిస్థితి పర్యవేక్షించాల్సి ఉంటుంది. వాటర్ లాగింగ్ పాయింట్లను జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో ఎప్పటి కప్పుడు క్లియర్ చేయాలి. ఎక్కడైనా మ్యాన్ హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా లేదా ఇతర సమస్యలు, ఫిర్యాదులుంటే జలమండలి కస్టమర్ కేర్ నంబరు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. లేదా దగ్గర్లోని జలమండలి కార్యాలయాల్లో నేరుగా సంప్రదించవచ్చు అని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రమే ఉంటుంది.

హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ యాక్ట్ – 1989, సెక్షన్ 74 ప్రకారం నేరం

‘‘అనుమతి లేకుండా మ్యాన్ హోళ్లపై ఉన్న మూత తెరచినా, తొలగించినా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ యాక్ట్ – 1989, సెక్షన్ 74 ప్రకారం నేరం’’ అవుతుందని న్యాయవాది గూడ వెంకటేశ్వర రావు చెప్పారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చు. నిందితులకు జరిమానా విధించడంతో పాటు కొన్ని సార్లు జైలు శిక్ష కూడా విధించే అవకాశముంటుందని ఆయన చెప్పారు

వర్షాకాలంలో సీవరేజి నిర్వహణలో సాధారణ పౌరులు ఎలా ప్రవర్తించాలి. ఎలా నడుచుకోవాలనే అంశాలపై జలమండలి విరివిగా ప్రచారం చేస్తుంది. స్థానిక కాలనీల సంఘాలు, స్వయం సహాయక గ్రూపు సభ్యులతో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అంతే కాకుండా విధిగా చేయాల్సిన, చేయకూడని పనులపై దినపత్రికలు, టెలివిజన్, ట్విటర్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమౌతుంది.

Tags:    

Similar News