తాగుడుకు డబ్బులివ్వలేదని మేనత్తను కడతేర్చాడు

ములుగు జిల్లాలో దారుణం;

Update: 2025-09-11 13:09 GMT

బంధాలు బంధుత్వాలనే ప్రశ్నించే ఘటన ఇది. కన్నతండ్రికి స్వయానసోదరి అయిన మేనత్తను కడతేర్చాడు ఓ ప్రబుద్దుడు. జల్సాలకు డబ్బులివ్వలేదనే కారణంతో ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఇప్పలగూడెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది మేనత్త కొండగొర్ల ఎల్లమ్మ(50)ను అదే గ్రామానికి చెందిన మేనల్లుడు కొండగొర్ల విజయ్ కుమార్ అత్యంత కర్కశంగా చంపేశాడు. మద్యం మత్తులో గొడ్డలితో మేనత్తను ముక్కలు ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశాడు.

తాగుడుకు బానిసైన విజయ్ కుమార్ డబ్బులు ఇవ్వాలని మేనత్తను తరచూ వేధించేవాడు. తన సోదరుడి కుమారుడే అన్న ఆప్యాయతతో ఎల్లమ్మ డబ్బులు ఇచ్చేది. గురువారం కూడా మేనల్లుడు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.తన వద్ద డబ్బులు లేవని ఎల్లమ్మ నిరాకరించి ఆమె ఆరుబయటకు వెళ్లి కూర్చుంది. మేనత్త డబ్బులివ్వలేదన్న అక్కసుతో విజయ్ కుమార్ అతి కిరాతకంగా గొడ్డలితో హతమార్చాడు.

రక్తపు మడుగులో పడి ఉన్న ఎల్లమ్మను ఆస్పత్రిలో చేర్పించడానికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లినప్పటికీ అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. నిందితుడు విజయ్ కుమార్ నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలిని పరిశీలించి పంచనామా చేశారు. బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలను సేకరించారు.

Tags:    

Similar News