‘నిర్ణయం మీరే తీసుకోండి’
పోస్టుమార్టం నివేదిక వెల్లడిపై జుబీన్ భార్య గరిమ..
ఇటీవల అనుమానాస్పదంగా మృతిచెందిన అస్సాం(Assam) ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్(Zubeen Garg) రెండో పోస్టుమార్టం(Post-mortem) నివేదికను CID అదనపు ఎస్పీ మొరామీ దాస్ అక్టోబర్ 4వ తేదీన ఆయన భార్య గరిమాకు అందజేశారు. సెప్టెంబర్ 23న గౌహతి మెడికల్ కాలేజీలో గార్గ్ మృతదేహానికి రెండోసారి పోస్ట్‌మార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. సింగపూర్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రదర్శనకు వెళ్లిన జుబీన్.. సెప్టెంబర్ 18న సముద్రంలో ఈత కొడుతూ చనిపోయారు. దాంతో సింగపూర్‌లోనే తొలుత పోస్ట్‌మార్టం నిర్వహించారు. అది కూడా ఇటీవల గార్గ్ కుటుంబసభ్యులకు అందింది. అయితే రిపోర్టును బయటపెట్టాలా? వద్దా? అన్నది గరిమా ఇష్టమని దాస్ చెప్పారు.
ఈ నేపథ్యంలో పోస్టుమార్టం రిపోర్టును గరిమా పోలీసులకే తిరిగి ఇచ్చేశారు. అది తన "వ్యక్తిగత పత్రం" కాదని పేర్కొంటూ.. దాన్ని బహిరంగపరచాలా? వద్దా? అన్నది పోలీసులు నిర్ణయించుకోవాలని చెప్పారు. జరుగుతోన్న దర్యాప్తుపై తమకు నమ్మకం ఉందని, తన భర్త మరణానికి కారణాన్ని తాము తెలుసుకోవాలనుంకుటున్నామని చెప్పారు.
జుబీన్‌పై విషప్రయోగం జరిగిందని గార్గ్ బ్యాండ్ సభ్యుడు శేఖర్ జ్యోతి గోస్వామి వ్యాఖ్యలపై గరిమా స్పందించారు. ఆయనను పోలీసులు విచారించే దాకా ఆ విషయాన్ని ఎందుకు దాచారని ప్రశ్నించారు. ‘ఎవరు ఏం చేసినా.. నేరస్థులకు మాత్రం కఠిన శిక్ష పడాలి’ అని గరిమా మాటల్లో ప్రతిధ్వనించింది.
గార్గ్ మేనేజర్ మహంతపై రాష్ట్రవ్యాప్తంగా 60కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడం. కేసు తీవ్రత దృష్ట్యా కేసు విచారణను సీఐడీకి అప్పగించారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసి, తర్వాత కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇటు అస్సాం ప్రభుత్వం అక్టోబర్ 3న ఈ కేసు దర్యాప్తునకు గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్ర సైకియా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది.