ఇషాన్ తన సొంత క్రికెట్ అకాడమీలో సాధన, హైదరాబాద్ కు కలిసొచ్చిందా?

ఐపీఎల్ కెరీర్ లో తొలి సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్, గత రెండు మూడు నెలలుగా తీవ్రంగా సాధన చేస్తున్న యువ ఆటగాడు;

Update: 2025-03-24 11:05 GMT
సన్ రైజర్స్ ఆటగాడు ఇషాన్ కిషన్

ఇషాన్ కిషన్.. ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇషాన్ కెరీర్ లో ఓ చెత్త సమయం ఏదైనా ఉంది అంటే అది 2024 సంవత్సరమే అని చెప్పవచ్చు. దక్షిణాఫ్రికా టూర్ లో అర్థాంతరంగా ఇంటికి రావడతో మొదలైన దుమారం.. తరువాత బీసీసీఐ మాటలను సైతం లెక్క చేయకుండా ఐపీఎల్ ప్రాక్టీస్ చేయడంతో కొనసాగింది.

డొమెస్టిక్ క్రికెట్ ఆడకుండా గాయం సాకుతో పక్కకు తప్పుకోవడంతో సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు. ప్రస్తుతం ఆ బ్యాడ్ మెమోరీలను తొలగించుకునేందుకు ఇషాన్ ప్రయత్నిస్తున్నాడు.

రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచ్  లో సన్ రైజర్స్ హైదరాబాద్ అరంగ్రేటంలో 45 బంతుల్లో సెంచరీ సాధించాడు. హెడ్ తో కలిసి స్కోర్ బోర్డును రాకెట్ స్పీడ్ తో పరుగెత్తించాడు.
‘‘నాలో ఆ భయం ఉంది. జట్టును చూశాక ఇంకా కంగారు మొదలైంది. కానీ కెప్టెన్, కోచ్ నాకు చాలా ఆత్మవిశ్వాసం ఇచ్చారు. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. నేను మధ్యలో నా సమయాన్ని ఆస్వాదించాను.’’ అని మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్న సందర్భంలో ఇషాన్ చెప్పాడు.
కొంతకాలం కిందటి వరకూ టీమిండియాలో సంజూ శాంసన్, రిషబ్ పంత్ లాంటి టాప్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్లలో ఒకడిగా పేరు కిషన్ కు పేరుంది. కానీ బీసీసీఐ తో గొడవ తరువాత పరిస్థితి మొత్తం మారిపోయింది.
ఇప్పుడు కనీసం జాతీయజట్టు దరిదాపుల్లోకి కూడా అతను రావడం లేదు. దీనిని ఛాలెంజింగ్ గా తీసుకున్న కిషన్ డొమెస్టిక్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. దానికి కొనసాగింపు అన్నట్లుగా ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లోనే సెంచరీతో అదరగొట్టాడు. తన ఐదు సంవత్సరాల ఐపీఎల్ కెరీర్ లో ఇదే తొలిసెంచరీ.
‘‘నాకు చాలా సమయం దొరికింది. నేను చాలా ప్రాక్టీస్ చేస్తున్నాను. నా బ్యాటింగ్ లోపాలను సవరించుకున్నాను. ఇది బాగుందీ’’ అని తన బ్యాటింగ్ పై ఇషాన్ సంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇంతకుముందు ముంబై జట్టు తరఫున ఐపీఎల్ లో ఆడినప్పుడు అక్కడే సాధన చేసేవాడు. అక్కడ అన్ని వనరులు ఉండేవి. అయితే ఈసారి తను కష్టపడి సంపాదించిన డబ్బుతో సొంత ఊరు పాట్నాలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయడానికి ఉపయోగించాడు. అక్కడే ఈ సారి సాధన చేశాడు.
కొన్ని నివేదికల ప్రకారం.. కిషన్ ప్రతిరోజు కనీసం రెండు సెషన్లు ప్రాక్టీస్ చేసేవాడు. ఉదయం సెషన్ లో తన క్రికెట్ నైపుణ్యాలపై దృష్టి పెట్టేవాడు. ఇది దాదాపుగా 2 నుంచి 3 గంటలు పాటు చాలా తీవ్రంగా ఉండేది. సాయంత్రం జిమ్ వర్కౌట్లు లేదా రెండు గంటల పాటు స్పీడ్ ట్రైనింగ్ చేసేవాడని తెలిసింది.
బ్యాటింగ్ శైలిలోని సాంకేతిక లోపాలను తగ్గించుకోవడానికి స్వంత వీడియోలను విశ్లేషించడతోనే సాయంత్రాలు గడిచేదిని తెలిసింది. మానసికంగా బలంగా తయారయ్యేందుకు కూడా అనేక విధాలుగా సన్నద్దం అయ్యాడని పలు జాతీయ పత్రికలు రాశాయి.
ఇంతకుముందు దేశవాళీ- అంతర్జాతీయ క్రికెట్ మధ్య ఆట ఒత్తిడిని కవర్ చేయడానికి కుటుంబ సభ్యులతో గడిపేవాడు. కానీ ఎక్కువ కాలం కుటుంబంతో గడపాలని నిశ్చయించుకున్నప్పుడూ పాట్నాలోనే క్రికెట్ అకాడమీ నెలకొల్పుకుంటే ఉత్తమం అని కిషన్ భావించినట్లు కొన్ని పత్రికలు విశ్లేషించాయి.
ఇషాన్ ఆడిన ఇన్నింగ్స్ పై ఎస్ఆర్ హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందిస్తూ ‘‘ ఇషాన్ ఈ రోజు అద్బుతంగా ఆడాడు. స్వేచ్చగా ఆడటానికి ప్రయత్నించాడు. మిగిలిన మ్యాచ్ లో ఇదే తీవ్రతతో బ్యాటింగ్ చేస్తాడని అనుకుంటున్నాను’’ అని ఆకాంక్షించాడు.
Tags:    

Similar News