ఐపీఎల్ 2025: ఆరంభ మ్యాచ్ లోనే అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ
44 పరుగుల తేడాతో రాజస్థాన్ జట్టును ను ఓడించి బోణీ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్;
By : Saleem Basha
Update: 2025-03-23 16:33 GMT
ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు, సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి, ఈసారి ఎస్ఆర్ హెచ్ దే అని ప్రకటించాడు. అందుకు అనుగుణంగానే హైదరాబాద్ జట్టు బోణి చేసి ముందుకు వెళ్ళింది.
ఇంతవరకు రెండు జట్ల మధ్య 20 మ్యాచ్ లు జరిగాయి. 11 మ్యాచులు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవగా, రాజస్థాన్ రాయల్స్ తొమ్మిదింట్లో సత్తా చాటింది. సన్ రైజర్స్ హైదరాబాద్ దే కాస్త పైచేయిగా ఉంది. గెలిచిన 11 మ్యాచ్ లలో హైదరాబాద్ జట్టు ఆరుసార్లు మొదట బ్యాటింగ్ చేసి విజయాన్ని అందుకోగా, మిగతా ఐదు సార్లు మొదట బౌలింగ్ చేసి గెలిచింది.
దీన్నిబట్టి చూస్తే హైదరాబాద్ బ్యాటింగ్ కొంచెం మెరుగ్గా ఉంది. అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ప్యాట్ కమిన్స్(ఈ ఐపిఎల్ లో ఏకైక విదేశీ కెప్టెన్). టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకునేందుకు మొగ్గు చూపుతానడంలో సందేహం లేదు.
అదే రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా ఆరుసార్లు మొదట బౌలింగ్ చేసి గెలిచింది. మిగతా మూడు సార్లు మొదట బ్యాటింగ్ చేసి గెలిచింది. అంటే రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ బలంగా ఉన్నట్టు అర్థమవుతుంది. దీన్నిబట్టి రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్( సంజు శాంసన్ గాయం మానక పోవడం వల్ల, మొదటి కొన్ని మ్యాచ్లు కెప్టెన్ గా చేయడం లేదు) కూడా బ్యాటింగే తీసుకోవాలి.
కొత్త కెప్టెన్- పసలేని బౌలింగ్
అందుకే టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది కానీ, రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంలో విఫలమయ్యారు.
సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ వచ్చి రావడంతోనే ధాటిగా బ్యాటింగ్ చేస్తూ 11 బంతుల్లో 24 పరుగులు చేశాడు అందులో ఐదు బౌండరీలు ఉన్నాయి. ధనాధన్ లెప్ట హ్యాండర్, మరో ఆసీస్ లెప్ట్ హ్యాండర్ హెడ్ తో కలిసి 3.1 ఓవర్లలోనే 45 పరుగులు జోడించాడు.
అభిషేక్ త్వరగా పెవిలియన్ చేరడంతో సంబరాలు చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ కు ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. హెడ్ కు జతగా మరో లెఫ్ట్ హ్యాండర్ ఇషాన్ కిషన్ జత కలిసి స్కోర్ బోర్డును రాకెట్ స్పీడ్ తో పరుగెత్తించారు.
ఇషాన్ కిషన్, హెడ్ బౌలర్ల బంతులను స్టేడియం నలువైపులా బౌండరీల వైపు తరలిస్తూ, అప్పుడప్పుడు బంతిని ప్రేక్షకుల్లోకి పంపిస్తూ 85 పరుగులు జోడించారు.
ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 9 బౌండరీలు మూడు సిక్సర్లతో 67 పరుగులు చేసి దేశ్ పాండేకు వికెట్ సమర్పించుకున్నాడు. అయితే అప్పటి వరకూ కేవలం యాంకరింగ్ పాత్రకే పరిమితమైన ఇషాన్ ఒక్కసారిగా గేర్ ఛేంజ్ చేసి ఉప్పల్లో ఉప్పెన సృష్టించాడు.
కేవలం 47 బంతుల్లో 11 ఫోర్లు ఆరు సిక్స్ లతో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి , క్లాసెన్ కూడా బౌలర్లతో ఆటాడుకున్నారు.
వీరి విజృంభణతో నిర్ణీత ఓవర్లలో సన్ రైజర్స్ 286 పరుగులు చేయగలిగింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఇంతకుముందు సంవత్సరం ఆర్సీబీపై ఎస్ఆర్ హెచ్ 287 పరుగులు సాధించి, అత్యధిక పరుగులు సాధించిన జట్టుపై తన పేరు పైనే రికార్డు లిఖించుకుంది.
ఆరంభంలో తడబ్యాటు.. తరువాత ఉప్పెన.. చివర్లో ..
భారీ లక్ష్య చేధనలో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఒపెనర్ జైస్వాల్ సరిగా ఆడలేకపోయాడు. త్వరగానే మూడు వికెట్లు కోల్పోయి భారీ పరాజయం దిశగా ప్రయాణించింది. చివరకు 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు మాత్రమే చేయగలిగింది.
రాణించిన జురెల్- సంజు శాంసన్
ఓపెనర్ జైస్వాల్ ఒక పరుగు కి ఔట్ అయిపోయాడు. సంజు శాంసన్ స్థానంలో తాత్కాలిక కెప్టెన్ గా వచ్చిన పరాగ్ కూడా పెద్దగా పరుగులేమి చేయలేదు. నితీష్ రానా కూడా 11 పరుగులకు పెవిలియన్ చేరాడు.
కానీ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సంజూ శాంసన్ కు జతగా, మరో వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ధృవ్ జురెల్ రావడంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. ఇద్దరు పోటీ పడి ఎడాపెడా హైదరాబాద్ బౌలర్లను ఉతికి ఆరేశారు. దీంతో 12 ఓవర్లలో జట్టు స్కోర్ 130 దాటింది. దీనితో మ్యాచ్ చేజారిపోయిందా అని అభిమానుల్లో కంగారూ మొదలైంది.
జూరెల్ 35 బంతుల్లో 70 (5x4, 6x6) పరుగులు సాధించాడు. శాంసన్ 37 బంతుల్లో 66 పరుగులు జోడించాడు. జురేల్ తో శాంసన్ నాలుగో వికెట్ కు 111 పరుగులు చేశారు. అయితే సంజు శాంసన్ ని హర్షల్ పటేల్ అవుట్ చేయడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. చివరలో హిట్ మేయర్, శుభం దుబే కలిసి 80 పరుగులు జోడించినప్పటికీ అవి ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాయి.
ఓటమికి అనేక కారణాలు..
భారీ ఛేదనలో మంచి ఆరంభం ముఖ్యం. కానీ యశస్వి జైస్వాల్, కెప్టెన్ రియాన్ పరాగ్ విఫలం కావడంతో జట్టుపై ఒత్తిడిని పెంచింది. కర్ణుడు చావుకి కారణాలు అనేకం అన్నట్టు, రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడానికి కూడా అన్నే కారణాలు ఉన్నాయి.
మొదటిది అనుభవం లేని యువ ఆటగాడు రియాన్ పరాగ్ ను కెప్టెన్ గా చేయాల్సిన రావడం. రెండవ అంశం రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ పెద్దగా ప్రభావం చూపలేకపోవడం.
రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ మూల స్తంభాలైన ఆర్చర్, సందీప్ శర్మ, మహిషా తీక్షణ తమ తమ బౌలింగ్ లో 50 పరుగులు పైన సమర్పించుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాట్స్మెన్లను వీరు కూడా కట్టడి చేయలేకపోయారు. అదే జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. మొదట్లో ఒకటి రెండు క్యాచులు కూడా వదిలేయడం, బౌలింగ్లో పదును, పస లేకపోవడం వల్ల హైదరాబాద్ బ్యాట్స్ మెన్లు చెలరేగిపోయారు.
స్కోర్ వివరాలు:
ఎస్ ఆర్ హెచ్ బ్యాటింగ్:
=================
286/6 వికెట్లకి (20 ఓవర్లు)
హెడ్ 67 (31 బంతులు, 9 ఫోర్లు, 3 సిక్సర్లు)
ఇషాన్ కిషన్ 106 (47 బంతులు, 11 ఫోర్లు, 6 సిక్సర్లు)
క్లాసెన్ 56 (31 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్సర్)
రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్
======================
తీక్షణ 2 వికెట్లు (4 ఓవర్లు)
దేశ్ పాండే,3 వికెట్లు (4 ఓవర్లు)
సందీప్ శర్మ 1 వికెట్ (4 ఓవర్లు)
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్:
=====================
242/6 వికెట్లకి (20 ఓవర్లు)
సంజు సాంసంగ్ 66 ( 37 బంతులు 7 ఫోర్లు 4 సిక్సర్లు)
జురెల్ 70( 35 బంతులు ఫోర్లు 5 ఫోర్లు 6 సిక్సర్లు)
హెట్ మేయర్ 42(23 బంతులు, 1 ఫోర్, 4 సిక్సర్లు)
సన్ రైజర్స్ బౌలింగ్
===============
మహమ్మద్ షమీ,1 వికెట్( 3 ఓవర్లు)
సిమర్జిత్ సింగ్, 2 వికెట్లు (3 ఓవర్లు)
హర్షల్ పటేల్ 2 వికెట్లు (4 ఓవర్లు)