ఐపీఎల్: వరుసగా రెండో మ్యాచ్ లో ఓటమి పాలైన ముంబాయి ఇండియన్స్

రాణించిన సాయి సుదర్శన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖాతా తెరిచిన గుజరాత్ టైటాన్స్;

Update: 2025-03-29 20:55 GMT
జీటీ ఆటగాడు సాయి సుదర్శన్

ఐపీఎల్ లో ఐదుసార్లు ఛాంపియన్ అయినా ముంబై, ఈ సీజన్ లో వరుసుగా రెండో ఓటమిని నమోదు చేసింది. అహ్మాదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన  మ్యాచ్ లో ఎంఐ 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ సీజన్ లో జీటీ తన ఖాతాను తెరిచింది.

నరేంద్ర మోదీ స్టేడియలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన జీటీ నిర్ణీత ఓవర్లలో 196 పరుగులు సాధించింది. బదులుగా ముంబై 20 ఓవర్లలో 160/6 కే పరిమితమైంది.
గుజరాత్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 2/18 రాణించి, ఎంఐ దూకుడుకి కళ్లెం వేశాడు. మార్చి 23న సీఎస్కే చేతిలో ముంబై ఓటమి పాలవగా, మార్చి 25న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో జీటీ ఓటమి పాలైంది.
సూర్య పోరాడిన..
197 పరుగుల లక్ష్యాన్నిఛేదించడానికి బరిలోకి దిగిన ముంబై ఈ మ్యాచ్ లో ఇన్సింగ్స్ ను పేలవంగా ప్రారంభించింది. ఒపెనర్ రోహిత్ శర్మ, సిరాజ్ ప్రారంభించిన ఓవర్ లో మొదటి మూడు బంతుల్లో రెండు ఫోర్లు సాధించి మంచి ఊపు మీద ఉన్నట్లు కనిపించినా, తరువాత బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఈ హైదరాబాదీ తన రెండో ఓవర్ లోనే మరో ఒపెనర్ ర్యాన్ రికిల్ టన్ ను సైతం బుట్టలో వేసుకున్నాడు. ఇలా పవర్ ప్లే ముగిసే వరకూ ముంబై రెండు వికెట్లు కోల్పోయింది.
వన్ డౌన్ లో వచ్చిన తిలక్ వర్మ వచ్చి రాగానే రబాడా బౌలింగ్ లో ఎదురుదాడికి దిగాడు. ఫోర్లు, సిక్స్ లతో హోరెత్తించాడు. అయితే తరువాత తేరుకున్న జీటీ కట్టుదిట్టమైన బంతులు సంధించడంతో పరుగులు రావడం గగనమైపోయింది.
ఈ స్థితిలో సూర్య కుమార్ వచ్చి దూకుడుగా ఆడటం మొదలు పెట్టాడు. 28 బంతుల్లో 48 పరుగులు సాధించాడు. స్కై మ్యాన్ ఇన్నింగ్స్ లో నాలుగు సిక్స్ లు, ఒక ఫోర్ బాదాడు. తిలక్- సూర్య జోడి 62 పరుగులు జోడించి మ్యాచ్ ను మలుపు తిప్పే ప్రయత్నం చేశారు.
అయితే ప్రసిద్ధ్ రాకతో మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయింది. 12 ఓవర్ లో బౌలింగ్ కు దిగిన ఈ యంగ్ బౌలర్ 14 డాట్స్ బాల్స్ సంధించాడు. రాహుల్ తెవాటియా బౌలింగ్ షాట్ కు ప్రయత్నించి తిలక్ వర్మ పెవిలియన్ చేరగా, తరువాత వెంటనే సూర్య, హార్దిక్ పాండ్యా తో సహా మరో మూడు వికెట్లు కోల్పోవడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. చివరి ఐదు ఓవర్లలో 79 పరుగులు సాధించాల్సి ఉండగా, ఎంఐ బ్యాట్స్ మెన్లు ఒత్తిడికి చిత్తయ్యారు.
సుదర్శన్ ఇన్సింగ్స్ అదుర్స్..
అంతకుముందు జీటీ బ్యాట్స్ మెన్ సాయి సుదర్శన్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 63 పరుగులతో రాణించాడు. గిల్ -సాయి జోడి పవర్ ప్లే ముగిసే నాటికి 78 పరుగులు జోడించారు. తరువాత బట్లర్ కూడా దూకుడిగా ఆడటంతో 200 పరుగులను సులువుగా చేరుతుందని అనిపించింది.
కానీ పాండ్యా, బౌల్ట్ కట్టుదిట్టంగా బంతులు సంధించడంతో చివర్లో దాని దూకుడుకు బ్రేక్ లు పడ్డాయి. ముఖ్యంగా 18 ఓవర్ లో సాయి సుదర్శన్ ను ఎల్బీగా వెనక్కి పంపిన కీవీ పేసర్, జీటీని రెండువందల లోపే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 

పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన సుదర్శన్ ఈ మ్యాచ్ లో దాన్ని కొనసాగించాడు. రెండో ఓవర్ లో బౌల్ట్ బౌలింగ్ లో రెండు ఫోర్లతో పరుగుల వేట ప్రారంభించిన ఈ తమిళనాడు ఓపెనర్, స్పిన్నర్ ముజిబ్ వేసిన మూడో ఓవర్ లో ఓ ఫోర్, సిక్స్ లతో స్వాగతం పలికాడు.
గిల్- సాయి ప్రతి ఓవర్ కు తొమ్మిది పరుగులు సాధించేలా జాగ్రత్త పడ్డారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ వచ్చాడు. ఈ జోడి కుదురుకున్న తరువాత బౌలింగ్ కు దిగిన పాండ్యా, కెప్టెన్ గిల్ ను స్లో బౌన్సర్ ద్వారా పెవిలియన్ కు పంపాడు.
నిరాశ పరిచిన ఎంఐ ఫీల్డింగ్..
ఈ మ్యాచ్ లో ముంబై ఫీల్డింగ్ ఏ మాత్రం బాగాలేదు. ఒక పరుగు రావాల్సిన చోట రెండు పరుగులు ఇచ్చాడు. నరేంద్ర మోదీ స్టేడియంలోని బ్లాక్ సాయిల్ పిచ్ పై ఈ మ్యాచ్ జరిగింది.
ఆరంభంలో దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ల జోడికి కుదురుకోవడానికి ఫీల్డింగ్ తప్పిదాలే ఉపయోగపడ్డాయి. బట్లర్ ఇచ్చిన క్యాచ్ ను ఆరంభంలోనే ముంబై ఫీల్డర్లు వదిలేశారు. బౌండరీ లైన్ దగ్గర సింగల్ రావాల్సి ఉండగా, దానికి మరో మూడు అదనపు పరుగులు సమర్పించుకున్నారు. అనసవర ఓవర్ త్రోలతో ప్రత్యర్థికి వేగానికి తమ వంతు సహకారం అందించారు.
బట్లర్ కు లైఫ్ ఇచ్చాక, అతను స్పిన్నర్ శాంటర్న్ లక్ష్యంగా చేసుకుని పరుగులు సాధించడానికి ప్రయత్నించాడు. ఓ సిక్స్, ఫోర్ తో పరుగుల వేటను ప్రారంభించాడు.
24 బంతుల్లోనే 39 పరుగులు సాధించి మూమెంటంను జీటీ వైపు మళ్లించాడు. ఆంధ్ర ఆటగాడు సత్యనారాయణ రెండో మ్యాచ్ లో అవకాశం దక్కించుకున్నప్పటికీ గల్లీ స్థాయి ఆటతీరును ప్రదర్శించి, నిరాశ పరిచాడు.
Tags:    

Similar News