ధోని సామర్థ్యం ఇంకా అలాగే ఉంది: రుతురాజ్ గైక్వాడ్
యువ ఆటగాళ్లు మాజీ కెప్టెన్ లా ఆడటానికి ప్రయత్నిస్తున్నారన్న సీఎస్కే కెప్టెన్;
By : The Federal
Update: 2025-03-23 11:11 GMT
ధోని ఈ వయస్సులో కూడా అత్యద్భుంగా ఆటలో పూర్తి స్థాయి టచ్ లో ఉన్నాడని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నారు. ప్రస్తుతం ధోని వయస్సు 43 సంవత్సారాలు అయిన అతని సామర్థ్యం మాత్రం కెప్టెన్ ధోనిలాగే ఉందని కితాబునిచ్చారు.
నేడు ఐపీఎల్ లో తొలి మ్యాచ్ లో చెన్నై మరో బలమైన జట్టు ముంబై ఇండియన్స్ తో చెన్నై వేదికగా తలపడబోతోంది. ఇరు జట్లలో భారీగా హిట్టర్లు ఉండడంతో స్కోర్ బోర్డు పరుగు పెట్టడం గ్యారెంటీ అని, ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తాయని లెక్కలు ఉన్నాయి.
ధోని బాల్ స్ట్రైకింగ్..
సీఎస్కే మాజీ కెప్టెన్ ధోని, గత సంవత్సరం ఐపీఎల్ లో సాధారణంగా ఏడు లేదా ఎనిమిదో స్థానలో వచ్చినట్లే దిగువ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.
‘‘చాలామంది కొత్త ఆటగాళ్లు జట్టులో చేరారు. కొన్ని సార్లు ధోని వచ్చి ప్రస్తుతం బంతిని కొడుతున్నంత బాగా కొట్టడానికి వారు కష్టపడుతున్నారు. కాబట్టి, ఇది కచ్చితంగా నాతో సహా మాలో చాలామందికి స్ఫూర్తినిస్తుంది’’ అని గైక్వాడ్ శనివారం మీడియాతో అన్నారు.
‘‘కాబట్టి ధోని 43 సంవత్సరాల వయస్సులో ఏమి చేస్తున్నాడో, దానిని గొప్పగా నేను భావిస్తున్నాను. గత రెండు సంవత్సరాలుగా మేము కొత్త వ్యూహాలకు పదును పెట్టాం.
ఇప్పుడు జట్టుకు మాకు అవసరమైన నాక్ లను అందిస్తూనే ఉంటాడని ఆశిస్తున్నాను’’ అని గైక్వాడ్ చెప్పారు. లోయర్ ఆర్డర్ హార్డ్ హిట్టర్ పాత్రను దృష్టిలో ఉంచుకుని ధోని నెట్స్ లో శిక్షణ పొందుతున్నాడని గైక్వాడ్ అన్నారు.
ప్రస్తుతం ధోని వీలైనన్నీ ఎక్కువ సిక్సర్లు కొట్టడానికి సాధన చేస్తున్నాడు. మాజీ కెప్టెన్ పూర్తి స్థాయి టచ్ లోకి రావడానికి ముమ్మరంగా సాధన చేస్తున్నాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా 50 సంవత్సరాల వయస్సులో మాస్టర్స్ లీగ్ లో గొప్పగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ ప్రకారం చూస్తే ధోనికి ఇంకా చాలా సంవత్సరాలు మిగిలి ఉన్నాయని నేను నమ్ముతున్నానని గైక్వాడ్ అన్నారు.
స్లో పిచ్..
గత సంవత్సరం వేలంలో కొత్తగా కొనుగోలు చేసిన ఆటగాళ్లు చెన్నై స్లో పిచ్ కు అలవాటు పడాలని గైక్వాడ్ అన్నారు. అన్ని విభాగాలను కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
రవీంద్ర జడేజా, అశ్విన్, నూర్ అహ్మాద్ లతో కూడిన బౌలింగ్ యూనిట్ శక్తి ఈ ఐపీఎల్ లో వేదికల మీద అంతటా జట్లకు భారీ సవాలు విసురుతుందని గైక్వాడ్ అన్నారు.
మా బౌలర్లు దూకుడుగా క్రమం తప్పకుండా వికెట్లు తీయగలరని నేను నమ్ముతున్నామని కెప్టెన్ అన్నారు. ‘‘వీరు అంతా ఏ రకమైన వికెట్లపై అయినా ఉత్తమంగా రాణించగలుగుతారు’’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.