ఐపీఎల్: రెండో మ్యాచ్ లోనూ చిత్తయిన సన్ రైజర్స్, ఢిల్లీ చేతిలో ఓటమి

ఢిల్లీ క్యాపిటల్స్ కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయిన ఆరెంజ్ ఆర్మీ;

Update: 2025-03-30 15:16 GMT
ఢిల్లీ క్యాపిటల్ ఆటగాళ్లు

గ్రౌండ్ మారిన హైదరాబాద్ బ్యాట్స్ మెన్ల మైండ్ సెట్ మాత్రం మారలేదు. బంతిని నేల మీది కంటే గాల్లోనే ఎక్కువగా ఉంచడానికి ప్రయత్నించి మరోసారి బొక్కబొర్లా పడ్డారు.

తమ జట్టు బలం, బలహీనతలతో పాటు ప్రత్యర్థి జట్టు వ్యూహాత్మక ఎత్తును అర్థం చేసుకోవడంలో విఫలం అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో మ్యాచ్ లో ఓటమి పాలైంది.

రెండు రోజుల క్రితం ఉప్పల్ వేదికగా లక్నో తో జరిగిన మ్యాచ్ లో కాస్త గౌరవప్రదంగా ఓటమి మూటగట్టుకున్న ఎస్ఆర్ హెచ్, వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో గల్లీ స్థాయి ఆటతీరును ప్రదర్శించి భారీ ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది.

పట్టుమని పది నిమిషాలు కూడా క్రీజులో ఉండటానికి ఎస్ఆర్ హెచ్ బ్యాట్స్ మెన్ ఆసక్తి చూపకపోవడంతో 16 ఓవర్లలో కేవలం 163 పరుగులకే చాప చుట్టేసింది. ఈ మ్యాచ్ లో అనికేత్ వర్మ ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడి చేసి 74 పరుగులు సాధించడంతో ఎస్ఆర్ హెచ్ కు కనీసం గౌరవప్రదమైన స్కోర్ దక్కింది.

ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ 5/34 సత్తాచాటడంతో పాటు, ఫాప్ డుప్లెసిస్ అర్థ సెంచరీ, పొరెల్ దూకుడుతో ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్ విజయం సాధించింది.
ఎదురుదాడి చేసిన డు ప్లెసిస్..
లక్ష్యం ఏ మాత్రం పెద్దది కాకపోవడతో డీసీ బ్యాట్స్ మెన్ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా డు ప్లెసిస్.. కెప్టెన్ కమిన్స్ బౌలింగ్ లో వరుసగా సిక్స్ లు బాది బౌలర్ల లయను దెబ్బతీశాడు.
అయితే మరో ఎండ్ లో ఉన్న మెక్ ఫ్రేజర్ షాట్లు ఆడటానికి బాగా ఇబ్బంది పడ్డాడు. కానీ క్రీజులో నిలబడటానికి ప్రయత్నించాడు. అయితే ఈ ఇబ్బంది స్కోర్ బోర్డు మీద పడకుండా డుప్లెసిస్ ప్రయత్నించాడు. 
ఈ ప్రోటీస్ మాజీ ఆటగాడు కేవలం 26 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించి డీసీ విజయానికి బాటలు వేశాడు. తన అర్థసెంచరీలో మూడు ఫోర్లు, మూడు సిక్స్ లు ఉన్నాయి. ఈ అర్థ సెంచరీ ద్వారా 40 వ వయస్సులో ఐపీఎల్ లో అర్థ సెంచరీ సాధించిన గిల్ క్రిస్ట్, క్రిస్ గేల్ సరసన డు ప్లెసిస్ నిలిచాడు.
జీషన్ అన్సారీ..
ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీని బరిలోకి దింపింది. ఈ స్పిన్నర్ ధాటిగా ఆడుతున్న డు ప్లెసిస్ ను పెవిలియన్ పంపాడు. వియాన్ ముల్డర్ తీసుకున్న రన్నింగ్ క్యాచ్ ద్వారా ఈ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఇన్నింగ్స్ కు తెరపడింది.
తన తరువాత ఓవర్లలో మెక్ గుర్క్, కేఎల్ రాహుల్ ను సైతం పెవిలియన్ పంపి, ఢిల్లీ జోరుకు కాస్త బ్రేకులు వేశాడు. జీషన్.. రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్ లతో కలిసి అండర్ 19 ప్రపంచకప్ ఆడాడు.
అయితే మూడు వికెట్లు పడిన ఢిల్లీ యువ బ్యాట్స్ మెన్ అభిషేక్ పొరెల్ ఎదురుదాడికి దిగా ఎడాపెడా బౌండరీలు బాదడంతో ఎస్ఆర్ హెచ్ కి ఓటమి తప్పలేదు. పొరెల్ 18 బంతుల్లో 34 పరుగులు సాధించాడు. ఇతనికి ట్రిస్టన్ స్టబ్స్ (21) సహకారం అందించాడు. 

అనికేత్.. హిట్టింగ్..
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్ హెచ్ పవర్ ప్లే ముగిసే నాటికే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. కానీ హైదరాబాద్ కనీసం ఆ మాత్రం స్కోర్ అయినా బోర్డు పైన పెట్టగలిగింది అంటే దానికి అనికేత్ వర్మ నే కారణం.
ఈ మధ్య ప్రదేశ్ బ్యాటర్ 41 బంతుల్లోనే 74 పరుగులు సాధించాడు. బౌలర్ ఎవరనేది చూడకుండా తన హర్డ్ హిట్టింగ్ తో బంతిని బౌండరీ లైన్ దాటించడమే లక్ష్యంగా బాదేశాడు.
వర్మ బ్యాటింగ్ లో ఆరు సిక్స్ లు, ఐదు ఫోర్లు ఉన్నాయి. వైజాగ్ పిచ్ లో తెలివిగా ఎలా బ్యాటింగ్ చేయాలో అనికేత్ వర్మ చూపించాడు. కానీ హైదరాబాద్ టాప్ ఆర్డర్ మాత్రం, పిచ్, బౌలర్లతో సంబంధం లేకుండా ఆడాలని చూసి పెవిలియన్ చేరారు.
ఆరోసారి హెడ్ ను అవుట్ చేసిన స్టార్క్..
చాలాకాలంగా భారత బౌలర్లకు కొరుకుడు పడని కొయ్యగా ఉన్న ఆసీస్ బ్యాట్ మెన్ ట్రావిస్ హెడ్.. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోనూ, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, మొన్న జరిగిన బోర్డర్ -గవాస్కర్ ట్రోఫిలో హెడ్ దూకుడును ఆపడం మన బౌలింగ్ వల్ల కాలేదు.
కానీ ఆసీస్ కే చెందిన మిచెల్ స్టార్క్ మాత్రం హెడ్ వికెట్ ను మంచి నీళ్ల ప్రాయంగా తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వివిధ లీగ్ లలో ఏకంగా ఆరుసార్లు హెడ్ వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రోజు కూడా స్టార్క్ సంధించిన బౌన్సర్ ఆడే ప్రయత్నంలో కీపర్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
స్టార్క్ అంతకుముందు ఇషాన్ కిషన్ తో పాటు లోకల్ బాయ్ నితీష్ కుమార్ రెడ్డిలను ఒకే ఓవర్ లో పెవిలియన్ పంపాడు. దీనితో ఎస్ఆర్ హెచ్ 25 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
స్టార్క్ వేసిన పేస్ డెలివరీని కట్ చేయడానికి ప్రయత్నించి ఇషాన్, డీప్ బ్యాక్ వర్డ్ పాయింట్ వద్ద స్టబ్స్ చేతికి చిక్కగా, నితీష్ ఆఫ్ కట్టర్ ను పుల్ చేయడంతో మిడ్ ఆన్ లో అక్షర్ చేతికి క్యాచ్ ఇచ్చాడు.
కానీ అనికేత్ వర్మ రాకతో స్కోర్ బోర్డు లో మెల్లగా కదలిక ప్రారంభమైంది. ఈ యువ బ్యాట్స్ మెన్ కు క్లాసెన్ తోడుగా నిలబడంతో ఐదు వికెట్ కు 77 పరుగుల భాగస్వామ్యం నమోదు అయింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని మోహిత్ శర్మ విడదీశాడు.
అనికేత్ ఈ మ్యాచ్ లో స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని పరుగులు సాధించాడు. ముఖ్యంగా ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ లో నాలుగు భారీ సిక్స్ లు బాదేశాడు.
నిజానికి అనికేత్ ఆరు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరాల్సింది. కానీ ఈ క్యాచ్ ను తీసుకోవడంలో పొరెల్ జారవిడిచాడు. మొత్తానికి అనికేత్ వర్మ 194 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్ సెంచరీ చేస్తాడా అనే అనుమానం సైతం వచ్చింది. కానీ చివరకు కుల్దీప్ యాదవ్ అతని ఇన్సింగ్స్ కు ముగింపు పలికాడు.
Tags:    

Similar News