తల్లిదూరమైనా.. ఆట దగ్గరైంది.. బేసిక్ ధర.. తొలి మ్యాచ్ లో డకౌట్.. అయితే

హైదరాబాద్ యువ బ్యాటింగ్ సంచలనం అనికేత్ వర్మ క్రికెట్ ప్రయాణం..;

Update: 2025-03-31 05:19 GMT
అనికేత్ వర్మ

విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా సన్ రైజర్స్ తరఫున కొత్త హార్డ్ హిట్టర్ వెలుగులోకి వచ్చాడు. నాలుగు వికెట్లు పడిపోయి కష్టాల్లో ఉన్నప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా బ్యాటింగ్ చేసిన యువ సంచలనమే అనికేత్ వర్మ.

అతని క్రికెట్ కెరీర్ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీలో జన్మించిన అనికేత్ వర్మ తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. దీనితో భోపాల్ లోని తన మేనమామ ఇంటి దగ్గరే పెరిగాడు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా క్రికెట్ ను వదలకుండా తన ప్రయాణాన్ని కొనసాగించాడు.
నిరుడు జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో తనని రూ. 30 లక్షల బేసిక్ ధరకు ఎస్ఆర్ హెచ్ కొనుగోలు చేసింది. అనికేత్ ఎప్పుడూ సీనియర్ స్థాయిలో క్రికెట్ ఆడే అవకాశం లభించలేదు.
అయితే డిసెంబర్ 3, 2024న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫిలో భాగంగా మధ్యప్రదేశ్ తరఫున హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో తొలి మ్యాచ్ ఆడాడు. అయితే అందులో డకౌట్ గా వెనుదిరిగాడు. 
మధ్య ప్రదేశ్ కు చెందిన 23 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాట్స్ మెన్ స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని భారీ సిక్స్ లు బాదీ అందరి దృష్టిని ఆకర్షించాడు. కేవలం 34 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ అర్థ సెంచరీ సాధించాడు. ఒక దశలో సెంచరీ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ బౌండరీ లైన్ దగ్గర జేక్ ఫ్రేజర్ అందుకున్న అద్భుతమైన క్యాచ్ కు పెవిలియన్ చేరాడు. ఈ యువ ఆటగాడు 41 బంతుల్లోనే 74 పరుగులు సాధించాడు.
అక్షర్ బౌలింగ్ లో ఎదురుదాడి..
టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన ఎస్ఆర్ హెచ్ కు ఆదిలోనే షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ ధాటికి 25 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. నితీష్ కుమార్ డకౌట్ గా వెనుదిరిగిన తరువాత బ్యాటింగ్ కు వచ్చిన ఈ యువ ఆటగాడికి స్టార్క్ మొదటి బంతినే బౌన్సర్ తో స్వాగతం పలికాడు.
అయితే తరువాత బంతినే ప్లిక్ చేసి బౌండరీతో తన ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ తన అటాకింగ్ గేమ్ ను విడిచిపెట్టనని స్పష్టం చేశాడు. క్రీజులో ఉన్నంత సేపు అలాగే ఆడాడు. తరువాత డీసీ కెప్టెన్ అక్షర్ బౌలింగ్ వరుసగా సిక్స్ లు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ అరంగ్రేటం చేసిన అనికేత్.. ఆ మ్యాచ్ లో కేవలం 7 పరుగులే చేశాడు. నిజానికి అతనికి పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు.
తరువాత లక్నో తో జరిగిన మ్యాచ్ లో 36 పరుగులు సాధించాడు. భారీ సిక్స్ లు బాదీ తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని చూపించాడు.
టీ20 లో విఫలమైన బీసీసీఐ నిర్వహించిన అండర్ 23 వన్డే టోర్నమెంట్ లో అనికేత్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కర్ణాటక తో జరిగిన మ్యాచ్ లో 75 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్స్ లతో 101 పరుగులు సాధించాడు. మొత్తం టోర్నమెంట్ లో 152 స్ట్రైక్ రేట్ కొనసాగించడం విశేషం. అది కూడా వన్డే టోర్నమెంట్ లో...
అలాగే మధ్య ప్రదేశ్ లీగ్(ఎంపీఎల్) లో కూడా తన విశ్వరూపం చూపాడు. మొత్తం టోర్నమెంట్ లో 205 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. అందులో ఒక మ్యాచ్ లో భోపాల్ లెపార్డ్స్ తరఫున బరిలోకి దిగి 41 బంతుల్లోనే 123 పరుగులు సాధించాడు.
ఇందులో 13 సిక్సర్లు, ఎనిమిది ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో అతని స్ట్రైక్ రేట్ 300 కావడం గమనార్హం. అనికేత్ విజృంభణతో భోపాల్ 20 ఓవర్లలో 278/4 సాధించింది. 

మేనమామ పెంపకం..
అనికేత్ చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. ‘‘ ఆరునెలల వయస్సులోనే తన కోసం తీసుకొచ్చిన బొమ్మలలో కేవలం బ్యాట్, బంతి మాత్రమే తీసుకుని ఆడేవాడు’’ అని మేనమామ గుర్తు చేసుకున్నాడు.
‘‘నేను క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడూ మా కుటుంబంలోని వారు మద్దతు ఇచ్చేవారు కాదు. మేము ఆర్థికంగా ఉన్నవాళ్లం కాదు. అయితే మా మామయ్యకు క్రికెట్ అంటే ఇష్టం.
ఆయనే మద్దతు ఇచ్చేవాడు. నాకు కూడా ఆసక్తి ఉందని ఆయన గ్రహించాడు. నువ్వు ఆటతో ఉండు.. నేను నీతో ఉంటా అని భరోసా ఇచ్చాడు. దేనీ గురించి పట్టించుకోకు అని భరోసా ఇచ్చారు.
తన సొంత అవసరాలు పక్కన పెట్టి, నా క్రికెట్ అవసరాలు తీర్చేవాడు’’ అని అనికేత్ ఇటీవల ఓ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
అనికేత్ 10 సంవత్సరాల వయస్సులో భోపాల్ లోని అంకుర్ క్రికెట్ అకాడమీలో చేరాడు. అక్కడ అతనికి కోచ్ జ్యోతి ప్రకాశ్ త్యాగి క్రికెట్ ఓనమాలు నేర్పాడు.
‘‘అమిత్ తన మేనల్లుడిని ప్రతిరోజు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న అకాడమీకి తీసుకొచ్చేవాడు. అతను పనిలో ఉన్నప్పుడూ సైకిల్ పై వచ్చేవాడు. అలా తన వామప్ ను ముగించేవాడు. మొదటి నుంచి తన సహచరుల కంటే భిన్నంగా ఉన్నాడని త్యాగి గుర్తించాడు. ’’ అని క్రిక్ బజ్ తెలిపింది.
‘‘అంకుర్ లీగ్ లో ఒక మ్యాచ్ జరిగింది. నేను 256 పరుగులు సాధించాను. ’’ అని అనికేత్ చెప్పాడు. ఆ ఆట చూశాక నేను కచ్చితంగా 400 పరుగులు చేస్తానని సార్ చెప్పారని వర్మ గుర్తు చేసుకున్నాడు.
ప్రస్తుతం జరిగే ఐపీఎల్ లో అత్యధిక సిక్స్ లు బాదాలని నేను కోరుకుంటున్నాన్నని, దీనికోసం బాగా సాధన చేస్తున్నట్లు చెప్పాడు.
Tags:    

Similar News