పంజాబ్ రాతను ‘అయ్యర్’ మారుస్తాడా?
నేడు ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తో ఢీ కొంటున్న పంజాబ్ కింగ్స్;
By : The Federal
Update: 2025-03-25 08:00 GMT
ఐపీఎల్ లో ఎన్నో జట్లు అనేక ఎత్తుపల్లాలు చూశాయి. ఒక సీజన్ లో అంచనాలను అందుకోలేకపోయినా, మరో సీజన్ లో రాణించి రన్నరప్ లో గాని, మూడో, నాలుగో స్థానంలో గాని నిలిచాయి.
కానీ అన్ని సీజన్ లో ఏ మాత్రం రాణించలేని జట్టు ఏదైనా ఐపీఎల్ లో ఉందంటే అది పంజాబ్ కింగ్స్ మాత్రమే. ఎంతమంది కొత్త ఆటగాళ్లను తీసుకున్నా, ఎంతమంది కెప్టెన్లను మార్చినా, ఆఖరిని పంజాబ్ ఎలెవన్ కింగ్స్ నుంచి పంజాబ్ కింగ్స్ గా మారిన దాని తలరాత మాత్రం మారలేదు.
కానీ మొన్న జరిగిన మెగా వేలంలో ఆటగాళ్లందరిని వదిలిపెట్టిన పంజాబ్ యాజమాన్యం రూ. 26 కోట్లకు శ్రేయర్ అయ్యర్ ను కొనుగోలు చేసి పగ్గాలు అప్పగించింది. ఈ సీజన్ లో ఎలాగైనా కప్ సాధించాలని పట్టుదలగా ఉంది.
నేడు ఆ జట్టు తన తొలి మ్యాచ్ ను గుజరాత్ టైటాన్స్ తో తలపడబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరు పొందిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ సాయంత్రం జరగబోతోంది.
ఐపీఎల్ లో మంచి రికార్డు..
శ్రేయస్ అయ్యర్ కు ఐపీఎల్ లో మంచి రికార్డు ఉంది. నాలుగు సంవత్సరాల క్రితం ఢిల్లీ క్యాపిటల్స్ ను ఫైనల్ కు తీసుకెళ్లగా, చివరి ఐపీఎల్ లో కోల్ కత నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఆ జట్టుకు టైటిల్ అందించాడు.
ఇప్పుడు తాజాగా పంజాబ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. తొలి ఐపీఎల్ టైటిల్ కోసం 18 సంవత్సరాల నిరీక్షణకు అయ్యర్ తెరదించుతాడని ఆ జట్టు యాజమాన్యం భావిస్తోంది.
పంజాబ్ జట్టు 2018 లో ఒకసారి సెమీ ఫైనల్ చేరుకుంది. 2014 లో ఫైనల్ చేరుకుంది కానీ కప్ ను మాత్రం ఒడిసిపట్టలేకపోయింది. గత నాలుగు సీజన్ లలో జట్టు కనీసం టాప్ ఫోర్ లోకి కూడా వెళ్లలేకపోయింది.
ప్రస్తుతం అయ్యర్ కు జతగా కోచ్ రికీ పాంటింగ్ ఉన్నాడు. ఈ ఇద్దరు విజయవంతమైన సారథులు జట్టును విజయతీరాలను నడిపిస్తారని పంజాబ్ అభిమానుల్లో ఆశలు రేపుతున్నారు.
గుజరాత్ పరిస్థితి..
గుజరాత్ తాను అడుగుపెట్టిన తొలి ఏడాదే టైటిల్ ఎగరేసుకుపోయింది. రెండో ఏడు రన్నరప్ గా నిలిచిన జట్టు, కింద ఏడాది మాత్రం ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. హార్డిక్ పాండ్యా జట్టును వదిలిపెట్టాక అనుకున్నంత మేర రాణించలేకపోయింది.
కెప్టెన్ గా యువ ఆటగాడు శుభ్ మన్ గిల్ నాయకత్వంపై విమర్శలు వ్యక్తం అయినప్పటికీ ఈ సీజన్ లో కూడా అతని నాయకత్వంపై యాజమాన్యం నమ్మకం పెట్టింది. కోచ్ ఆశీశ్ నెహ్రాతో కలిసి జట్టు మరోసారి టైటిల్ దిశగా నడిపిస్తారని బలంగా విశ్వసిస్తోంది.
అయ్యర్, గిల్ ఇద్దరు కూడా ఇటీవల జరిగిన టోర్నమెంట్లలో తమ ఫామ్ ను చాటుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫిలో జరిగిన మ్యాచ్ లో అయ్యార్ స్థిరంగా రాణించాడు. ఆడిన ఐదు మ్యాచుల్లో 243 పరుగులు సాధించాడు. అది కూడా దుబాయ్ స్లో పిచ్ లపై దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. గిల్ ఆరంభంలోనే ఓ సెంచరీ సాధించాడు.
గుజరాత్ ఎక్కువగా జోస్ బట్లర్ పైనే ఆశలు పెట్టుకుంది. అలాగే మిడిల్ ఆర్డర్ లో రూథర్ ఫోర్డ్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, గ్లెన్ ఫిలప్స్ పైనే ఆధారపడి ఉంది. బౌలర్ల విషయానికి వస్తే రషీద్ ఖాన్, రబాడ, ప్రసిద్ద్ కృష్ణ, జెరాల్డ్ కోట్జీ వంటి వారు ఉన్నారు. రషీద్ కు తోడుగా మరో స్పిన్నర్ సాయి కిషోర్ తుది జట్టులో ఆడుతారని అంచనాలు ఉన్నాయి.
పంజాబ్ బ్యాటింగ్..
అయ్యర్ తో పాటు ఆసీస్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ జోష్ ఇంగ్లీష్ ఉన్నాడు. వీరితో పాటు ప్రభ్ సిమ్రాన్ సింగ్, మార్కస్ స్టాయినిస్, గ్లెన్ మాక్స్ వెల్, అజ్మతుల్లా ఒమర్జాయ్ మార్కో యాన్సెన్, షహాంక్ సింగ్, ముషీర్ ఖాన్ ఉన్నారు. వీరు ఆల్ రౌండర్లు కూడా కావడం మరో అదనపు ప్రయోజనం. బౌలింగ్ లో లాకీ ఫెర్గూసన్, కుల్దీప్ సేన్, యష్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహాల్, స్పిన్నర్ హార్ ప్రీత్ బార్ వంటి వారు ఉన్నారు.
ఈ మ్యాచ్ రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది.