వినోదంతో పాటు వివాదాలు, ఐపీఎల్ కౌంట్ డౌన్ 4
2025 మార్చి 22 తారీఖున మొదలయ్యే 18 వ సీజన్(ఎడిషన్), మే 25న జరిగే ఫైనల్ తో ముగుస్తుంది.;
ఐపీఎల్ లో సంచలనాలు, ఉత్కంఠత, వినోదం మామూలే. అయితే దాంతోపాటు కొన్ని వివాదాలు కూడా ఐపీఎల్ లో భాగమయ్యాయి. సంస్థాగతమైన వివాదాలు కొన్ని, మైదానం బయట ఆటగాళ్లు సృష్టించిన వివాదాలు కొన్ని, మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన వివాదాలు, ఎంపైర్ల వివాదాస్పద నిర్ణయాలు వంటివి కూడా అతిపెద్ద క్రికెట్ గా భావిస్తున్న ఐపీఎల్ లో చోటుచేసుకున్నాయి. ఒకటి రెండు తప్ప అన్ని ఆటకు సంబంధించినవే.
ఐపీఎల్ కార్యనిర్వాహకంలో అవినీతి
ఇందులో మొదటిది, ఐపీఎల్ నిర్వాహకుడు, ఐపీఎల్ ను మొదటి నుంచి ఒక దశకు తెచ్చినవాడు, బీసీసీఐకి చెందిన లలిత్ మోడీ నిధుల దుర్వినియోగానికి, ఇతరత్రా కార్యక్రమాలకు గాను ఐపీఎల్ నుంచి బహిష్కరించబడ్డాడు. 2010 లో బీసీసీఐ లలిత్ మోడీని సస్పెండ్ చేసింది. క్రికెట్ కార్య నిర్వహణకు సంబంధించి పలు అంశాల్లో లలిత్ మోడీ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించబడ్డాడు. తర్వాత లలిత మోడీ ఏమయ్యాడో ఎవరికీ తెలియదు.
ఆటగాళ్లు వ్యతిరేకించిన వ్యూహాత్మక విరామం
ఆట నియమాలకు సంబంధించి ఒక్క నిబంధన బీసీసీఐకి చెడ్డ పేరు తెచ్చింది. అదే స్ట్రాటజిక్ టైం అవుట్(strategic timeout) ఒక మ్యాచ్ లో నాలుగు సార్లు వచ్చే ఈ విరామం, బీసీసీఐ స్వలాభానికి వాడుకుంటుందని అందరూ అనుకున్నారు. దాంతో ఆటగాళ్లకి పెద్ద ఉపయోగం లేదని అనుకున్నారు. సచిన్ టెండూల్కర్ లాంటి ఆటగాళ్లు కూడా దీన్ని వ్యతిరేకించారు. 2010 లో ప్రవేశపెట్టిన ఈ టైం అవుట్ మ్యాచ్ ఫిక్స్ చేయడానికి కూడా ఉపయోగించే అవకాశం ఉందని చాలామంది భావించారు. తర్వాత బీసీసీ అనధికార సూత్రాల ప్రకారం టైం అవుట్ సమయంలో 31.5 కోట్ల స్పాన్సర్షిప్ తో సియట్ కంపెనీ తన ప్రచారం చేసుకోవడానికి అనుమతించారు. ఇది లలిత్ మోడీ ఉన్న సమయంలో జరిగింది. లలిత్ మోడీ ఉన్న సమయంలో ఇలాంటివి చాలా జరిగాయి. 2:30 నిమిషాల ఈ టైం అవుట్ లో స్పాట్ ఫిక్సింగ్ కి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, దాంతోపాటు ఇంకా ఏమైనా జరగొచ్చు అని చాలామంది భావించారు.చివరకు దాన్ని తీసేయలేదు కానీ దాన్ని రెండుగా విభజించి ఐదు నిమిషాల విరామంతో దాన్ని నడుపుతున్నారు.
శ్రీశాంత్ చెంప పగలగొట్టిన హర్భజన్ సింగ్
ఆటగాళ్లకు సంబంధించి కొన్ని వివాదాలు ఉన్నాయి. అందులో మొదటిది హర్భజన్ సింగ్, బౌలర్ శ్రీశాంత్ ను చెంప దెబ్బ కొట్టడం. 2008 లో జరిగిన ఒక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కు కింగ్స్ 11 పంజాబ్ కు మధ్య జరిగిన ఒక మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్న హర్భజన్ సింగ్ శ్రీకాంత్ ను చెంప దెబ్బ కొట్టాడు. ఆట అయిన తర్వాత ప్లేయర్స్ ఒకరికొకరు కరచాలనం చేసుకునే సమయంలో హర్భజన్ శ్రీశాంత్ గూబ గుయ్ మనిపించాడు. అది కెమెరాల్లో రికార్డు అయింది. కళ్లనీళ్ల పర్యంతమైన శ్రీశాంత్ మైదానం వీడాడు. బీసీసీఐ వెంటనే స్పందించి హర్భజన్ సింగ్ ను సస్పెండ్ చేసింది సీజన్లో మిగతా ఏ మ్యాచ్ ఆడకుండా చేసింది.
కాంట్రాక్టు ఉల్లంఘించిన జడేజా
ఆటగాళ్లకు సంబంధించి కొన్ని వివిధ వివాదాలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ విజయవంతమైన బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ జడేజా 2010 సీజన్ ఆడకుండా నిషేధించబడ్డాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నప్పటికీ, అతను వేరే ఫ్రాంచైజీ తో చర్చలు జరపడం దీనికి కారణం. ఒప్పంద ఉల్లంఘన కింద మొదటిసారి ఒక ఆటగాడు ఒక సీజన్లో ఆడకుండా నిషేధింపబడడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ కు చెప్పకుండా వేరే ఫ్రాంచైజీ తో చర్చలు జరపడం అనైతికమని కూడా బీసీసీఐ భావించింది. ఐపీఎల్ చరిత్ర లో ఇంతవరకు ఇదే మొదటిసారి. దాని తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్న ముంబై ఇండియన్స్ టీమ్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించడం కొంతవరకు వివాదాస్పదమైంది.
షారుఖాన్ దురుసు ప్రవర్తన- నిషేధాన్ని విధించిన ఎంసీఏ
ఇది ఆటకు గాని ఆటగాళ్లకు గాని సంబంధించిన విషయం కాదు. కోల్కత్తా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్ ను ఐదేళ్లపాటు నిషేధించింది, ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) మద్యం మత్తులో ఉన్న షారుఖ్ ఖాన్ ఎంసీఏ సిబ్బందితో గొడవకు దిగడమే కాకుండా వారి మనోభావాలను దెబ్బతీసినందుకు ఈ నిషేధం విధించబడింది. అక్కడి వాళ్ళు ప్లేయర్స్ దుస్తులు మార్చుకునే రూమ్ లోకి వెళ్ళవద్దని చెప్పినా కూడా ఖాన్ దురుసుగా ప్రవర్తిస్తూ అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయడంలో దాల్వి నీ నెట్టివేశాడని ఆరోహణ. అయితే షారుక్ ఖాన్ మాత్రం దాల్వి తనతో అభ్యంతరకరమైన, అమర్యాదకరమైన భాషను వాడాడని, మరాఠీలో తిట్టాడని అందుకే అలా దురుసుగా మాట్లాడవలసి వచ్చింది అని చెప్పాడు. అయినప్పటికీ ఎంసీఏ 2017 వరకు బ్యాన్ విధించినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లు పైగా ఒక ఫ్రాంచైజీ ఓనర్ కాబట్టి ఆ నిషేధాన్ని 2015లో ఎంసిఏ ఎత్తివేసింది
ఐపీఎల్ ప్రతిష్ట ను దెబ్బతీసిన స్పాట్ ఫిక్సింగ్ కళంకం
ఇక స్పాట్ ఫిక్సింగ్ అనే అత్యంత లజ్జాకరమైన సంఘటన ఐపీఎల్ ను చాలా ఇబ్బంది పెట్టింది.
దీనికి కారణం శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్ అనే ముగ్గురు క్రికెటర్ల ను ఢిల్లీ పోలీసులు స్పాట్ ఫిక్సింగ్ నేరం కింద అరెస్టు చేయడం. కానీ పాటియాలా హౌస్ కోర్టు వారిని నిర్దోషులుగా విడుదల చేసినప్పటికీ 2016లో బీసీసీఐ అజిత్ చండీలా ను జీవితకాలం నిషేధించింది.
ఇదిలా ఉండగా పోలీసుల విచారణలో గురునాథ్ మెయ్యప్పన్, అనే వ్యక్తి కి బుకీలతో సంబంధం ఉందని తేలడంతో ఐపీఎల్ కు ఇబ్బంది కలిగింది. ఎందుకంటే మెయ్యప్పన్ అప్పటి బీసీసీఐ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ కు అల్లుడు. దరిమిలా ఆర్ ఎం లోధా కమిటీ, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ యజమానులను సస్పెండ్ చేసింది. దాంతో రెండు ఫ్రాంచైజీ జట్లు రెండు సంవత్సరాల పాటు ఐపీఎల్ లో పాల్గొనకుండా నిషేధం కూడా విధించబడింది
గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీల ఘర్షణ
2023 లో లక్నో సూపర్ జెంట్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్యలో జరిగిన ఒక లీగ్ మ్యాచ్ లో ఎల్ ఎస్ జి ఫాస్ట్ బౌలర్ నవీన్ కోహ్లీతో గొడవపడ్డాడు. అంతటితో అయిపోలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ నవీన్ ఇద్దరు చేతులు కలపడానికి చేసిన ప్రయత్నంలో మరింత గొడవ జరిగింది. అప్పుడు అక్కడే ఉన్న లక్నో సూపర్ సూపర్ జెంట్స్ మెంటర్ గంభీర్ నవీన్ ఉల్ హక్ ను సపోర్ట్ చేస్తూ కోహ్లీతో వాదనకు దిగాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఇద్దరికీ చెడ్డపేరు తెచ్చిన సంఘటన. ఇంతకు ముందు కూడా 2013లో విరాట్ కోహ్లీ గౌతమ్ గంభీర్ల మధ్య ఇలాంటిదే జరిగింది. రాయల్ చాలెంజ్ బెంగుళూరు తో కోల్కత్తా నైట్ రైడర్స్ తలపడిన ఒక మ్యాచ్లో కోహ్లీ అవుట్ అయ్యాడు. కోహ్లీ పెవీలియన్ వైపు వెళుతుండగా గంభీర్ అతనితో ఏదో అన్నాడు. అప్పుడు కోహ్లీ తనదైన శైలిలో జవాబు ఇచ్చాడు. ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటారేమో అన్న సందర్భంలో ఇరుజట్ల ఆటగాళ్లు వారిని ఆపారు. దాని పర్యావసనమే 2023 లో మరొకసారి ఈ సంఘటన జరగటం.
కొసమెరుపు: ఇందులో రెండు విచిత్రాలు ఉన్నాయి. ఒకటి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇంతవరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా గెల్చుకోలేదు. ఢిల్లీ డేర్ డెవిల్స్ కూడా అంతే!!