కోట్లు కురిపించే క్రికెట్ పండగ ఐపీఎల్...కౌంట్ డౌన్

2025 మార్చి 22 తారీఖున మొదలయ్యే 18 వ సీజన్(ఎడిషన్), మే 25న జరిగే ఫైనల్ తో ముగుస్తుంది.;

Update: 2025-03-11 06:50 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్....(ఐపీఎల్) క్రికెట్ అంటే ఏంటో తెలిసిన వారందరికీ తెలిసిన టోర్నమెంట్ ఇది. ఇప్పుడు భారతదేశంలో క్రికెట్ అంటే ఐ పి ఎల్. ప్రపంచవ్యాప్త క్రికెట్ ఆటగాళ్లు, క్రికెట్ ప్రేమికుల తో పాటు యావత్ క్రీడా ప్రపంచం, వ్యాపార ప్రపంచం ఎదురుచూస్తున్న టోర్నమెంట్ ఇది. రెండు నెలలపాటు ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో, ప్రత్యక్షంగా భారతదేశంలోని అన్ని స్టేడియంలో కొన్ని కోట్ల మంది వీక్షించే ఏకైక టోర్నమెంట్, ప్రపంచంలో ఇది ఒక్కటే! 2025 మార్చి 22 తారీఖున మొదలయ్యే 18 వ సీజన్(ఎడిషన్), మే 25న జరిగే ఫైనల్ తో ముగుస్తుంది.

కోట్లు కురిపిస్తున్న క్రికెట్ పండగ

ప్రపంచంలో అత్యంత ఖరీదైన టోర్నమెంట్లలో ఇది ఒకటి.. బీసీసీఐ ఖజానాను వేలకోట్లకు పెంచిన ఒక టోర్నమెంట్. ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లు, క్రికెట్ బోర్డులు, వ్యాపారస్తులు, ప్రేక్షకులు ముందస్తుగా ప్రణాళికలు వేసుకుంటున్న టోర్నమెంట్ ఇదే, ప్రపంచవ్యాప్త క్రీడారంగం తో పాటు, ప్రసార సంస్థలు, వ్యాపార సంస్థలు కూడా సన్నద్ధమవుతున్న అతిపెద్ద టోర్నమెంట్ ఇది. గత సంవత్సరం(2024) జరిగిన ఐపీఎల్ 17వ సీజన్లో బీసీసీఐ అర్జన దాదాపు 20,000 కోట్ల రూపాయలు అంటేనే అర్థం చేసుకోవచ్చు. బిసిసిఐ దీన్ని ఒక అతిపెద్ద ఆదాయ వనరుగా మార్చింది.

దీనికి మూలం 1977 లో ఆస్ట్రేలియా మీడియా కింగ్ కెర్రీ ప్యాకర్, ఆస్ట్రేలియా క్రికెట్ కు సమాంతరంగా ప్రారంభించిన కెర్రీ ప్యాకర్ వరల్డ్ సిరీస్ లీగ్. అప్పట్లో అది ఒక పెద్ద సంచలనం. అది ఎక్కువ కాలం నడవకపోయినప్పటికీ, అంతవరకు ఒక ఆటగా మాత్రమే ఉన్న క్రికెట్ ను, ఒక పెద్ద లాభసాటి వ్యాపారంగా మార్చవచ్చని రుజువు చేసింది.

"ఐసిఎల్" అనే ప్రత్యర్థిని ఎదురుకోవడానికి ఏర్పడిన "ఐపీఎల్"

ఐపీఎల్ ఏర్పడడానికి కారణం ఐసిఎల్ అంటే ఆశ్చర్యం వేస్తుంది. జి ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్ అనబడే ఐసిఎల్ ను ప్రారంభించింది. దానికి బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) గుర్తింపు గానీ, ఐసీసీ(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) గుర్తింపు కానీ లేదు. అయితే కొంతమంది పాత తరం క్రికెట్ ఆటగాళ్లు దానిలో భాగమయ్యారు. అంతవరకు ఓకే. కొంతమంది బీసీసీఐ కమిటీ సభ్యులు కూడా ఐసిఎల్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ లో చేరడం బీసీసీఐకి కోపం తెప్పించింది. దాంతో బీసీసీఐ, ఐసీసీ లో చేరే ఆటగాళ్ల పై జీవితకాలం నిషేధం విధించడమే కాకుండా, దేశవాళీ టోర్నమెంట్లలో ఆడే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు కూడా పెంచడం విశేషం. దరిమిలా ఐసిఎల్ 2007-2009 మధ్యలో టోర్నమెంట్ లు నడిపిన తర్వాత, కొన్ని ఒప్పందాల వల్ల ఆగిపోయింది.

ఈ మధ్యలో 2007 ఐసిసి టి20 కప్పును ప్రారంభించే సమయంలో, బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఆ విధంగా ఐపీఎల్ మొదటి సీజన్ 2008 లో జరిగింది. ఇప్పటివరకు నిరాటంకంగా సాగుతున్న టోర్నమెంట్ ఇది. వివిధ ఫ్రాంచైజీల ఆధ్వర్యంలో టీంలు ఏర్పడ్డాయి. అలా ఐసిఎల్ అనే ఒక టోర్నమెంట్, ఐపీఎల్ అనే ఒక పెద్ద టోర్నమెంట్ ప్రారంభించడానికి కారణమైంది.

కాసులు కురిపించే కామధేనువు- యువతకు అదరువు

గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న ఈ అత్యంత ఖరీదైన(అన్ని విధాలుగా) టోర్నమెంట్, ఇంతవరకు జరిగిన 17 టోర్నమెంట్లలో బీసీసీఐ వేలకోట్ల రూపాయలు సంపాదించింది. దాదాపు రెండు నెలల పాటు జరిగే టోర్నమెంటు వల్ల వివిధ వర్గాల వారు ఆర్థికంగా లాభపడుతున్నారు. వివిధ దేశాల క్రికెట్ బోర్డులు కూడా తమ క్రికెట్ షెడ్యూల్ ను దీనికి అనుగుణంగా నడుపుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు, దీని యొక్క ప్రభావం. కొంతమంది విదేశీ ఆటగాళ్లు వారి దేశం తరఫున ఆడడం కన్నా, ఐపీఎల్ ఆడడానికి ఎక్కువ ఆసక్తి చూపడం అనేది దీని ప్రభావాన్ని స్పష్టపరుస్తుంది.

ఈ టోర్నమెంట్ ఔత్సాహిక యువ క్రీడాకారులకు ఒక మంచి అవకాశం కల్పించింది.. ఇదివరకు కేవలం క్రికెట్ అంటే ఆసక్తి ఉన్నవాళ్లు తమ ప్రతిభను చూపించడానికి క్రికెట్ రంగాన్ని ఎన్నుకునేవారు. అది కేవలం ఒక ఆటగా ఉండేది. ఈ ఐపీఎల్ వల్ల యువతరం ఇప్పుడు దీని ద్వారా తమ ప్రతిభను చూపించుకోవడంతోపాటు, ఒక కెరీర్ గా కూడా దీన్ని మలుచుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు యువతకు ఇది ఒక లాభసాటి ఉపాధి మార్గం. ఒకప్పుడు క్రికెట్ అంటే కేవలం పెద్ద పెద్ద నగరాల్లో ఉండే వారే దాన్ని ఎంచుకునేవారు. ఇప్పుడు భారతదేశం తో పాటు, ఇతర దేశాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన యువతకు ఇది ఒక మంచి ప్లాట్ ఫామ్. తమ ప్రతిభను నిరూపించుకోవడంతోపాటు ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశం.

ఎన్నో విశేషాలు, విచిత్రాలు, వివాదాలు

ప్రపంచవ్యాప్తంగా రెండు నెలల పాటు అన్ని ప్రసార రంగాలను, ముఖ్యంగా టీవీ రంగాన్ని బిజీగా ఉంచే ఈ ఐపీఎల్ ఎన్నో సంచలనాల,విశేషాల, కొన్ని వివాదాల, ఒకటి రెండు విషాదాల సమాహారం. వివిధ రూపాల్లో క్రికెట్ బెట్టింగ్ విరివిగా సాగే టోర్నమెంట్ ఇది. పరీక్షల సమయంలో ఈ టోర్నమెంట్ నడపడం విద్యార్థులకు కొంత ఇబ్బందికరమైనప్పటికీ, దీని పరిధి చాలా పెద్దది కాబట్టి, దీన్ని నడుపుతున్నారు.

షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ

ఇప్పటికే ఐపీఎల్ 18వ ఎడిషన్ షెడ్యూల్ విడుదల చేసింది బీసీసీఐ. 65 రోజులపాటు 74 మ్యాచ్ లు జరిగే ఈ క్రికెట్ పండుగ మార్చి 22 సాయంత్రం 7.30 గంటలకు కోల్కత్తాలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కలకత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్ తో ప్రారంభమవుతుంది. ఇంతవరకు రాయల్ చాలెంజర్స్ ఒకసారి కూడా ఈ టైటిల్ గెలవకపోవడం విశేషం.

దీంతోపాటు 2008 లో ప్రారంభమైన ఐపీఎల్ మొదటి సీజన్(విజేత :రాజస్థాన్ రాయల్స్) నుంచి 2024 లో జరిగిన 17 వ సీజన్ వరకు ఎన్నో రికార్డులు, వ్యక్తిగత విజయాలు, సంచలనాలు, ఉత్కంఠ కలిగించే చివరి ఓవర్లు, చివరి బంతి విజయాలు, ఓటములు, వ్యక్తిగత శతకాలు, అద్భుతమైన క్యాచ్ లు, రనౌట్లు, టైలు, సూపర్ ఓవర్లు ఇలా ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి. ఇక క్రికెటేతర విషయాలు లెక్కలేనన్ని ఉంటాయి

ఇలాంటి ఎన్నో విశేషాలు గురించి తెలుసుకుందాం... (సశేషం)

Tags:    

Similar News