కనిపించని భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్ హైప్

దుబాయ్ వేదికగా నేటీ రాత్రి దాయాదుల పోరు;

Update: 2025-09-14 05:44 GMT
భారత్- పాకిస్తాన్ జట్ల ఆటగాళ్లు

టీ20 గేమ్ అంటే ఓ అట్రాక్షన్. దానికి విరాట్, రోహిత్ లాంటి హర్డ్ హిట్టర్లు ఉండి, అది పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే ఆ కిక్కేవేరు. ఇప్పుడు ఇరు జట్లలో స్టార్ క్రికెటర్లు లేరు. పాక్ లో కూడా బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ను లను జట్టు నుంచి తప్పించారు.

దీనికి తోడు పహల్గామ్ దాడి తరువాత పాక్ తో క్రికెట్ మ్యాచ్ ఆడకూడదని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్ లో భాగంగా నేడు దుబాయ్ వేదికగా భారత్- పాక్ తలపడబోతున్నాయి.

మొదటి మ్యాచ్ లో అతిథ్య యూఏఈని చిత్తుగా ఓడించిన మెన్ ఇన్ బ్లూ టీమ్ ఈ పోరులో పాక్ కంటే బలంగానే కనిపిస్తోంది. టీమ్ ఇండియా మంచి కూర్పు కోసం వేచి చూస్తోంది. మొదటి మ్యాచ్ లో ఆడిన జట్టే ఈ మ్యాచ్ లో దాదాపుగా బరిలోకి దిగబోతోంది.

ఒకే స్థానానికి అనేక మంది ఆటగాళ్లు పోటీపడుతుండటం టీమ్ మేనేజ్ మెంట్ కు తలనొప్పిగా మారింది. వచ్చే ఏడాది భారత్ వేదికగా టీ20 వరల్డ్ కప్ గా జరగబోతోంది. దీనిలో భారత్ ఢిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది. కాబట్టి జట్టు కూర్పును పరీక్షించడానికి ఆసియాకప్ సన్నాహకంగా ఉపయోగపడుతుంది.

భారత జట్టులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో పాటు శుభ్ మన్ గిల్, అభిషేక్ శర్మ లాంటి హిట్టర్లతో పాటు బూమ్రా,కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవరి, ఆల్ రౌండర్ హర్డిక్ పాండ్యాలను ఎదుర్కోవడం పాక్ కు తలకుమించిన పని. 2022 తరువాత పాక్ లో ఆడిన ఒక్క మ్యాచ్ ను కూడా భారత్ ఓడిపోలేదు.
పాక్ టీ20 జట్టుకి కొత్త కెప్టెన్ గా సల్మాన్ అలీ ఆఘాను నియమించారు. గ్రీన్ షర్ట్స్ తో పోలిస్తే మెన్ ఇన్ బ్లూ బలంగా కనిపిస్తోంది. తన తొలి మ్యాచ్ లో పాక్, ఒమన్ ను ఓడించింది. కానీ టీ20 గేమ్ లో క్షణాల్లో పరిస్థితులు మారిపోతుంటాయి. ఇదే అవకాశాన్ని సృష్టించుకోవాలని పాక్ ఆరాటపడుతోంది.
పాకిస్తాన్ లైనప్ లో ప్రతిభావంతుడైన ఆటగాళ్లుగా ఒపెనర్ సయిమ్ ఆయూబ్, మిడిల్ ఆర్డర్ లో హసన్ నవాజ్ తో పాటు స్పిన్నర్ అబ్రర్ అహ్మద్, సుఫియాన్ ముఖీన్ మహ్మద్ నవాజ్ లు ఉన్నారు. వీరు జట్టులో తమ స్థానం పదిలంగా నిలుపుకోవడానికి ఆరాటపడుతున్నారు.
స్పిన్నర్లదే ఆధిపత్యం..
సాధారణంగా భారత్- పాకిస్తాన్ క్రికెట్ లో మ్యాచ్ లో పాక్ సీమర్లతో భారత్ బ్యాట్స్ మెన్లు తలపడటం చూస్తాం. కానీ ఈసారి ఆసియా కప్ లో పరిస్థితులు భిన్నంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే పొడి వాతావరణం, స్లో పిచ్ లపై స్పిన్నర్లు ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. జస్ప్రిత్ బూమ్రా, షాహీన్ షా అఫ్రిదీ కూడా కొత్త బాల్ తో ప్రమాదకరంగానే ఉంటారు.
ఇరుజట్లలో కూడా ఒక లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఒక రైట్ హ్యండ్ స్పిన్నర్ ఉన్నారు. పాక్ కు చెందిన ముఖీమ్ మంచి బౌలర్ కానీ కుల్దీప్ అంత ప్రతిభ లేదు. ముఖ్యంగా కుల్దీప్ గుగ్లీ ఆడటం పాక్ బ్యాట్స్ మెన్ చాలా కష్టమైన పని. అబ్రార్ కూడా మంచి బౌలర్.
లెగ్ స్పిన్ తో మాయ చేస్తాడు. పాక్ వ్యాప్తంగా అతనికి అభిమానులు ఉన్నారు. కానీ వరుణ్ చక్రవర్తితో పోలిస్తే అంత మిస్టరీ స్పిన్నర్ కాడు. మరో లెప్ట్ హ్యండర్ నవాజ్ ఐసీసీ ర్యాంక్ విషయంలో 30 వ స్థానంలో ఉన్నాడు. కానీ కోచ్ మైక్ హస్సీ ప్రకారం అతను జట్టు ఉత్తమ స్పిన్నర్.
భారత్ వైపు నుంచి అక్షర్ పటేల్ ఈ పాత్ర పోషించడానికి సిద్దంగా ఉన్నాడు. అక్షర్ అల్ రౌండ్ ప్రతిభతో పోలిస్తే నవాజ్ వెనకబడి ఉన్నాడు. రవీంద్ర జడేజా పాత్రను ప్రస్తుతం అక్షర్ పోషిస్తున్నాడు.
పాక్ బ్యాటింగ్..
భారత్ బౌలింగ్ కంటే బ్యాటింగ్ పాక్ ను ఎక్కువ ఆందోళనకు గురి చేస్తోంది. గిల్, అభిషేక్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే తమదైన రోజున ఏదైన బౌలింగ్ దళాన్ని ఉతికి ఆరేయగలరు. కానీ పాక్ బ్యాటింగ్ లో ఆ స్థాయి పవర్ లేదు.
ఒమన్ పై మొత్తం 20 ఓవర్లు ఆడి కేవలం 160 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఆల్ రౌండర్ల విషయంలో పాక్ బ్యాట్స్ మెన్ ఫహీమ్ అష్రఫ్, హర్డిక్ పాండ్యాతో పోలికే లేదు.
భారత్ కేవలం షాహీన్ షా అఫ్రిదీ బౌలింగ్ ను కాస్త జాగ్రత్తగా ఆడితే చాలు. ఎందుకంటే 2021 లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భారత్ ను పాక్ ఓడించిందంటే దానికి కారణం అఫ్రిదీనే. రాహుల్, రోహిత్ లను ఒకే ఓవర్ లో పెవిలియన్ పంపిన ఈ ఏస్ బౌలర్, తరువాత విరాట్ ను పెవిలియన్ పంపి జట్టుకు మధురమైన జ్ఞాపకాలను మిగిల్చాడు. కానీ గాయం తరువాత ఆఫ్రిదీలో అప్పటి పదును కనిపించడం లేదు.
కనిపించని హైప్..
భారత్ - పాక్ మ్యాచ్ అనగానే దేశంలో ఇంతకుముందు కనిపించే సందడి ప్రస్తుతం కనిపించడం లేదు. వేల సంఖ్యలో టికెట్లు ఇంకా మిగిలే ఉన్నాయి. ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్ కు కూడా చాలా తక్కువ సంఖ్యలో అభిమానులు వచ్చారు. దీనితో స్టేడియం చుట్టుపక్కల ప్రదేశాలలో అంత స్తబ్ధుగా ఉంది.
దేశంలో మాత్రం క్రికెట్ మ్యాచ్ ను బహిష్కరించాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఫలితంగా ఈ రోజు జరిగే మ్యాచ్ కు ఎంతమంది బీసీసీఐ పెద్దలు, సెలబ్రేటీలు హజరవుతారో తెలియదు.
భారత ప్రభుత్వం ద్వైపాక్షిక స్థాయిలో క్రికెట్ ఆడటానికి సమ్మతి తెలపకపోయినా, వేరే టోర్నమెంట్లలో పాక్ తో ఆడటానికి మాత్రం అనుమతి ఇచ్చింది.
భారత్ పాక్ లు ఇప్పటి వరకూ టీ20 ఫార్మాట్ లో 13 సార్లు తలపడగా భారత్ 10 సార్లు విజయం సాధించింది. మరో మూడు మ్యాచ్ లలో పాక్ విజయం సాధించింది. చివరిగాసారిగా రెండు జట్లు 2024 లో వెస్టీండీస్- యూఎస్ఏ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో తలపడ్డాయి. భారత్ ఇక్కడ ఆరు పరుగుల తేడాతో పాక్ ను ఓడించింది.
Tags:    

Similar News