ఐపీఎల్2025: ఏడుగురు కొత్త కెప్టెన్లతో వస్తున్న ఫ్రాంచైజీలు

ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అంటూ ప్రచారం.. తొలి మ్యాచ్ కు వర్షం ముప్పులేదని సమాచారం;

Update: 2025-03-22 11:46 GMT

ఐపీఎల్ 18 వ సీజన్ కు సర్వం సిద్దమైంది. పదమూడు వేదికలు, 74 మ్యాచ్ లు, 65 రోజుల పాటు జరిగే ఈ పొట్టి సమరంలో ఆటగాళ్లు తమ విన్యాసాలతో అలరించడానికి సిద్దమయ్యారు.

ప్రపంచంలోనే రెండో అతి పెద్ద లీగ్ గా ముద్ర పడ్డ ఈ లీగ్ కోసం భారత అభిమానులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భారత క్రికెట్ మక్కాగా పేరు పొందిన కోల్ కత లోని ఈడెన్ గార్డెన్స్ లో నేడు ఢిపెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ తో, ఆర్సీబీ తలపడబోతోంది. ఇరు జట్లు బలంగానే ఉండటంతో పోరు రసవతర్తంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
రెండు జట్లకు ప్రస్తుతం కొత్త కెప్టెన్లు వచ్చారు. మెగా వేలంలో చాలా మంది ఆటగాళ్లు జట్లతో చేరారు. అలాగే కొత్త నిమయాలు, కెప్టెన్లు, కోచ్ లు కూడా వచ్చారు.
సెలైవా రాసుకోవచ్చు..
కరోనా తరువాత బంతిపై ఉమ్మిరాయడాన్ని ఐసీసీ నిషేధం విధించింది. కేవలం చెమట మాత్రమే రాయడానికి అవకాశం ఉండేది. ప్రస్తుతం ఐపీఎల్ పాలకమండలి బౌలర్లు ఉమ్మి రాయడానికి అనుమతి ఇచ్చింది.
దీనివల్ల బౌలర్లకు పాతబంతితో రివర్స్ స్వింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముంబైలో జరిగిన కెప్టెన్ల సమావేశంలో అంతా ఒక నిర్ణయానికి రావడంతో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
రెండో ఇన్సింగ్స్ లో రెండు బంతులు..
ఐపీఎల్ లో ఇక నుంచి మరో కొత్త నిబంధన రాబోతోంది. సాయంత్రం వేళ రెండో ఇన్నింగ్స్ లో ఆడే జట్లకు రెండో బాల్ ను అదనంగా అందించబోతున్నారు. ఇది 11 వ ఓవర్ నుంచి అందుబాటులో ఉంటుంది.
అయితే ఇది ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి అనుగుణంగా తీసుకురాబోతున్నారు. బంతి మెత్తగా మారితే దానిస్థానంలో మరో బంతిని అందించే అవకాశం ఉంది. ఈ నియమం మధ్యాహ్నం ఆడే ఆటలకు వర్తించదు. ప్రస్తుతం ఐపీఎల్ లోనే ఇంపాక్ట్ ప్లేయర్ విధానాన్ని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే.
ఏడుగురు కొత్త కెప్టెన్లు..
ఈ ఐపీఎల్ సీజన్ లో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏకంగా ఏడు జట్లు తమ కెప్టెన్లను మార్చేశాయి. ఇందులో గత ఏడాది కోల్ కతకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ సైతం ఉండటం గమనార్హం.


 


ఈ కెప్టెన్లలో ఇంక అందరిని ఆశ్చర్యపరిచిన విషయం బెంగళూర్ జట్టు కెప్టెన్ గా రజత్ పాటిదార్ నియామకం. ఈ క్లాసిక్ ఆటగాడు ఇప్పటి వరకూ భారత జట్టు తరఫున కనీసం ఒక్క టీ20 కూడా ఆడలేదు. అయినప్పటికీ కోహ్లిని కాదనుకుని మరీ జట్టు పగ్గాలు పాటిదార్ కు అప్పగించారు.
గత సీజన్ లో తీవ్రంగా నిరాశపరిచిన ఎల్ఎస్జీ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ ఇద్దరు ఢిల్లీ జట్టు తరఫున బరిలోకి దిగబోతున్నారు. అయితే ఇందులో అక్షర్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు.
శ్రేయాస్ అయ్యార్ పంజాబ్ కింగ్స్ తరఫున, అజింక్యా రహనే కోల్ కత నైట్ రైడర్స్ తరఫున నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు. అలాగే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కు వేలికి గాయం కావడంతో కొన్ని మ్యాచ్ లకు రియాన్ పరాగ్ నాయకత్వం వహించబోతున్నాడు.
గత సీజన్ లో హర్దిక్ పాండ్యా ఓవర్ రేట్ ఉల్లంఘన కారణంగా సస్పెన్షన్ కు గురైనందున ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే తొలి మ్యాచ్ కు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించబోతున్నారు.
అత్యంత ఖరీదైన ఆటగాడు పంత్..
రోడ్డు ప్రమాదం తరువాత బయటపడిన రిషబ్ పంత్ తన కెరీర్ లో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పేరు లిఖించుకున్న పంత్, లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది.
ఛాంపియన్స్ ట్రోఫి, ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లకు పంత్ ఎంపిక అయినప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడటానికి అవకాశం లభించలేదు. ఇప్పుడు తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఐపీఎల్ లో విజృంభించే అవకాశం కనిపిస్తోంది. తన రేటుకు తగిన న్యాయం చేయడంతో పాటు నాయకుడిగా సమర్థవంతంగా ఉన్నానని చెప్పుకోవడానకి చెలరేగే అవకాశం ఉంది.
కొత్త కోచింగ్ సిబ్బంది..
ఐపీఎల్ జట్ల సిబ్బందిలోనూ మార్పులు జరిగాయి. ఢిల్లీ కోచ్ పాంటింగ్ ఇప్పుడూ పంజాబ్ కు మారాడు. పాంటింగ్ స్థానంలో హేమాంగ్ బదానీ ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ గా నియమితులయ్యారు.
ఈ జట్టుకే కెవిన్ పీటర్సన్ మెంటార్ గా వచ్చాడు. రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్ కు ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టారు. గత సంవత్సరం ఇండియాకు టీ20 వరల్డ్ కప్ అందించిన తరువాత తిరిగి ఐపీఎల్ లోకి వచ్చారు. కేకేఆర్ మెంటార్ గా డ్వైన్ బ్రావో వ్యవహరించబోతున్నారు. ఇంతకుముందు ఈ స్థానంలో భారత ప్రధాన కోచ్ గౌతం గంభీర్ ఉన్నారు.
బూమ్రా దూరం..
ఆసీస్ తో జరిగిన బీజీటీ సిరీస్ లో గాయపడిన బూమ్రా ఫిట్ నెస్ పై ఇంకా సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతం బెంగళూర్ లోని ఎన్సీఏలో ఉన్న బూమ్రా ఐపీఎల్ సన్నద్దత పరీక్షలను ఎదుర్కొంటున్నాడు.
ముంబై కోచ్ మహేలా జయవర్ధనే బూమ్రా వస్తాడని చెబుతున్నప్పటికీ, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఐపీఎల్ తరువాత భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లబోతోంది. కాబట్టి బూమ్రాను జాగ్రత్తగా కాపాడుకుకోవాలి.
ధోని చివరి ఐపీఎల్ ?
ఐపీఎల్ లో ఓ ఆటగాడిపై అంతులేని ఊహగానాలు వస్తున్నాయి. ఇది ధోని చివరి సీజన్ అని.. కాదని కొందరు వాదిస్తున్నారు. ధోని వయస్సు ఇప్పటికే 43.. కానీ ఇంకా ఫిట్ గా ఉండటంతో ఐపీఎల్ ఆడుతున్నాడు.


 

ఐపీఎల్ లో మాత్రమే ధోని ఇప్పుడు కనిపిస్తున్నాడు. అతను ఉంటే చెన్నైకి ఉండే కళే వేరు. మాజీ కెప్టెన్ క్రికెట్ నైపుణ్యం, ఫీల్డ్ ప్లేస్ మెంట్లు, ఫినిషర్ గా మ్యాచ్ లు ముగించడం ధోనికే సొంతం.
ఈ ఐపీఎల్ లో కీలకమైన మరో విషయం ఏంటంటే.. 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆర్ ఆర్ తరఫున బరిలోకి దిగబోతున్నాడు. ఇతను ధోని కంటే 30 సంవత్సరాలు చిన్నవాడు.
కోహ్లి, రోహిత్ తిరిగి టీ20 ఫార్మాట్ లో..
గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలవగానే స్టార్ క్రికెటర్లు రోహిత్, విరాట్ తన టీ20 కెరీర్ కు గుడ్ బై చెప్పేశారు. వీరు కేవలం ఇక నుంచి ఐపీఎల్ లో జరిగే టీ20 ఫార్మాట్ కు మాత్రమే అందుబాటులో ఉంటారు.
ఐపీఎల్ 2024 లో అత్యధిక పరుగులు చేసింది కోహ్లినే. కింగ్ ఆర్సీబీ తరఫున కీలక ఆటగాడిగా ఉన్నాడు. రోహిత్ కు కాకుండా హార్డిక్ కెప్టెన్ అయ్యాక ముంబై తన మ్యాజిక్ ను కొనసాగించలేకపోయింది.
కేకేఆర్.. ఆర్సీబీ ప్రివ్యూ..
పదిహేడు సంవత్సరాల క్రితం తొలి ఐపీఎల్ మ్యాచ్ లో బ్రెండన్ మెక్ కల్లం 158 పరుగులు చేసి లీగ్ కు ఘన స్వాగతం ఇచ్చారు. అయితే ఆ తరువాత కేకేఆర్ మూడు టైటిళ్లు గెలుచుకున్నప్పటికీ, ఆర్సీబీ ఇప్పటికి ఒక్కసారి కూడా కప్ ను ముద్దాడలేదు.
అయితే కేకేఆర్ ఎప్పుడూ టైటిల్ గెలిచిన తరువాత సీజన్ లో పతనం అయింది. ఇప్పుడు రహానే కు జట్టు పగ్గాలు అప్పగించింది. ప్రస్తుతం అందరి జట్టు వరుణ్ చక్రవర్తి పైనే ఉంది.
ఈ మధ్యనే ఛాంపియన్స్ ట్రోఫిలో వరుణ్ అత్యద్భుతంగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కోహ్లి వర్సస్ వరుణ్ మధ్యపోరుగా అభిమానులు చూస్తున్నారు.
అలాగే 36 ఏళ్ల వయస్సులో బలంగా ఉన్న సునీల్ నరైన్, వరుణ్ కు అండగా నిలబడే అవకాశం ఉంది. ఆర్సీబీ జట్టులో ఫిల్ సాల్ట్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు.
అలాగే జితేష్ శర్మ, లియామ్ లివింగ్ స్టోన్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్ లో భువీ, జోష్ హజిల్ వుడ్ లాంటి వారిపైనే బెంగళూర్ ఆశలు పెట్టుకుంది.
ఐపీఎల్ ప్రారంభంలో శ్రేయా ఘోషల్, కరణ్ ఔజ్లా, దిశాపటానీ వంటి బాలీవుడ్ తారలు తళుక్కున మెరవనున్నారు. ఈ రోజు వర్షం పడే అవకాశం లేదని తెలిసింది. దీనితో నిర్వాహాకులు ఊపిరి పీల్చుకున్నారు.
Tags:    

Similar News