కోల్ కతా- లక్నో ఐపిఎల్ మ్యాచ్ రీషెడ్యూల్.. ఎందుకంటే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు రీషెడ్యూల్ గండం పొంచి ఉంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది.;
By : The Federal
Update: 2025-03-19 06:55 GMT
యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు రీషెడ్యూల్ గండం పొంచి ఉంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ అధికారికంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. నిర్వాహకులు భారతీయ పండుగల్ని విస్మరించి షెడ్యూల్ ను ఖరారు చేసినట్టు ఇప్పుడు అర్థమవుతుంది.
ఏప్రిల్ 6 శ్రీరామనవమి. ఆ రోజున ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ - లక్నో సూపర్ జెయింట్స్ (KKR vs LSG) జట్ల మధ్య మ్యాచ్ ఉంది. ఇప్పుడీ మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. శ్రీరామ నవమి సందర్భంగా కోల్ కతాతో పాటు పశ్చిమ బెంగాల్ అంతటా భారీ ఎత్తున ర్యాలీలు ఉంటాయి. అందువల్ల ఈ మ్యాచ్ కి భద్రత కల్పించలేమని పోలీసులు చేతులెత్తేశారు. దీంతో ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. బీజేపీ నాయకుడు సువేందు అధికారి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ ను వాయిదా వేయడమే మంచిదన్నారు. అటు ఊరేగింపులకు, ఇటు మ్యాచ్‌కు భద్రత కల్పించడం పోలీసులకు సవాల్‌తో కూడుకున్నదే. సిటీ పోలీస్‌తో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడు స్నేహశీశ్ గంగూలీ ఈ అంశంపై రెండుసార్లు చర్చించారు. అయితే, పోలీసుల నుంచి స్పష్టమైన హామీ రాలేదు.
‘‘విభాగాల వారీగా వారికి ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి. అందుకే పూర్తిస్థాయి భద్రతను కేటాయించలేమని చెబుతున్నారు. ఒకవేళ పోలీసుల సెక్యూరిటీ లేకపోతే ఏప్రిల్ 6న మ్యాచ్ కోసం వచ్చే 65 వేల మందికి పైగా వచ్చే ప్రేక్షకులను కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. మార్చి 22న ఓపెనింగ్ సెర్మనీని గ్రాండ్‌గా నిర్వహించేందుకు సిద్ధమయ్యాం. దాదాపు 35 నిమిషాల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. చాన్నాళ్ల తర్వాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభోత్సవం జరుగుతోంది. ఇప్పటికే తొలి పోరును వీక్షించేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపించారు. టికెట్లకు బాగా డిమాండ్ వచ్చింది’’ అని స్నేహశీశ్ వెల్లడించారు. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా, బెంగళూరు జట్ల మధ్య జరగనుంది.
బీసీసీఐ దే తుది నిర్ణయం...
‘‘భద్రతకు సంబంధించి ఏప్రిల్ 6న మ్యాచ్ నిర్వహణ విషయంలో బీసీసీఐదే తుది నిర్ణయం. ఇప్పటికే ఈ అంశాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లాం. గతేడాది కూడా ఓ మ్యాచ్ విషయంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దానిని రీషెడ్యూల్ చేయడం జరిగింది’’ అని లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా తెలిపారు. గత ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ - రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌కూ ఇదే పరిస్థితి. అప్పుడు కూడా శ్రీరామనవమి రావడంతో ఆ మ్యాచ్‌ను ఐపీఎల్ కమిటీ రీషెడ్యూల్ చేసింది. ఈనేపథ్యంలో కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది.