పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు రజతం

భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా రజిత పతకం సాధించారు. పారిస్‌లో జరుగుతోన్న ఒలింపిక్స్ పోటీలో పురుషుల జావెలిన్‌త్రో ఈవెంట్‌లో 89.45 మీటర్ల దూరం విసిరారు.

Update: 2024-08-09 07:34 GMT

భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా రజిత పతకం సాధించారు. పారిస్‌లో జరుగుతోన్న ఒలింపిక్స్ పోటీలో పురుషుల జావెలిన్‌త్రో ఈవెంట్‌లో 89.45 మీటర్ల దూరం విసిరి సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల దూరం విసిరి స్వర్ణం దక్కించుకున్నాడు. దీంతో రెండు ఒలింపిక్‌ పతకాలను సాధించిన ఐదో భారత అథ్లెట్‌గా నీరజ్ చోప్రా ఘనత సాధించాడు.

26 ఏళ్ల చోప్రా ఇంతకుముందు నదీమ్‌తో తలపడిన 10 సందర్భాల్లో ఎప్పుడూ ఓడిపోలేదు. 2010 తర్వాత మొదటిసారి అర్షద్ చేతిలో ఓడిపోయాడు.

"నేను 2010 నుండి అర్షద్‌తో పోటీ పడి మొదటిసారి (ఈ రోజు) అతనితో ఓడిపోయాను. ఇది ఒక క్రీడ. దానిని మనం అంగీకరించాలి. మన శరీరంలో బలం ఉన్నంత వరకు మేము ఆసియా ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తాం." అని చోప్రా అన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో నదీమ్ చోప్రాతో పోటీ పడాల్సి ఉండగా చివరి నిమిషంలో గాయం కారణంగా చోప్రా వైదొలిగాడు.

ప్రధాని మోదీ ప్రశంశలు..

ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చోప్రాను ప్రశంసించారు. అద్భుతమైన ప్రతిభ చాటాడని హర్షం వ్యక్తంచేశారు. మోదీ చోప్రాను ఎక్స్‌లో అభినందనలు తెలిపారు. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ , పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నాయకులు చోప్రాను అభినందించిన వారిలో ఉన్నారు.

'అస్సలు నిరాశ చెందలేదు'

‘‘చోప్రా స్వర్ణాన్ని సాధించలేకపోయాడు. అంతమాత్రాన మేం నిరుత్సాహపడలేదు. రజతం గెలవడం ఆనందంగా ఉంది.’’ అని చోప్రా కుటుంబసభ్యులు అన్నారు. ‘‘మా కొడుకు రజతం సాధించడం సంతోషంగా ఉంది. కృషికి ఫలితం దక్కింది. ఇప్పుడు అందరూ మా కొడుకును ప్రశంశలతో ముంచెత్తుతున్నారు’’ అని చోప్రా తండ్రి సతీష్ కుమార్ అన్నారు. "నీరజ్ చోప్రా చాలా బాగా ఆడాడు. నీరజ్ రాగానే ఆయనకు ఘన స్వాగతం పలుకుతాం. వాడికి చుర్మా అంటే చాలా ఇష్టం. దాన్ని కూడా తయారు చేస్తాం." చోప్రా తల్లి సరోజ్ దేవి అన్నారు. చోప్రా అత్త కమలేష్ కూడా హర్షం వ్యక్తం చేశారు. "మేం చాలా సంతోషంగా ఉన్నాం. కఠినమైన పోటీలో తన వంతు కృషి చేసాడు. గెలిచింది స్వర్ణమా లేదా రజతమా అన్నది ముఖ్యం కాదు. పతకం సాధించడం ముఖ్యం. అందుకు తన వంతు కృషి చేసాడు." అని చెప్పారు.

Tags:    

Similar News