హైదరాబాద్‌కు మరో మణిహారం..హైటెక్ సిటీ తరహాలో ఏఐ సిటీ

హైదరాబాద్‌ నగరం ఏఐ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా బోతున్నది హైటెక్ సిటీ తరహాలో ఏఐ సిటీ పేరిట (AI City) మరో మణిహారం ఏర్పడనుంది.

Update: 2024-05-24 12:54 GMT
హైదరాబాద్ హైటెక్ సిటీ తరహాలో ఏఐసిటీ (ఫొటో క్రెడిట్ : ఫేస్‌బుక్)

హైదరాబాద్ టెకీలకు తెలంగాణ ఐటీ శాఖ శుభవార్త వెల్లడించింది. గ్లోబల్ టెక్నాలజీలో నేడు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సరికొత్త పుంతలు తొక్కుతోంది. దీంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారి జులై నెలలో హైదరాబాద్ నగరంలో గ్లోబల్ ఏఐ ( Global Artificial Intelligence) సమ్మిట్‌ నిర్వహించనున్నారు.

- ఏఐ సదస్సు నిర్వహించడమే కాకుండా మన హైటెక్ సిటీ తరహాలో మరో ‘ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సిటీ’ (AI City) ని మన హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీశాఖ నిర్ణయించింది.
- ఏఐ సిటీని మొదట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో నిర్మించాలని యోగి సర్కారు ఆలోచన చేసింది. ఆ తర్వాత రేవంత్ సర్కారు తెలంగాణలోని 200 ఎకరాల్లో హైటెక్ సిటీ తరహాలో ఏఐ సిటీని నిర్మించాలని నిర్ణయించింది.
- ఏఐ సిటీనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే తొలి స్కిల్ యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.ఈ తొలి స్కిల్ యూనివర్శిటీని కూడా ఏఐసిటీకి సమీపంలోనే 100 ఎకరాల్లో ఏర్పాటుకు ఐటీ శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.

ఏఐ సిటీ కోసం భూమి ప్రతిపాదనలు
ఏఐ సిటీ ఏర్పాటు కోసం హైదరాబాద్ నగర శివార్లలోని మహేశ్వరం, సెరిలింగంపల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెంబడి 200 ఎకరాల భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. ఏఐసిటీతోపాటు హైదరాబాద్‌లోనే 100 ఎకరాల్లో తొలి స్కిల్ యూనివర్శిటీ కూడా ఏర్పాటుకు ప్రతిపాదనలను తుది ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.

కోడ్ ముగియగానే భూ కేటాయింపులు
జూన్‌నెలలో ఎన్నికల కోడ్ ముగియగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు భూమిని కేటాయించాలని యోచిస్తోంది. జూన్‌నెలలో జరిగే తదుపరి మంత్రివర్గ సమావేశంలో భూకేటాయింపులకు ఆమోదం లభించే అవకాశం ఉంది. భూమి కేటాయించగానే ఏఐ సిటీకి, స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి.

ఏఐ రాజధానిగా హైదరాబాద్ : ఐటీశాఖ మంత్రి డి శ్రీధర్ బాబు
ఏఐ సిటీ,స్కిల్ యూనివర్శిటీల కోసం భూమిని కేటాయించి, జూన్‌ నెలలో ప్రాజెక్టు పనులు చేపడతామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ఏఐ సిటీ స్థాపనతో హైదరాబాద్ నగరం భారతదేశపు ఏఐ రాజధానిగా అవతరిస్తుందని మంత్రి పేర్కొన్నారు.ఇటీవల తెలంగాణ ఫెసిలిటీ మేనేజర్ కౌన్సిల్ నిర్వహించిన సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఏఐ సిటీ రాకతో హైదరాబాాద్ నగరం రూపురేఖలే మారతాయని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన  డి సురేందర్ రెడ్డి చెప్పారు. ఏఐసిటీ రాకతో యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని  సీనియర్ టెకీ డి నరేష్ వివరించారు. 

స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటుకు సన్నాహాలు
ఏఐ సిటీతోపాటు స్కిల్ విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి డి శ్రీధర్ బాబు చెప్పారు. ఉన్నత విద్య, కార్మిక, ఐటీ, సాంకేతిక విభాగాల అధికారులు నైపుణ్య విశ్వవిద్యాలయాల పనితీరును అధ్యయనం చేసేందుకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్య విశ్వవిద్యాలయాల పనితీరుపై అధ్యయనం చేయాలని, తెలంగాణలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఈ రాష్ట్రాల నుంచి ఉత్తమ విధానాలను అనుసరించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.

ఉత్తరప్రదేశ్ ప్రయోగం...లక్నోలో 40 ఎకరాల్లో ఏఐ సిటీ
దేశంలోనే మొదటిసారి లక్నో నగరంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 40 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటుకు యూపీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ రూపకల్పన చేసింది. దీని అభివృద్ధి , నిర్వహణ కోసం యోగి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐ సిటీలోనే విలాసవంతమైన హౌసింగ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలని ఏఐ సిటీ నోడల్ ఏజెన్సీ అయిన యూపీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయించింది. లక్నోలో భారతదేశపు మొదటి ఏఐ నగరాన్ని నిర్మించే ప్రణాళికలతో యూపీ సర్కారు ఒక అడుగు ముందుకు వేసింది.

విస్తరించనున్న ఏఐ రంగం
ఏఐ మార్కెట్ 2024 నుంచి 2030 వరకు 37.3 శాతం వార్షిక వృద్ధి రేటుతో విస్తరిస్తుందని అంచనా టెకీలు అంచనా వేశారు. లక్నో నగరంలో ఏఐ స్టార్టప్ లకు మద్ధతు ఇవ్వాలని నిర్ణయించారు. అత్యాధునిక సాంకేతికత, పరిశోధనా కేంద్రాలు,విద్యాసంస్థలను ఏకీకృతం చేయడం ద్వారా ఏఐ నగరాన్ని వృద్ధి చేయాలని యూపీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయించింది. ఏఐ నగరాన్ని అభివృద్ధి చేయడానికి, నిర్వహించడానికి రియల్ ఎస్టేట్ డెవలపర్‌ను యూపీ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సిటీలో ఇంక్యుబేటర్‌లు, స్టార్ట్-అప్‌లు, కార్పొరేట్‌ల కోసం గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్‌తో కూడిన టవర్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. లక్నోలో ఐఐఎం, త్రిపుల్ ఐటీ, బీబీడీయూ, అమిటీ వంటి ప్రఖ్యాత విద్యాసంస్థలున్న నేపథ్యంలో ఏఐసిటీని కూడా ఇక్కడే అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.


Tags:    

Similar News