మోది ఇంటర్నేషనల్ బ్రాండ్: కీర్తిస్తూ పులకరించిపోతున్న చంద్రబాబు!

2019లో మోది తప్పుడు మనిషి అని, పెళ్ళాన్ని వదిలేశాడని బాబు తిట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఒక టెర్రరిస్ట్ అని, ప్రధాని పదవికి అనర్హుడని కూడా అన్నారు.

Update: 2024-10-18 12:05 GMT

ప్రధాని నరేంద్ర మోదిని వేనోళ్ళ పొగిడారు చంద్రబాబు. ఇవాళ మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదిని ఆకాశానికి ఎత్తేశారు. ఆయననుంచి నేర్చుకోవలసింది చాలా ఉందని అన్నారు. పట్టుదల, కృషి వల్లే మోది మూడోసారి ప్రధాని అయ్యారని చెప్పారు. గుజరాత్‌లో ఆరుసార్లు బీజేపీ గెలిచిందని, హర్యానాలో మూడుసార్లు గెలిచిందని అన్నారు. దేశంలో ఎవరికీ దక్కని విజయం మోదికి దక్కిందంటే దానివెనక కఠోరమైన శ్రమ, క్రమశిక్షణ ఉన్నాయని చెప్పారు. ఆయన నాయకత్వంలో భారత్ బలమైన ఆర్థిక శక్తిగా మారిందని, మోది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అని చంద్రబాబు అన్నారు.

ఒకనాడు అడ్డమైన బూతులు తిట్టిన నోటితోనే మోదిని ఇప్పుడు కారణజన్ముడనే స్థాయిలో కీర్తిస్తున్న చంద్రబాబును చూసి లౌకికవాదులు ముక్కున వేలేసుకుంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు మోదిని తప్పుడు మనిషి అని, పెళ్ళాన్ని వదిలేశాడని, ఆయనకు కుటుంబం లేదని తనకు అవి అన్నీ ఉన్నాయని చంద్రబాబు తిట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఒక టెర్రరిస్ట్ అని, ప్రధాని పదవికి అనర్హుడని కూడా అన్నారు. 2019లో టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, గుజరాత్‌లో అభివృద్ధిని గురించి చంద్రబాబు పలు వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రకం అభివృద్ధి గొప్పదేమీ కాదని, 21వ శతాబ్దంలో నడుస్తున్నది నాలెడ్జ్ ఎకానమీ అని చెప్పారు. గుజరాత్‌లో నాలెడ్జ్ ఎక్కడ ఉంది అని ప్రశ్నించారు. తాను హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ సృష్టించానని చెప్పారు. భవిష్యత్తు హైదరాబాద్, బెంగళూరులదేనని అన్నారు.

ఇంకొద్దిగా వెనక్కు వెళితే, 2002లో గుజరాత్ అల్లర్లు జరిగిన సమయంలోనైతే మోది ముఖ్యమంత్రి పదవినుంచి వైదొలగాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అప్పట్లో 2003 సంవత్సరంలో వినాయకచవితి వేడుకలకు భాగ్యనగర్ గణేష్ కమిటీవారు మోదిని హైదరాబాద్ రావాలని ఆహ్వానిస్తే నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు అనుమతి ఇవ్వలేదు.

కట్ చేస్తే, 2014లో ఎన్‌డీఏలో చేరారు. 2014 ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, మోది గుజరాత్‌ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని, దేశాన్ని కూడా అలాగే చేస్తారని చెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేదని చెబుతూ, 2018 మార్చి 7న ఎన్‌డీఏ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మోదిని పలు సందర్భాలలో తూర్పారబట్టారు. గుజరాత్‌లో మతవిద్వేషాలు రెచ్చగొట్టింది మోదియేనని, మళ్ళీ దీక్ష చేసేది కూడా మోదియేనని అన్నారు. మోది చౌకీదార్ కాదని, తన దగ్గర ఉన్న తాళాలతో గేట్లు తీసి దొంగలను విదేశాలకు పంపుతున్నారని విమర్శించారు. రక్షణ విధానాలను తుంగలో తొక్కి అనుభవంలేని రిలయన్స్‌కు రఫేల్ యుద్ధ విమానాల కాంట్రాక్టును ఇచ్చారని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేకహోదాకై ఢిల్లీలో రాహుల్ గాంధితో కలిసి ధర్మపోరాట దీక్ష చేసినప్పుడు ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ, మోది దేశాన్ని, ప్రజలను చీలుస్తున్నాడని ఆరోపించారు. తాను మోదికంటే ముందే ముఖ్యమంత్రి అయ్యానని, దేశ ప్రధానులు, రాష్ట్రపతి ఎంపికలో కీలకపాత్ర పోషించానని చెప్పారు.

వాస్తవానికి చంద్రబాబు ఇవాళ దేశంలోనే అత్యంత బలమైన వ్యక్తి. కేంద్రంలోని నరేంద్రమోది ప్రభుత్వాన్ని శాసించగల బలం ఆయనకు ఉంది… బీజేపీకి లోక్‌సభలో మెజారిటీ లేదు కాబట్టి. అయితే విచిత్రంగా చంద్రబాబు మాత్రం మోది తనను క్రీగంట చూసినా చాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనికి రెండు కారణాలు ఉండిఉండవచ్చు. ఒకటి - తన బలం తనకు తెలియకపోవటం. రెండు - జగన్మోహన్ రెడ్డి అంటే లోలోపల చంద్రబాబుకు ఉన్న విపరీతమైన భయం. పరిశీలనగా చూస్తే, మొదటిదానికంటే రెండో కారణమే సముచితంగా కనిపిస్తోంది.

మరోవైపు, 2024 ఎన్నికల్లో తెలుగుదేశాన్ని బీజేపీ కూటమిలోకి తీసుకువచ్చి నరేంద్రమోది మూడోసారి గద్దెనెక్కటంలో కీలకపాత్ర పోషించిన పవనేమో సనాతన ధర్మ పరిరక్షకుడి అవతారం ఎత్తిన హిందూత్వ ఛాందసవాదాన్ని మరింత రాజేస్తున్నారు. మొత్తంమీద అటు చంద్రబాబు, ఇటు పవన్ కలిసి బీజేపీ నేతలు అడగకపోయినా ఏపీలో ఆ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు.

Tags:    

Similar News