చెేవెళ్లలో 120 మంది రైతులు నిరసన నామినేషన్?, పార్టీలకు ముచ్చెమటలు

ఏళ్లు గడస్తున్నా అందని పరిహారంతో విసిగిపోయిన చందనవెల్లి రైతులు ఉద్యమ బాట పట్టారు. తమ నిరసనను తెలిపేందుకు 120 మంది రైతులు ఎంపీ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించారు.

Update: 2024-03-22 09:45 GMT
parliement



పంటలు పండే తమ భూములను తీసుకున్న ప్రభుత్వం ఏళ్లు గడుస్తున్నా తమకు పరిహారాన్ని ఇవ్వకపోవడంతో  చెేవెళ్ల లోక్ సభ నియోజక వర్గంలోని  చందనవెల్లి రైతులు కన్నెర్ర చేశారు. తమ నిరసనను ఎన్నికల నామినేషన్ రూపంలో వ్యక్తం చేయాలనుకుంటున్నారు.


తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లిలో అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా షాబాద్ మండలం చందన్‌వెల్లి, హయతాబాద్, సీతారాంపూర్ గ్రామాల పరిధిలో రైతుల నుంచి 3,600 ఎకరాల భూములను సేకరించారు. ఒక్క చందన్ వెల్లి గ్రామంలోనే 1600 ఎకరాలను రైతుల నుంచి భూములను సేకరించారు. చందనవెల్లి పక్కనే ఉన్న సీతారాంపూర్‌ గ్రామంలో పారిశ్రామిక పార్కు కోసం 1,148 ఎకరాలు సేకరించింది.


రైతుల నుంచి సర్కారు కారుచౌకగా సేకరించిన భూములు
చందన్‌వెల్లి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కోసం తమ గ్రామంలోని వ్యవసాయ భూమిని ఎకరం రూ.15లక్షలకు రాష్ట్రప్రభుత్వం బలవంతంగా సేకరించిందని స్థానిక రైతులు చెప్పారు. మార్కెట్ రేటు ప్రకారం ఎకరం ధర రూ.1.5కోట్లు ఉండగా, భీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరం 15లక్షల రూపాయలకే తీసుకుందని రైతులు ఆరోపించారు. ప్రస్థుతం తమ గ్రామంలో ఎకరం భూమి ధర రూ.3కోట్లకు పెరిగిందని రైతులు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను మోసం చేసి తమ వద్ద నుంచి చౌకగా సేకరించిన భూములను అధిక రేట్లకు పారిశ్రామికవేత్తలకు విక్రయిస్తుందని రైతులు చెప్పారు. పారిశ్రామిక పార్కు కోసం ఎకరం రూ.15 లక్షలకు ప్రభుత్వం తమ నుంచి 1000 ఎకరాలకు పైగా బలవంతంగా సేకరించిందని నిర్వాసితులు చెప్పారు.

141 రోజులపాటు రైతుల దీక్ష
తమ వ్యవసాయ భూములను లాక్కోని భూదందా చేస్తున్న సర్కారు వైఖరికి వ్యతిరేకంగా చందన్‌వెల్లి రైతులు 141 రోజులపాటు దీక్ష చేశారు.గత ప్రభుత్వానికి,రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేశారు. పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరిట జబర్దస్తీగా భూ దోపిడీ చేసి తమను మోసం చేశారని చందన్‌వెల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. భూసేకరణలో అధికారులు అడుగడుగునా అక్రమాలకు పాల్పడ్డారు. పరిహారం రీహాబిలిటేషన్ రీసెటిల్ మెంట్ యాక్ట్ 2013, తెలంగాణ యాక్ట్ నంబర్ 21, 2017 సవరణ చట్టాలకు అనుగుణంగా పరిహారం ఇవ్వకుండా తమను పాలకులు మోసం చేశారని రైతులు ఆవేదనగా చెప్పారు. బడా పారిశ్రామికవేత్తలకు భూములను కట్టబెట్టి, రైతులను బికారీలను చేసిన చందన్‌వెల్లి భూకుంభకోణం సంచలనం రేపింది.

భూనిర్వాసితులకు అందని పరిహారం
భూనిర్వాసితులందరికీ పరిహారం, పునరావాసం ఇంకా అందలేదు. నిర్వాసితులకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 121 చదరపుగజాల ఇంటి స్థలం అందించడమే కాకుండా ఎకరాకు రూ.21 లక్షల పరిహారం చెల్లించిందని అధికారులు చెబుతున్నారు. కానీ చందనవెల్లి రైతులకు మాత్రం ఎలాంటి పరిహారం అందలేదు. తమకు అభివృద్ధి చేసిన గృహ ప్లాట్లు, ఇదే తరహా ప్యాకేజీ ఇవ్వాలని చందన్ వెల్లి రైతులు కోరారు.చందనవెల్లి గ్రామంలోని 190 సర్వేనంబరులో భూమిని సేకరించేందుకు అధికారులు ఎంజాయ్‌మెంట్ సర్వే పేరిట మోసం చేశారు. భూమి లేని వారి పేర్లను కూడా చేర్చి, వారికి పరిహారం చెల్లించారని రైతులు ఫిర్యాదు చేశారు.

స్థానికులకు అందని ఉపాధి
రంగారెడ్డి జిల్లాలోని మండల పరిధిలోని హయతాబాద్, చందనవెల్లి, సీతారాంపూర్ మూడు గ్రామాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటు వల్ల స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినా ఉపాధి లభించలేదు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అప్పట్లో మంత్రి హామీ ఇచ్చారు. కానీ పరిశ్రమలు ఏర్పాటైనా స్థానికులకు ఉపాధి మాత్రం దొరకలేదని స్థానిక నిరుద్యోగులు ఆవేదనగా చెప్పారు.

న్యాయం చేయాలని భూ బాధితుల వినతి
చందనవెల్లి గ్రామం పరిశ్రమల కల్పవల్లిగా మారి ఐదేళ్లలో రూ.13,508కోట్ల పెట్టుబడులతో 40 పరిశ్రమలు ఏర్పాటైనా స్థానికులకు ఉద్యోగావకాశాలు మాత్రం లభించలేదు. చందనవెళ్లి భూబాధితులు వేమారెడ్డి,చేవెళ్ల స్వామి, రామచంద్రయ్య,సలీం,సత్తయ్య, కిష్టయ్య,నర్సింలు,మల్లయ్య, శ్రీనివాస్ శోభ,ఇంద్రమ్మ,లక్ష్మమ్మ, రైతులు అందోళన తాజాగా చేశారు.చందన్‌వెల్లిలో భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలని భూబాధితులు ఇటీవల జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారిని కోరారు.

అసెంబ్లీ ముందు రైతు ఆత్మహత్యాయత్నం
పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం తన భూమిని సేకరించినా, తనకు పరిహారం ఇవ్వలేదనే ఆవేదనతో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్ వెల్లి భూనిర్వాసితుల సంఘం అధ్యక్షుడు నీరటి ఆంజనేయులు గత ఏడాది ఆగస్టు 5వతేదీన హైదరాబాద్ నగరంలోని అసెంబ్లీ ముందు ఆత్మహత్య యత్నం చేశారు. అసెంబ్లీ ఎదుట బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు అతడిపై నీళ్లు చల్లి రైతు ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకున్నారు. రైతు వినతి పట్టించుకోకపోగా, అసెంబ్లీ ఎదుట ఆత్మహత్య యత్నం చేశాడని రైతుపై సైఫాబాద్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. చందన్ వెల్లి, మాచన్ పల్లి గ్రామాల్లో 1960, 1970 సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీలకు అప్పటి సర్కారు 2వేల ఎకరాల సాగుభూమిని ఇవ్వగా, దాన్ని 2017వ సంవత్సరంలో ప్రభుత్వం తీసుకొని, పరిహారం మాత్రం కొందరు ప్రజాప్రతినిధులు అధికారులు బినామీ పేర్లతో కాజేశారని నీరటి ఆంజనేయులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని దీక్షలు చేసినా, అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆంజనేయులు పేర్కొన్నారు.

భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తా : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
చేవేళ్ల నియోజకవర్గ పరిధిలోని షాబాద్ మండలం చందనవెల్లి ఇండస్ట్రియల్ పార్కు భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తానని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా హామి ఇచ్చారు. చందనవెల్లి పారిశ్రామిక పార్కు కోసం భూసేకరణ వల్ల నష్టపోయిన రైతుల కుటుంబాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇటీవల కలిసి మాట్లాడారు. ఎంజాయ్‌మెంట్ సర్వే, రైతులకు జరిగిన అన్యాయంపై తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని డిప్యూటీ సీఎం రైతులకు హామీ ఇచ్చారు. రైతులను మోసగించిన అధికారులు, దళారులను వదిలిపెట్టబోమని ఆయన చెప్పారు. రైతులకు చెందిన భూమిని సేకరించి నెలకొల్పిన పరిశ్రమల్లో స్థానికులకు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుందని భట్టి హామీ ఇచ్చారు.

చేవేళ్ల బరిలో 120 మంది రైతుల పోటీ
చందన్‌వెల్లి పారిశ్రామిక కారిడార్ కోసం భూములిచ్చి ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందక పోవడంతో రైతులు ఉద్యమించేందుకు భూ నిర్వాసితుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తమ రైతుల గోడను ఎవరూ పట్టించుకోకపోవడంతో తమ సమస్యను జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల ఎంపీ స్థానం నుంచి రైతులు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే చందన్ వెల్లి భూనిర్వాసితుల సంఘం పక్షాన 120 మంది రైతులు పార్లమంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తం అయ్యారు. రైతులు మూకుమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో అన్ని రాజకీయ పక్షాల నేతలు, అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.


Tags:    

Similar News