హర్యానాలో బీజేపీకి హ్యాట్రిక్ మిస్ అయినట్లేనా? కాంగ్రెస్ సీఎమ్ ఎవరు?

జవాన్, పహిల్వాన్(రెజలర్), కిసాన్‌లే బీజేపీని ఓడించారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Update: 2024-10-06 12:42 GMT

హర్యానాలో ఎగ్జిట్ పోల్ సర్వే చేసిన అన్ని సంస్థలూ ముక్తకంఠంతో బల్లగుద్ది ఒకటే చెబుతున్నాయి… కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అని. దీనినిబట్టి చూస్తే, పదేళ్ళపాటు హర్యానాలో పాగా వేసిన బీజేపీకి పరాభవమే మిగిలినట్లు కనబడుతోంది. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం ఇంకా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ, తాము హ్యాట్రిక్ కొట్టబోతున్నామని చెబుతున్నారు.

స్వల్ప ఘటనలు మినహా హర్యానాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ శాతం 65.65 గా నమోదయింది. 90 స్థానాలున్న హర్యానా రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది. అయితే 2019లో పూర్తి మెజారిటీ రాకపోవటంతో దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జన్ నాయకు జనతా పార్టీ(జేజేపీ)తో పొత్తు పెట్టుకోవాల్సివచ్చింది. ఈ పదేళ్ళ కాలంలో తొమ్మిదిన్నర ఏళ్ళుగా మనోహర్ లాల్ ఖట్టర్ ఒక్కరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత మార్చి నెలలో ఆయన స్థానంలో నయాబ్ సింగ్ సైని వచ్చారు. ఈసారి జేజేపీ పార్టీ బీజేపీని వీడి ఆజాద్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఓంప్రకాష్ చౌతాలాకు చెందిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ పొత్తు పెట్టుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకూడా ఈ సారి బరిలో దిగింది.

తీవ్రంగా పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత

బీజేపీ పది సంవత్సరాలు అధికారంలో ఉండటంతో ఆ పార్టీపట్ల వ్యతిరేకత బాగా ఉంది. ఈ పరిస్థితిని మార్చటంకోసమే గత మార్చి నెలలో ముఖ్యమంత్రి పదవినుంచి ఖట్టర్‌ను తొలగించి, సైనిని పెట్టారు. అయితే ఆరునెలల్లో అతను చేయగలిగింది కూడా ఏమీ లేదు. గత మే నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం పది స్థానాలలో బీజేపీ 5, కాంగ్రెస్ 5 గెలుచుకున్నాయి. జాట్ల ఓట్లను సంఘటితం చేయటంకోసం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆ సామాజికవర్గానికి పెద్దసంఖ్యలో టిక్కెట్లు ఇచ్చింది. మరోవైపు బీజేపీ జాట్ లు కాకుండా మిగిలిన సామాజికవర్గాలైన బ్రాహ్మణులు, బనియాలు, పంజాబీ/ఖత్రీలు, రాజ్‌పుట్‌ల ఓట్లను సంఘటితం చేయటానికి ప్రయత్నించింది.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరా హోరీగా పోటీ జరిగిందన్న విషయాన్ని తాము అంగీకరిస్తామని హర్యానాకు చెందిన బీజేపీ సీనియర్ నేత హర్జీత్ సింగ్ గ్రేవాల్ ‘ది ఫెడరల్‌’కు చెప్పారు. అయితే ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పినట్లు ప్రతిపక్షాలు గెలవటం అసాధ్యమని, బీజేపీయే వరసగా మూడోసారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని అన్నారు. పది సంవత్సరాలు తమ పార్టీ అధికారంలో ఉందికాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఉండవచ్చని, అయినా దానిని అధిగమిస్తామని తమకు నమ్మకం ఉందని చెప్పారు.

ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని తెలిసో, ఏమో ప్రధాని నరేంద్ర మోది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా తక్కువ సభలలో మాత్రమే పాల్గొన్నారు. ప్రచారమంతా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి ఖట్టర్, ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనిలే చూసుకున్నారు.

బీజేపీకి ప్రతికూలించిన అంశాలు

ముఖ్యంగా మూడు అంశాలు కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసొచ్చాయి. 1. బీజేపీకి చెందిన రెజలింగ్ ఇండియా ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజలర్‌ల నిరసనలు, 2. కనీస మద్దతు ధరపై లీగల్ గ్యారంటీ కోరుతూ రైతుల నిరసనలు, 3. సైన్యంలో నియామకాలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ పథకంపై వ్యతిరేకత. పహిల్వాన్(రెజలర్), కిసాన్, జవాన్‌లే బీజేపీని ఓడించారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ముఖ్యమంత్రి రేసులో ఎవరు?

కాంగ్రెస్ పార్టీలో యధావిధిగానే ముఖ్యమంత్రి పీఠంకోసం చాలామంది పోటీ పడుతున్నారు. వారిలో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా(Bhoopinder Singh హోదా), రణదీప్ సుర్జేవాలా, కుమారి సెల్జా(సెల్జా) ముందంజలో ఉన్నారు. భూపీందర్ సింగ్, రణదీప్ జాట్ సామాజికవర్గానికి చెందినవారుకాగా, సెల్జా దళిత నాయకురాలు.

Tags:    

Similar News