ఆల్కహాలు తీసుకోవడం వచ్చే అనర్థాల గురించి జాతీయ పోషకాహార సంస్థ సైంటిస్ట్ డాక్టర్ మెకం మహేశ్వర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు వివరించారు.
మద్యం ఆరోగ్యానికి హానికరం
మద్యం సేవించడం వల్ల స్వరపేటిక, అన్నవాహిక, ప్రోస్టేట్, రొమ్ము కేన్సర్లు వచ్చే ప్రమాదముందని ఆయన చెప్పారు.అధికంగా మద్యం తాగడం వల్ల గుండె కండరాలు బలహీన పడతాయని వెల్లడించారు. అధిక మద్యపానం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం, కాలేయం, మెదడు, నరాలు దెబ్బతింటాయని తెలిపారు.
30 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ మద్యం తాగితే పెను ముప్పే
కొందరు మందుబాబులు ప్రతి నిత్యం మద్యాన్ని తాగుతూనే ఉంటారు. అయితే 30 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ మోతాదులో మద్యం తాగితే వారికి సీరం ట్రైగ్లిజరైడ్ స్థాయి పెరిగి హైపర్ టెన్షన్, స్ట్రోక్ వచ్చే అవకాశముంది.
మద్యంతో ఒబేసిటీ
నిత్యం అధికంగా మద్యం తాగడం వల్ల ఒబేసిటీ కూడా పెరుగుతుందని ఎన్ఐఎన్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. బీరులో 2 నుంచి 5 శాతం, వైన్ లో 8 నుంచి 10 శాతం ఆల్కాహాలు ఉంటుంది. విస్కీ, రమ్, బ్రాందీలో 30 నుంచి 40 శాతం కంటే అధికంగా ఆల్కాహాలు ఉంటుంది. మద్యంలో అధిక కాలరీలు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల కంటే అధికంగా ఉన్న కాలరీలు ఒబేసిటీని పెంచుతాయి. రోజూ మద్యం తాగుతుంటే దానికి బానిసగా మారడంతో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
,
భోజనానికి ముందు, తర్వాత కాఫీ,టీలు తాగొద్దు
భోజనానికి గంట ముందు, తర్వాత టీ, కాఫీలు తాగవద్దని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. టీ,కాఫీల్లో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ కెఫిన్ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. 150 మిల్లీలీటర్ల కప్పు కాఫీలో 80 నుంచి 120 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. అలాగే ఇన్ స్టంట్ కాఫీలో 50 నుంచి 65 మిల్లీగ్రాములు, టీలో 30 నుంచి 65 గ్రాముల కెఫిన్ ఉంటుంది. టీ,కాఫీ తాగే అలవాటున్న వారిలో రోజుకు కెఫిన్ 300 మిల్లీగ్రాములు మించరాదు. ఈ కెఫిన్ ఇనుము శోషణకు అంతరాయం కలిగిస్తోంది. అందువల్ల టీ, కాఫీలు భోజనానికి గంట ముందు తర్వాత తాగరాదు.
బ్లాక్ టీ తాగడం మేలు
కెఫిన్, గ్రీన్ టీ, బ్లాక్ టీ తాగడం వల్ల ధమనులను సడలించడంతోపాటు రక్త ప్రసరణను పెంచుతాయి. టీ,కాఫీలు తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ వల్ల కరోనరీ హ్రద్రోగాలు, ఉదర కేన్సర్లు ముప్పు తగ్గుతోందని నిపుణులు చెప్పారు. టీలో పాలు లేకుండా బ్లాక్ టీ తాగితే మేలని సూచించారు. అధికంగా కాఫీ తాగితే బ్లడ్ ప్రషర్, హార్ట్ బీట్ పెరుగుతుంది. కాఫీనే కాదు టీ కూడా ఎక్కువ సార్లు తీసుకోవడం నివారించాలని శాస్త్రవేత్తలు సూచించారు.
తాజా పండ్ల రసాలు
మనం సాధారణంగా ఆరంజ్, లెమన్, ద్రాక్ష, మామిడి, ఫైనాపిల్, ఆపిల్, దానిమ్మలాంటి పండ్ల రసాలను తాగుతుంటాం. ఈ పండ్ల రసాల్లో చక్కెర కలపకుండా పండ్ల రసాలు తీసుకోవాలి. ఈ పండ్లలో బీటా కరోటీన్స్, విటమిన సి, పోటాషియం, కాల్షియం లాంటి మినరల్స్ ఉంటాయి. పండ్లలో వివిధ రకాల విటమిన్లు, మినరల్స్, డైటరీ ఫైబర్ ఉంటాయి. పెద్దలు అప్పుడప్పుడు 150 గ్రాముల పండుకు మించకుండా తీసుకోవచ్చు. పండ్ల రసాల కంటే తాజా పండ్లను తీసుకోవడం మేలు. మన దేశంలో వేసవికాలంలో ఎక్కువ మంది చెరకు రసం తాగుతుంటారు. దీనిలో 100 మిల్లీలీటర్ల చెరకు రసంలో 13 నుంచి 15 గ్రాముల చక్కెర ఉంటుంది. చక్కెర శాతం అధికంగా ఉన్న చెరకు రసాన్ని తగ్గించడం మేలు.
సాఫ్ట్ డ్రింకులు వద్దు...తాజా పండ్లు ముద్దు
సింథటిక్ సాఫ్ట్ డ్రింకులు తాగకుండా నివారించడం మేలు. మంచినీళ్లు, తాజా పండ్లు తీసుకోవాలి కానీ వాటి స్థానంలో పండ్ల పల్ప్, నిల్వ చేసిన పండ్ల రసాలు తాగరాదు. చక్కెర, మలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, వెనిగర్ లాంటి కృత్రిమ పదార్థాలను నివారించడం మేలు. సాఫ్ట్ డ్రింకుల్లో చక్కెర, ఉప్పు శాతం ఎక్కువగా ఉంటాయని అందువల్ల వాటికి దూరంగా ఉండటం మేలు.
పాలు తాగితే మంచిది...
పాలు అన్నీ వయసుల వారికి మెరుగైన ద్రవాహారం. పాలు చిన్న పిల్లలకే కాదు పెరిగే పిల్లలు, యువకులు, తల్లులు,పెద్దలు అందరూ పలు గుణాలున్న పాలను తీసుకోవడం మేలని చెబుతున్నారు. పాలలో కాల్షియం ఉంటుంది. పాలు సులభంగా జీర్ణమవుతాయి. అందుకే కాచిన పాలను తీసుకోవచ్చు.
మన శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. మన శరీరానికి కావాల్సిన మంచినీటితోపాటు కొబ్బరి, లెమన్ నీళ్లు తాగవచ్చు. మన శరీరంలోని విసర్జితాలను తొలగించి శరీర ఉష్ణోగ్రతను రెగ్యులేట్ చేయడానికి నీరు కీలక పాత్ర పోషిస్తోంది. మనం తాగే నీరు మూత్రం, చెమట రూపంలో పోతుంటుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వారు రోజుకు కనీసం 8 గ్లాసుల మంచినీరు అంటే రెండు లీటర్లు తాగాలి. వేసవి కాలంలో అయితే ఎండవేడిమి, ఫిజికల్ యాక్టివిటీ వల్ల చెమట రూపంలో నీరు బయటకు పోతున్నందున ఇంకా అధికంగా నీరు తాగాలి.
సురక్షిత మంచినీరు తాగాలి
బాక్టీరియా, వైరస్, పారాసైట్స్, హానికరమైన పురుగుమందులు, పారిశ్రామిక వ్యర్థాలు, హెవీ మెటల్స్, నైట్రేట్లు, సిలికా, అధికంగా ఫ్లోరైడ్ ఉన్న నీటిని తాగరాదు. లీటరు నీటిలో 1 నుంచి 15 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ ఉన్న నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. మంచినీటిని 10 నుంచి 15 నిమిషాల పాటు కాచి తాగితే మంచిది. నీటిని వేడిచేయడం వల్ల వ్యాధికారక బాక్టీరియా చనిపోతోంది. 20 లీటర్ల నీటిలో 0.5 గ్రాములు క్లోరిన్ టాబ్లెట్ వేసి కాచి వడపోసి తాగితే మంచిది.
కొబ్బరి నీళ్లు తాగడం మేలు
కొబ్బరినీళ్లు తాగడం మేలు. పలు మినరల్స్ ఉన్న కొబ్బరి నీళ్లు హైడ్రేటింగ్ పానీయంగా ఉపయోగపడతాయి. కిడ్నీ, హృద్రోగాలు ున్నవారు కొబ్బరి నీళ్లు తాగరాదు.
జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్తల డైటరీ గైడ్ లైన్సులో సూచనలు
- ప్రతీరోజూ సరిపడా సురక్షితమైన మంచినీరు తాగాలి.
- సురక్షితమైన నీరు కాదని భావించినపుడు, ఆ నీటిని కాచి తాగడం మంచిది.
- పండ్ల రసాలు కాకుండా తాజా పండ్లను తినడం మేలు.
- వేసవికాలంలో సింథటిక్ సాఫ్ట్ డ్రింకులు కాకుండా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, లెమన్ వాటర్ తాగడం మేలు.
- మద్యపానీయాలు తాగడం నివారించాలి.