కేసీఆర్ జన్మదిన కానుక ఇది

బీఆర్ఎస్ నేతలకు నేటి నుంచి కేసీఆర్ తెలంగాణ జాతిపిత బాపూ. ఈ హఠాత్పరిణామం మీద ‘తెలంగాణ ఫెడరల్’ ప్రత్యేక కథనం...

Update: 2024-02-17 08:16 GMT
KCR (Photo Credit : Facebook)

ఓటమి అనంతరం ఏడు పదుల వయసులోనూ కేసీఆర్ తన కొత్త రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాజకీయ చాణుక్యుడిగా పేరొందిన కేసీఆర్ తన మాటలతో ప్రజలను మంత్ర ముగ్ధులను చేస్తుంటారు. పదేళ్ల పాటు తెలంగాణాను ఏలిన కేసీఆర్ ఓటమి అనంతరం మళ్లీ తెలంగాణ ఉద్యమ నాయకుడిగా మారడంతో ఆ పార్టీ నాయకులు జాతిపిత బాపూ అంటూ సరికొత్త ప్రచారానికి తెర తీశారు. మెదక్ జిల్లా చింతమడక గ్రామానికి చెందిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు చిన్ననాటి నుంచి రాజకీయాలంటే ఇష్టం. తెలంగాణ ఉద్యమ సెంటిమెంటును రగిల్చి ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ 2001వ సంవత్సరం ఏప్రిల్ 7వతేదీన తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. తెలంగాణ బతుకులు...బొగ్గుబాయి, బొంబాయి.. దుబాయి అన్నట్లు తయారైనయ్ అని తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించిన కేసీఆర్ ఓటమి అనంతరం, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సరికొత్త రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారు. గతంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా నేతలు ఆయన్ను కలిసి పదవులు పొందేందుకు శుభాకాంక్షలు తెలిపేవారు. సీఎంగా ఉన్నపుడు కేసీఆర్ జన్మదినోత్సవాలు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగేవి. కానీ ఈ సారి ఓటమి పాలవడంతో కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. కేసీఆర్ వేడుకలకు దూరంగా ఉన్నా, ఆ పార్టీ నేతలు మాత్రం మన తెలంగాణ బాపూ అంటూ ప్రచార హోరు సాగించారు.

కేసీఆర్ ప్రతిష్ఠ పెంచడానికి ‘బాపూ’ ప్రచారం

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70వ జన్మదినం సందర్భంగా శనివారం ఆయన నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాతిపిత బాపూ పేరిట సరికొత్త ప్రచారం సాగిస్తున్నారు. తెలంగాణలో ఓటమి పాలవడంతోపాటు అధికార కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి కాళేశ్వరం నుంచి కృష్ణ జలాల వరకు విమర్శల వర్షం కురుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రతిష్ఠ పెంచేందుకు బీఆర్ఎస్ నాయకులు బాపూ ప్రచారంతో ముందుకు వెళుతున్నారు. తెలంగాణ సిద్ధించిన పదేళ్ల తర్వాత కూడా మళ్లీ తాజాగా తెలంగాణ సెంటిమెంటును రగిలిస్తున్నారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా, బాపూ అని పిలవడం ఆయనకు మనం ఇచ్చే గౌరవమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చెప్పారు. తెలంగాణలో గతంలో కొండా లక్ష్మణ్ బాపూజీని మాత్రమే బాపూ అని పిలిచే వారు. కానీ ప్రస్థుతం ఆ బాపూ పేరును కేసీఆర్ కు కొత్తగా చేర్చారు.

వాట్సాప్, ఫోన్ కాల్స్ ద్వారా తెలంగాణ జాతిపిత బాపూ పేరిట ప్రచారం

కేసీఆర్ బాపూ ప్రచారం శనివారం వాట్సప్, ఫోన్ కాల్స్ ద్వారా ముమ్మరం చేశారు. కరవు నేలను సిరుల మాగాణం చేసిన ‘‘తెలంగాణ బాపు’’ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70 జన్మదినం సందర్భంగా ఆయన్ని విష్ చేసేందుకు +91 70703 57070 ఫోన్ నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి, ధన్యవాదాలు అంటూ వాట్సాప్ ద్వారా శనివారం తెలంగాణ వ్యాప్తంగా వాట్సాప్ మెసేజులు వచ్చాయి. ఆ ఫోన్ నంబరుకు రింగ్ మిస్డ్ కాల్ చేస్తే చాలు వెంటనే ‘‘ప్రతీ తెలంగాణ బిడ్డకు పేరుపేరునా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’అంటూ కేసీఆర్ తన వాయిస్ వినిపించారు.

పత్రికల్లో బీఆర్ఎస్ ప్రచార ప్రకటనలు

‘‘కోట్ల మంది కలల తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన మహానాయకుడు, ఉద్యమ నేలను ఉద్యానవనంగా మార్చిన దార్శనికుడు, తెలంగాణ రాష్ట్ర గతిని మార్చి చరిత్ర లిఖించిన కార్యసాధకుడు మన తెలంగాణ బాపు కేసిఆర్ గారు.’’ ‘‘బాపూ... సబ్బండ కులాల ఆశాదీపం మీరు, సకల జనుల ఆకాంక్షల ఆలంబన మీరు, నిరాశా నిస్ప్రహలను తరిమే చైతన్యపు కాగడా మీరు, ఉషోదయాలకు తొలిపొద్దు మీరు, నాడు ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చింది మీరు’’ వాన్ గార్డ్ ఆఫ్ తెలంగాణ...వెలుగు దివిటి కేసీఆర్ అంటూ ‘‘కుట్రలు, కుతంత్రాలకు, ప్రలోభాలకు లొంగని, జంకని తెలంగాణ పక్షపాతివి...తెలంగాణ పితామహుడు మన తెలంగాణ జాతిపిత బాపూ’’ అంటూ బీఆర్ఎస్ నేతలు, రాజ్యసభ సభ్యుడు ఒద్దిరాజు రవిచంద్ర, పల్లా రాజేశ్వరరెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి శనివారం జన్మదినం సందర్భంగా పత్రికల్లో ప్రచార ప్రకటనలు జారీ చేశారు.

ఆడియో, వీడియో పాటల ద్వారా ప్రచారం

కేసీఆర్ 70 వ జన్మదినం సందర్భంగా తెలంగాణ సెంటిమెంటును రగిల్చేలా, కేసీఆర్ ప్రతిష్ఠ పెంచేలా ఆడియో, వీడియో పాటల ద్వారా ప్రచారం సాగించారు. ‘‘ఉక్కు గుండెను ఒక్కసారన్నా తాకాలని ఉన్నదే. ఆ బక్కపల్చని పెయ్యి హత్తుకోవాలని ఉన్నదే... ఆ నాటి గురుతులు ఒక్కొక్కటి ఏరుకొని రాశులు పోయాలని ఉన్నదే సావు అంచులకెళ్లి సాధించే రాష్ట్రాన్ని సారూ కేసీఆర్ చరితను తెలుసుకోవాలని ఉన్నదే మదినిండా తెలుసుకోవాలని ఉన్నదే’’ అంటూ పాటలను విడుదల చేశారు. ఎప్పటికప్పుడు రాజకీయ వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నే కేసీఆర్ బాపూ పేరిట సాగిస్తున్న ప్రచారం ఆ పార్టీకి ఏ మేర ఉపయోగపడుతుందనేది వేచి చూడాల్సిందేనని సీనియర్ జర్నలిస్ట్ శ్యాంమోహన్ చెప్పారు.

సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం

కేసీఆర్ బాపూ అంటూ బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్‌ పదేళ్ల పాలనపై, కాళేశ్వరం అవినీతి దందాపై కాంగ్రెస్‌ నాయకులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆయన ఇమేజ్‌ను పెంచేందుకు, తెలంగాణ బాపూగా ప్రచారం సాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేతగా బాపూగా ప్రచారం సాగిస్తూ బీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ప్రజలు సైతం కేసీఆర్‌ను బాపూగా పిలిచేలా ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాల్లో పార్టీ కార్యకర్తలు, శ్రేణులు పోస్టులు పెడుతున్నారు. కేసీఆర్‌ ఒక పార్టీ నాయకుడే కాదని, యావత్‌ తెలంగాణ సమాజానికి జాతిపిత బాపూ అని మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

కేసీఆర్‌ 70వ జన్మదిన వేడుకలను తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిపారు. శనివారం ఉదయం రాష్ట్ర మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేక్‌ కట్‌ చేసి ముందుగా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుకు తినిపించారు.ఈ సందర్భంగా 70 కిలోల కేక్‌ను కట్‌ చేశారు. అనంతరం దివ్యాంగులకు వీల్‌ చైర్లు, ఆటోడ్రైవర్లకు బీమా పత్రాలను అందజేశారు. బీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో బాపూ జన్మదినం సందర్భంగా శనివారం కేక్ కటింగ్, పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు, అన్నదానం, మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతీ ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఛైర్మన్, ఎంపీ సంతోష్ కుమార్ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.


Tags:    

Similar News