కుకట్ పల్లి హంతకులను పట్టిచ్చిన క్యాబ్ డ్రైవర్

రైల్వస్టేషన్ దగ్గర క్యాబ్ ఎక్కిన ఇద్దరు ర్యాంచీలో తమ ఇంటిదగ్గర దిగి డబ్బులిచ్చేసి క్యాబును పంపేశారు;

Update: 2025-09-13 03:13 GMT
Kukatpalli murderers and victim Renu Agarwal

కుకట్ పల్లిలో మూడురోజుల క్రిందట జరిగిన హత్యకు సంబంధించి ముగ్గురు హంతకులను పోలీసులు శనివారం ఉదయం అరెస్టుచేశారు. హంతకులను ఝార్ఖండ్(Jharkhand) , రాంచిలో అరెస్టుచేశారు. కుకట్ పల్లి(Kukatpalli murder)లో రేణుఅగర్వాల్ అనే గృహిణిని ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఇద్దరు కలిసి హత్యచేసిన విషయం కలకలం రేపింది. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారు నగలను దోచుకునే ఉద్దేశ్యంతోనే రేణుని కుర్చీకి కట్టేసి చిత్రహింసలు పెట్టి చివరకు కుక్కర్ తో తలపైన బలంగా కొట్టి హత్యచేశారు. హంతకులకోసం గాలిస్తున్న పోలీసులకు ఒక క్యాబ్ డ్రైవర్(Cab Driver) ఇచ్చిన సమాచారంతో పట్టుకున్నారు. కుకట్ పల్లిలో యజమాని ఇంటినుండి హంతకులు ఇద్దరు యజమానికి చెందిన స్కూటితో వెళ్ళిపోయారు.

సదరు స్కూటీని ఇద్దరు రైల్వేస్టేషన్లో ఉంచారు. అక్కడి నుండి రైలులో రాంచీకి వెళదామని అనుకున్నారు. అయితే మనసు మార్చుకున్నారు. ఎందుకంటే చేతిలో పుష్కలంగా డబ్బులు ఉన్నపుడు రైలులో ప్రయాణించాల్సిన ఖర్మ ఏమిటని అనుకున్నట్లున్నారు. అందుకనే దర్జాగా ఒక క్యాబును రాంచీకి మాట్లాడుకున్నారు. రైల్వస్టేషన్ దగ్గర క్యాబ్ ఎక్కిన ఇద్దరు ర్యాంచీలో తమ ఇంటిదగ్గర దిగి డబ్బులిచ్చేసి క్యాబును పంపేశారు. తాము ప్రయాణించిన క్యాబ్ డ్రైవరే తమను పట్టిస్తాడని అప్పుడు హంతకులు ఊహించలేదు.

హత్య జరిగిన తర్వాత ఇంట్లోనుండి హంతకులు బయటకు వచ్చే సీసీ ఫుటేజ్ దృశ్యాలను పోలీసులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. దాంతో హంతకులు ఇద్దరు సోషల్ మీడియాతో పాటు మీడియాలో బాగా పాపులరయ్యారు. వీళ్ళిద్దరి వీడియోలు గమనించిన క్యాబ్ డ్రైవర్ వెంటనే పోలీసులను కలిశాడు. తన క్యాబులోనే హంతకులు ప్రయాణం చేసినట్లు చెప్పాడు. రైల్వేస్టేషన్ నుండి బయలుదేరి ర్యాంచీలో ఒక ఇంటిదగ్గర దిగేంతవరకు జరిగిన విషయాలను మొత్తం పూసగుచ్చినట్లు వివరించాడు. దాంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే క్యాబ్ డ్రైవర్ ను తీసుకుని ర్యాంచిలో వాళ్ళు దిగిన ఇంటికి వెళ్ళారు.

ఇంట్లోనే ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అలాగే హత్య, దోపిడిలో మరికొందరు భాగస్తులు ఉన్నట్లు గ్రహించారు. దాంతో ఇద్దరిని విచారించిన పోలీసులు మరో యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. హత్య, దోపిడీలో మొత్తం తొమ్మిదిమంది ఉన్నట్లు పోలీసులు గ్రహించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన ఆరుగురికోసం గాలిస్తున్నారు. ర్యాంచీ కోర్టులో ఈ ముగ్గురిని ప్రవేశపెట్టి అనుమతి తీసుకున్న తర్వాత అక్కడి నుండి హైదరాబాదుకు చేరుకునేందుకు పోలీసులు అవసరమైన ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు.

Tags:    

Similar News