అసెంబ్లీ అధ్యక్ష పీఠంపై తొలి దళితుడు! మర్పల్లి నుంచి శాసనసభాధిపతి వరకు

ఎక్కడ మర్పల్లి.. ఎక్కడ హైదరాబాద్‌ అసెంబ్లీ.. అదీ ఓ దళితుడు. ఆ స్థానానికి ఎదగడమంటే మాటలా? అప్పుడెప్పుడో ప్రతిభా భారతి.. ఇప్పుడు గడ్డం ప్రసాద్‌ కుమార్‌..

Update: 2023-12-13 13:46 GMT
గడ్డం ప్రసాద్ కుమార్ కు పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క

క్కడ మర్పల్లి.. ఎక్కడ హైదరాబాద్‌ అసెంబ్లీ.. అదీ ఓ దళితుడు. ఆ స్థానానికి ఎదగడమంటే మాటలా? అప్పుడెప్పుడో ప్రతిభా భారతి.. ఇప్పుడు గడ్డం ప్రసాద్‌ కుమార్‌.. సుదీర్ఘకాలం తర్వాత అసెంబ్లీ స్పీకర్‌గా ఓ దళితుని ఎన్నిక. కాంగ్రెస్‌ ఎంపిక భేష్‌ అంటూ మురిసిపోతున్న తెలంగాణ సమాజం.. గడ్డం ప్రసాద్ కుమార్. ఓ పడి లేచిన కెరటం. 

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక ఇక లాంఛనమే. ఒకే ఒక నామినేషన్‌ దాఖలైంది. అదొక్కటీ కాంగ్రెస్‌ పార్టీ నామినేట్‌ చేసిన గడ్డం ప్రసాద్‌ కుమార్‌దే. గురువారం అసెంబ్లీ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆయన పేరును ప్రకటిస్తారు. ఆ వెంటనే స్పీకర్‌ సీట్లో కూర్చోబెట్టి ప్రొటెం స్పీకర్‌ పదవి నుంచి అక్బరుద్దీన్‌ తప్పుకుంటారు. స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా కాంగ్రెస్‌ పార్టీ చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాంగ్రెస్‌ అభ్యర్ధి గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు మద్దతిస్తున్నట్టు సంతకం చేసి లేఖ పంపారు.

ఒకే ఒక్క నామినేషన్‌...

తెలంగాణ మూడో అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నికకు డిసెంబర్‌ 4న అసెంబ్లీ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఎంపిక చేసిన వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. నిర్ణయించిన ముహూర్తం ప్రకారం గడ్డం ప్రసాద్‌ కుమార్‌ డిసెంబర్‌ 13 అంటే బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల తారక రామారావు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం ఎమ్మెల్యేలు, మంత్రులు వెంట రాగా ప్రసాద్‌ కుమార్‌ నామినేషన్‌ వేశారు. నామినేషన్ల గడువు ముగిసేంత వరకు ప్రసాద్‌ కుమార్‌ది ఒక్కటే నామినేషన్‌ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయినట్టే. ఇక ప్రకటించడమే తరువాయి. షెడ్యూల్‌ ప్రకారం ప్రసాద్‌ కుమార్‌ ఎన్నికను ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ.. గురువారం ప్రకటిస్తారు. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు ఉండి ఉంటే బ్యాలెట్‌ ద్వారా ఎన్నిక నిర్వహించాల్సి వచ్చేది.

విపక్షాలతో మాట్లాడే బాధ్యత శ్రీధర్‌ బాబుకి...

అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నికకు సహకరించాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను, ఇతర ప్రతిపక్ష పార్టీలను ఒప్పించే బాధ్యతను కాంగ్రెస్‌ పార్టీ.. రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్‌బాబుకు అప్పగించింది. దాంతో ఆయన చకచకా మరో మంత్రి దామోదర రాజనరసింహను వెంటబెట్టుకుని యశోద ఆసుపత్రిలో కోలుకుంటున్న కేసీఆర్‌ను కలిసి విషయం చెప్పారు. సుపరిపాలన అందించేందుకు అనుభవాన్ని అందించాలని కేసీఆర్‌ను కోరారు. అందుకు కేసీఆర్‌ కూడా అంగీకరించారు. వెంటనే లేఖ పంపుతానని చెప్పారు. ‘స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా సహకరించాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశాం. అందర్నీ కలుపుకొని తాము ముందుకుసాగుతామని హామీ ఇచ్చాం. శాసన సభ స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారని చెప్పాం. నామినేషన్‌ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు పలువురు నేతలు హాజరు అవుతారని భావిస్తున్నాం‘ అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు చెప్పారు. అందుకు తగ్గట్టుగానే నామినేషన్‌ కార్యక్రమానికి కేటీఆర్‌ హాజరయ్యారు. గడ్డం ప్రసాద్‌ కుమార్‌కి మద్దతుగా నామినేషన్‌ పత్రంపై సంతకం చేశారు.

ఇక లాంఛనంగా ప్రకటించడమే...

విపక్షాలన్నీ అధికార పార్టీ అభ్యర్ధికే మద్దతు పలకడంతో గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎన్నిక ఏకగ్రీవం అయినట్టే. తెలంగాణ మూడో అసెంబ్లీ నూతన స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ ఎన్నిక లాంఛనమే. ఆ తర్వాత ఆయన పదవీ బాధ్యతలు చేపడతారు. శాసనసభను నడుపుతారు. అయితే ఇప్పుడు ఆయన ఎవరనే చర్చ సర్వత్రా జరుగుతోంది.

తెలంగాణలో తొలి దళిత స్పీకర్‌..

తెలంగాణ అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికవుతున్న తొలి దళితుడు గడ్డం ప్రసాద్‌ కుమార్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దళిత మహిళ ప్రతిభా భారతి అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ఇప్పుడే ఓ దళితుడు తెలంగాణ అసెంబ్లీ శాసనసభాపతి పీఠాన్ని అలంకరిస్తున్నారు. గడ్డం ప్రసాద్‌ కుమార్‌ మంచి చదువరి. సౌమ్యుడన్న పేరుంది. ఇద్దరు ముఖ్యమంత్రుల కేబినేట్‌లో పని చేసిన అనుభవం ఉంది. అణగారిన వర్గాల పట్ల వల్లమాలిన అభిమానం ఉంది. అందునా ఆ వర్గం నుంచే రావడం వల్ల కష్టసుఖాలు తెలిసిన వాడు, అందరి వాడవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు.

మర్పల్లి టు అసెంబ్లీ...

దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్‌ కుమార్‌ రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో జన్మించారు. ఇంటర్‌ వరకూ చదివారు. 2008 ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా వికారాబాద్‌ నియోజకవర్గం నుంచి గెలిచారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడి కేబినెట్‌లో మంత్రి. 2012లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి, మలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వరుస ఓటములను చవిచూశారు. 2022లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంచి అనుభవం ఉండడంతో కాంగ్రెస్‌ ఆయనకు స్పీకర్‌ బాధ్యతలు అప్పగించింది. ఓ దళితుడిని స్పీకర్‌ను చేసి భేష్‌ అనిపించుకుంది.

Tags:    

Similar News