కాంగ్రెస్‌ జైత్రయాత్ర ఎలా సాధ్యమైందంటే..

కాంగ్రెస్‌ పార్టీ సక్సెస్‌ కన్నా కేసీఆర్‌పైన, ఆయన కుటుంబ పాలనపైన్నే జనం ఎక్కువ కోపంతో ఉన్నట్టు ఈ ఎన్నికల్లో తేలింది.

Byline :  Amaraiah Akula
Update: 2023-12-03 13:14 GMT
telangana congress party president revanth Reddy

(ది ఫెడరల్‌ ప్రతినిధి, హైదరాబాద్‌)

బీఆర్‌ఎస్‌ కోటలు బద్దలయ్యాయి. భారతీయ రాష్ట్రీయ సమితీ (బీఆర్‌ఎస్‌) పదేళ్ల పాలనకు తెర పడింది. ఐదారు నెలల కిందట కలిక్కానికి కూడా కనిపించని కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటింది. తెలంగాణ తెచ్చిన పార్టీకి.. ఇచ్చిన పార్టీకి మధ్య జరిగిన పోరులో ఎట్టకేలకు జనం సోనియాగాంధీ పార్టీకి జై కోట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు పెద్దగా అంచనాల్లేని కాంగ్రెస్‌.. ఎలా పుంజుకోగలిగింది? తిరుగులేదనుకున్న కారు ఎక్కడ బోల్తాపడింది.. బీఆర్‌ఎస్‌ వైఫల్యాలే కాంగ్రెస్‌ విజయ రహస్యాలా... హస్తం వ్యూహాన్ని గులాబీ దళం గుర్తించలేకపోయిందా? కాంగ్రెస్‌ జైత్రయాత్రకు దోహదపడిన అంశాలేంటి?
నిరంకుశ తీరే కారణమా?
కాంగ్రెస్‌ పార్టీ సక్సెస్‌ కన్నా కేసీఆర్‌పైన, ఆయన కుటుంబ పాలనపైన్నే జనం ఎక్కువ కోపంతో ఉన్నట్టు ఈ ఎన్నికల్లో తేలింది. ప్రజాస్వామ్య వాదిగా ఉండే కేసీఆర్‌ ఎందుకింత నిరంకుశంగా, ప్రజలకు దూరంగా ఉన్నారన్నది ఎవ్వరికీ అంతుబట్టని విషయం. ప్రముఖ ఉద్యమ నాయకుడు, జన సమితీ నాయకుడు ప్రొఫెసర్ కోదండ రామ్‌ చెప్పినట్టు నిరంకుశ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారు. ‘ప్రజలు బుద్ధి చెప్పాలనుకున్నారు, చెప్పారు. గద్దె దించాలనుకున్నారు, చెప్పారు. ఆత్మగౌరవానికీ ఆత్మాభిమానానికి మధ్య జరిగిన పోరులో బీఆర్‌ఎస్‌ మట్టికరించింది. బీఆర్‌ఎస్‌ నేత కేసీఆర్‌ ప్రజలకు దూరమై చాలా కాలమైంది‘ అంటున్నారు కోదండరామ్‌. కేసీఆర్‌ రెండో సారి అధికారంలో వచ్చాక ఆయన చాలా నిరంకుశంగానే వ్యవహరించారు. రాచరికపు పోకడ పోయారు. ప్రజల కోసం పని చేయాల్సిన పరిపాలనను నిర్వీర్యం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటన్నింటినీ కాంగ్రెస్‌ చాలా జాగ్రత్తగా వినియోగించుకుంది. గెలుపు బాట పట్టింది.
మార్పు కావాలి... కాంగ్రెస్‌ రావాలి...
కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమికి కాంగ్రెస్‌ విజయఢంకా మోగించడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా కాంగ్రెస్‌ ఎత్తుకున్న మార్పు నినాదం అద్భుతంగా పనిచేసింది. కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఎన్నికల ప్రచార ప్రకటనలు అన్నింటిలోనూ ’’మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి’’ అనే నినాదమే ప్రతిధ్వనించింది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనతో ప్రజలకు మోజు తీరిన వాతావరణం కనిపించి.. మార్పు కోసం జనం మొగ్గు చూపినట్లు ఉంది. కనీసం 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలతో జనం విసిగిపోయి ఉన్నారని.. వీరిని మార్చడం మంచిదని పలు రకాలుగా ఫీడ్‌ బ్యాక్‌ వచ్చినప్పటికీ బీఆర్‌ఎస్‌ అధినేత వేరే లెక్కలు వేసి వారికే మళ్లీ టికెట్లు కట్టబెట్టడం పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది.
అసంతృప్తి నేతల్ని దగ్గరకు తీసిన కాంగ్రెస్‌
ఇక బీఆర్‌ఎస్‌లో టికెట్లు రాక లేదా తగినంతగా గుర్తింపు రాక అసంతృప్తితో ఉన్న దాదాపు 20 మంది నేతలను కాంగ్రెస్‌ అక్కున చేర్చుకుని వారిలో కొందరికి టికెట్లు కేటాయించడం కలిసి వచ్చింది. బీజేపీ నుంచి చివరి క్షణంలో వచ్చిన కొందరు నేతలు కూడా కాంగ్రెస్‌కు ఊపు తెచ్చారు. బండి సంజయ్‌ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రజల్లో పలచన చేయడంలో సఫలీకృతమైన బీజేపీ ఆ తర్వాతి పరిణామాల్లో బండి సంజయ్‌ను మార్చడం కల్వకుంట్ల కవిత అరెస్టు విషయంలో కేసీఆర్‌తో రాజీపడ్డారనే ప్రచారం పుంజుకోవడంతో బీజేపీ కాడి కిందన పడేసినట్లైంది. అదే కాడిని కాంగ్రెస్‌ పార్టీ భుజాన ఎత్తుకొని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మరింత స్థాయిలో యుద్ధం ప్రకటించింది.
రేవంత్‌కి పదవి ఇవ్వడం మంచి పని..
ఇక ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేయడమనేది కాంగ్రెస్‌ చేసిన అత్యుత్తమ నిర్ణయమైంది. కేసీఆర్‌ను ఢీకొట్టడానికి సరైన సత్తా ఉన్న నేత రేవంత్‌రెడ్డి అనే అభిప్రాయం జనంలో ప్రబలడంతో కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. ఒక దశలో బండి సంజయ్‌కూ ఇలాంటి గుర్తింపు ఉన్నా.. ఆయన్ని తప్పించడం ద్వారా బీజేపీ చేతులారా కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చింది. ఇక రైతు రుణ మాఫీ, డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల విషయంలో బీఆర్‌ఎస్‌ చేసిన వాగ్దానాలు నెరవేరకపోవడంతో వీటిపై ఆశలు పెట్టుకున్న జనం కత్తిగట్టారు.
కొంపముంచిన దళిత బంధు..
కేసీఆర్‌ తెచ్చిన కొన్ని పథకాలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని మింగేశాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ’దళిత బంధు’ పథకం. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో ఈట రాజేందర్‌ను దెబ్బతీయడం కోసం పుట్టుకొచ్చిన దళితబంధు పథకం నామమాత్రంగానే అమలుకావడంతో పాటు ఉన్న కొద్దిమంది లబ్ధిదారుల విషయంలోనూ భారీగా అవినీతి చోటుచేసుకుందనే వార్తలు గుప్పుమన్నాయి. ఎన్నిచెప్పినా వీటిని ఎదుర్కోలేని పరిస్థితిని బీఆర్‌ఎస్‌ కొనితెచ్చుకుంది. పైగా ఇతర సామాజిక వర్గ ఓటర్లలో ఇది అసంతృప్తి రగిలించింది. యువత నిరుద్యోగులు బీఆర్‌ఎస్‌ను ఓడించడంలో కీలకపాత్ర పోషించారు.
ఉద్యోగాల భర్తీలో జాప్యం..
ఏళ్ల తరబడి నిరీక్షణ తర్వాత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కావడం, కొంత ఉపశమనం కలిగించినా పరీక్షల నిర్వహణలో కనిపించిన అలసత్వం బీఆర్‌ఎస్‌ కొంప ముంచింది. ఇంత పెద్దస్థాయిలో ఉద్యోగాల భర్తీకి పూనుకున్నప్పుడు ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన టీఎస్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ముందుగా పట్టిష్ట పర్చాలన్న మినిమమ్‌ లాజిక్‌ను కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మిస్సైంది. దీనిపై రాజకీయ నాయకుల విమర్శలకు బీఆర్‌ఎస్‌ నేతలు సమాధానం చెప్పారేమో కాని జనానికి మాత్రం సమాధానం చెప్పలేకపోయారు.
మజ్లీస్‌తో పొత్తు కూడా ముంచిందీ?
మజ్లిస్‌పై ఎక్కువగా ఆధారపడటం బీఆర్‌ఎస్‌ చేసిన మరో తప్పు. మజ్లిస్‌ తమతో ఉంటే ముస్లిం ఓటర్లు అందరూ తమతో ఉన్నట్లేనని బీఆర్‌ఎస్‌ నేతలు అతి నమ్మకం పెట్టుకున్నారు. హైదరాబాద్‌ నగరంలో మాత్రమే ముస్లిం ఓటర్లు మజ్లిస్‌ వెంట ఉన్నారు. జిల్లాలకు వచ్చేసరికి వారికి కాంగ్రెస్‌ పార్టీనే బెటర్‌ అనిపించింది. అందుకే ముస్లిం ఓటర్లలో గణనీయ చీలిక వచ్చి వారిలో గణనీయ సంఖ్యలో కాంగ్రెస్‌పై మొగ్గుచూపారు. చాలా నియోజకవర్గాల్లో ఇది కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. బీఆర్‌ఎస్‌ కొంపముంచింది.
ఇక అన్నింటికంటే ముఖ్యమైన అంశం కేసీఆర్‌! బీఆర్‌ఎస్‌కి కేసీఆర్‌నే మూలాధారం. ఒక ఉద్యమ నేతగా, ప్రత్యేక తెలంగాణను తెచ్చిన నాయకుడిగా పాత తరాలకు మాత్రమే కేసీఆర్‌ సుపరిచితం. మొదటి దఫా లేదా రెండో దఫా ఓటు హక్కుపొందిన 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కుల్లో చాలా మందికి కేసీఆర్‌ ఒక ముఖ్యమంత్రిగానే పరిచయం. ఆయన గతం ఈ కొత్తతరం వారికి పెద్దగా తెలియదు. కొంత మేర తెలిసినా కేసీఆర్‌ను కొత్తతరానికి కనెక్ట్‌ చేయగలిగే ఎమోషనల్‌ బాండింగ్‌ మాత్రం లేదు. ఏదో సినిమాలో త్రివిక్రమ్‌ చెప్పినట్లు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించేవరకు కేసీఆర్‌ అందరి దృష్టిలో హీరో! ఆ తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన విజన్‌ ఉన్న ముఖ్యమంత్రి మాత్రమే.. 2018 ఎన్నికల్లో ఆయన అధికార పార్టీ నేత మాత్రమే. తాజాగా జరిగిన మూడో ఎన్నికల్లో అయితే ఆయన జనం మోజు తీరిపోయిన నాయకుడిగానే కన్పించారు.
కేసీఆర్‌ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో అహంకారం పెరిగిందన్నది ఉద్యమకారుల వాదనను తిప్పికొట్టడంలో బీఆర్‌ఎస్‌ నాయకత్వం సక్సెస్‌ కాలేకపోయింది. అధికారం చేజిక్కించుకోవడం అంటే ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సివస్తుంది. అదే రెండోసారి ఆ తర్వాత మరోసారి నిలబెట్టుకోవాలంటే ఆ కష్టం మూడు రెట్లు అవసరం అవుతుంది. బీఆర్‌ఎస్‌లో అదే మిస్‌ అయింది. వీటిన్నింటికి తోడు అంతా తమకు తెలుసునని తాము చెప్పిందే జనం నమ్ముతారనే ఆత్మ విశ్వాసం... అతి విశ్వాసంగా మారి... చివరికి బీఆర్‌ఎస్‌ పట్ల అవిశ్వాసంగా పరిణమించింది
పేరు మార్చి తప్పు చేశారా కేసీఆర్‌
ఎంత పెద్ద నాయకుడికైనా, పార్టీకైనా.. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు, ప్రజా వ్యతిరేకత రావడం సహజం. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇందుకు అతీతం కాదు. అయితే కేసీఆర్ కాస్త ముందు జాగ్రత్త పడి.. కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఉంటే, పరిస్థితి మరో విధంగా ఉండేదేమో అని విశ్లేషకులు భావిస్తున్నారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడం, సిట్టింగుల్లో 20 నుంచి 25 మంది అభ్యర్థులను మార్చడం, బీఆర్‌ఎస్ పేరుకు బదులుగా టీఆర్‌ఎస్‌గానే కొనసాగి ఉండడం వంటివి..గులాబీ జెండా రెపరెపలాడడానికి కారణమయ్యేవి. కొన్ని విషయాల్లో కేసీఆర్ జాగ్రత్తపడకపోవడంతో ఫలితం మరోలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రజలే అందరికంటే గొప్పవారు. వాళ్ల తీర్పే శిరోధార్యం.
Tags:    

Similar News