మల్లురవి కష్టం పగవాడికి కూడా రాకూడదు
ఆధిపత్య పోరాటాలు పెరిగిపోతుండటంతో వాటిపై నివేదికలు తెప్పించుకోవటం, నోటీసులు ఇచ్చి వివరణలు తీసుకోవటం, సర్దుబాట్లు చేయటంతోనే రవికి తెల్లారిపోతోంది;
నాగర్ కర్నూలు ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటి ఛైర్మన్ డాక్టర్ మల్లురవికి చేతినిండా పనిదొరుకుతున్నది. ఎంపీగా నియోజకవర్గంలో తిరగటం, సమస్యల పరిష్కారం సంగతి తర్వాత పార్టీలోని ఎంఎల్ఏలు, నేతల మధ్య పంచాయితీలు తీర్చటానికే రవికి సమయం సరిపోవటంలేదు. చాలా జిల్లాల్లో ఎంఎల్ఏల మధ్య పంచాయితీలు, సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరాటాలు పెరిగిపోతుండటంతో వాటిపై నివేదికలు తెప్పించుకోవటం, నోటీసులు ఇచ్చి వివరణలు తీసుకోవటం, సర్దుబాట్లు చేయటంతోనే రవికి తెల్లారిపోతోంది. ఇపుడు విషయం ఏమిటంటే వరంగల్ జిల్లాలో మంత్రి కొండా(Konda Surekha) దంపతులు-ఎంఎల్ఏల మధ్య పంచాయితీ తీరకుండానే జడ్చర్ల ఎంఎల్ఏ అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy) వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారాయి. దాంతో రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవటంలో రవి బిజీ అయిపోయారు. పంచాయితీలు తీర్చటంలో ఛైర్మన్ కష్టాలు చూసిన తర్వాత కొందరు సీనియర్లు రవి కష్టాలు పగవాడికి కూడా రాకూడదని సెటైర్లు వేస్తున్నారు.
ఇంతకీ రెడ్డి ఏమన్నారంటే ‘తెలంగాణ కాంగ్రెస్ లోచంద్రబాబునాయుడు(Chandrababu Naidu) కోవర్టులున్నారని అన్నారు...ఆ కోవర్టులే తెలంగాణ(Telangana)లో కాంట్రాక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు చేస్తున్నారు...ముందు ఏపీకి చెందిన కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్ధల యాజమాన్యలను కట్ చేస్తే..బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం దానంతట అదే ఆగిపోతుంది’ అని అన్నారు. తెలంగాణలో చంద్రబాబు కోవర్టులున్నారు అన్న ఆరోపణలు ముందుగా ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth)కే తగులుతుంది. ఎందుకంటే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుతో రేవంత్ కుమ్మక్కు అయినట్లు బీఆర్ఎస్ కీలకనేతలు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) పదేపదే ఆరోపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబుతో రేవంత్ కుమ్మక్కయ్యారా లేదా అన్నది పక్కనపెట్టేద్దాం. ఎందుకంటే బీఆర్ఎస్ ఆరోపణలకు ఆధారాలుండవు.
అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో రేవంత్ కూడా ఒకడన్న విషయం ప్రపంచానికి అంతా తెలుసు. ఈ విషయాన్ని అటు చంద్రబాబు ఇటు రేవంత్ కూడా కాదనలేని సత్యం. అందుకనే చంద్రబాబు గురించి మాట్లాడాల్సి వచ్చినపుడు రేవంత్ చాలా జగ్రత్తగా మాట్లాడుతాడు. ఇపుడు విషయం ఏమిటంటే చంద్రబాబు కోవర్టులు అన్న ఆరోపణలు చేసినందుకు ఎంఎల్ఏ అనిరుధ్ కు నోటీసులు జారీచేసి వివరణ తీసుకోమని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమర్ గౌడ్(Bomma) ఆదేశాలతో ఎంఎల్ఏకి మల్లురవి నోటీసులు జారీచేయబోతున్నారు. సోమవారం నోటీసులు జారీచేసి వివరణ అడగబోతున్నారు. అలాగే వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, కొండా మురళి(Konda Murali)కి ప్రత్యర్ధివర్గంలోని ముగ్గురు ఎంఎల్ఏలు నాయిని రాజేంధ్రరెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎంఎల్సీ బస్వరాజ్ సారయ్య తదితరులతో ఏమాత్రం పడటంలేదన్న విషయం అందరికీ తెలిసిందే.
వరంగల్ జిల్లాలో మంత్రి-ఎంఎల్ఏల మధ్య పంచాయితీలు తీర్చటానికే రవికి 24 గంటలు సరిపోవటంలేదు. ప్రతిరోజు వీళ్ళ పంచాయితీలతోనే సమయం అంతా గడిచిపోతోంది. సోమవారం మంత్రి-ఎంఎల్ఏల గ్రూపు గాంధీభవన్ లో రవిని కలవబోతున్నారు. దీనికిఅదనంగా అనిరుధ్ పంచాయితీ బోనస్. వీళ్ళసంగతి ఇలాగుంటే పటాన్ చెరు నియోజకవర్గం నేతల పంచాయితీ వేరే ఉంది. అక్కడ సీనియర్-జూనియర్ నేతల మధ్య గొడవలు బాగా జరుగుతున్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఫిరాయింపు ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్-కాంగ్రెస్ నేతల గొడవలు తారాస్ధాయిలో జరుగుతున్నాయి. దీనికి అదనంగా జగిత్యాల నియోజకవర్గంలో ఫిరాయింపు ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ కుమార్ కు మాజీ ఎంఎల్సీ టి జీవన్ రెడ్డికి ఏమాత్రం పడటంలేదు. వీళ్ళపంచాయితీ రావణకాష్టంలాగ మండుతునే ఉన్నది. వీళ్ళమధ్య ఎన్నిమార్లు పంచాయితీలు తీర్చినా కొత్తవి పుట్టుకొస్తునే ఉన్నాయి.
ఇలాంటి ఘటనలు, పంచాయితీలను చూసిన తర్వాత క్రమశిక్షణా కమిటి ఛైర్మన్ గా మల్లురవికి అసలు నిద్రపోవటానికి కూడా టైం దొరుకుతున్నట్లు లేదు. ఇప్పటికి ఉన్న పంచాయితీలతోనే రవి తల బొప్పికడుతుంటే కొత్తవి కూడా పుట్టుకొస్తే ఇక అంతే సంగతులు.