కేసీఆర్ ఫొటో పెట్టడం సరికాదు: కవిత
తనను పార్టీలో నుంచి తొలగించడంపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేయడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆమె బుధవారం మధ్యాహ్నం ‘జాగృతి జనం బాట’ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌పై ఎక్కడా కూడా కేసీఆర్ ఫొటో లేదు. కేసీఆర్ తన దేవుడు అని చెప్పే కవిత.. ఈ యాత్ర విషయంలో కేసీఆర్‌ను ఎలా మరిచారు అన్న చర్చ మొదలైంది. కాగా దీనిపై కవిత క్లారిటీ కూడా ఇచ్చారు. పోస్టర్‌లను విడుదల చేస్తూ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కాంగ్రెస ప్రభుత్వం విమర్శనాస్త్రాలను సంధించారు. ప్రజా సమస్యలపై పోరాడటం కోసమే జాగృతి జనం బాట పడుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే తన భవిష్యత్ ప్రణాళికలను తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. కాంగ్రెస్ చేతకాని ప్రభుత్వం, పాలన వల్ల రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణం నెలకొందని చెప్పారు.
పార్టీ నుంచి అందుకే తొలగించారు..
‘‘జాగృతిని కేసీఆర్ ఆలోచనలు లేకుండానే ప్రారంభించాం. నేను బీఆర్ఎస్‌లో చేరినప్పుడు మాత్రమే కేసీఆర్ ఫొటోను ఉంచాను. భౌగోళిక తెలంగాణను సాధించాం కానీ సామాజిక తెలంగాణ ఇంకా సాధించలేదు అని నేను చెప్పా. అందుకే ఆ మాటల కారణంగానే పార్టీ నుంచి నన్ను వెళ్లగొట్టారు’’ అని కవిత పేర్కొన్నారు. అనంతరం యాత్ర గురించి మాట్లాడుతూ.. జాగృతి జనం కోసం పుట్టిందని, ఇప్పుడు జనం దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకుందని అన్నారు. అందులో భాగంగానే యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ‘జాగృతి జనం బాట’ యాత్ర నాలుగు నెలల పాటు జరుగుతుందని వెల్లడించారు. ఈ నాలుగు నెలల్లో అన్ని జిల్లాలను తాకుతూ యాత్ర కొనసాగుతుందని తెలిపారు.
నాన్న ఫొటో పెట్టడం కరెక్ట్ కాదు..
‘‘కేసీఆర్ ఒక పార్టీకి అధ్యక్షుడు. నన్ను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నేను ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇప్పుడు నేను ప్రారంభించే యాత్ర పోస్టర్‌పై ఆయన ఫొటో పెట్టడం నైతికంగా సరైంది కాదు. అందుకే నా తండ్రి ఫొటోను పెట్టలేదు. ఆయన కడుపున పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. కానీ ఈ యాత్రలో ఆయన ఫొటో ఉండటం నా నైతికతకు విరుద్ధం. అందుకే ఆయన ఫొటోను పెట్టలేదు. ఒక ప్రొఫెసర్ జైశంకర్ అంటే ఆయన సామాజిక తెలంగాణ కోసం ఎంతో చేశారు. అందుకే ఆయన ఫొటోను పెట్టాం’’ అని చెప్పారు.
కాంగ్రెస్‌పై అంతా కోపమే..
‘‘కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక్క సామాజిక వర్గం వారు కూడా సానుకూలంగా లేరు. ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం మోసం చేసింది. ప్రజలే నా గురువులు. వరి దగ్గరకు వెళ్లాలని నిశ్చయించుకున్నా. వారి కోసం పారడతాం. ఈ ప్రభుత్వం ప్రజల సమస్యలను పక్కనబెట్టి ప్రతిపక్షాలను వేధించడంలో నిమగ్నమైపోయింది’’ అని వ్యాఖ్యానించారు.