జూబ్లీహిల్స్ గెలుపు ఎవరిచేతిలో ఉంది ?
ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ప్రస్తుతం తెలంగాణలో బీసీ(BC Reservations) వాదన చాలా బలంగా వినబడుతోంది
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక రసవత్తరంగా మారబోతోంది. ఎందుకంటే బీజేపీ కూడా తన అభ్యర్ధిగా లంకల దీపక్ రెడ్డిని ప్రకటించింది. కాంగ్రెస్(Telangana Congress) తరపున వల్లాల నవీన్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్(BRS) అభ్యర్ధిగా మాగంటి సునీత పోటీచేస్తున్న విషయం తెలిసిందే. వల్లాల, మాగంటి(Maganti) కొద్దిరోజులుగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. బీజేపీ(BJP) అభ్యర్ధి ప్రకటనతో మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధుల విషయంలో స్పష్టత వచ్చేసింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ప్రస్తుతం తెలంగాణలో బీసీ(BC Reservations) వాదన చాలా బలంగా వినబడుతోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ మాత్రమే బీసీ అభ్యర్ధిని పోటీలోకి దింపింది. మిగిలిన ఇద్దరు అభ్యర్ధులు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే. పైగా కొన్ని బీసీ సంఘాల్లో రెడ్డి సామాజికవర్గంపై తీవ్రవ్యతిరేకత కనబడుతోంది. రెడ్లకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న పోస్టులే ఇందుకు ఉదాహరణ. రెడ్లపై ఒక్కసారిగా బీసీల్లో వ్యతిరేకత పెరిగిపోవటానికి కారణం ఏమిటి ?
ఏమిటంటే బీసీలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్ధానికసంస్ధల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కేటాయిస్తు జీవో జారీచేసిన విషయం తెలిసిందే. అయితే ఆ జీవోను సవాలు చేస్తు రెడ్డిజాగృతి అనే సంస్ధ అధ్యక్షుడు బుట్టెంగారి మాధవరెడ్డి హైకోర్టులో కేసు వేశాడు. కేసు ఫలితంగా జీవో అమలును నిలిపేస్తు హైకోర్టు స్టే ఇచ్చింది. ఎప్పుడైతే హైకోర్టు రిజర్వేషన్ల అమలుపై స్టే విధించిందో అప్పటినుండి బీసీ సంఘాలు బాగా మండిపోతున్నాయి. జీవో అమలును సవాలు చేయటంతో ఆగని బుట్టెంగారి సోషల్ మీడియాలో బీసీలను కించపరుస్తు పోస్టులు పెడుతున్నాడు. అలాగే బీసీలకు వ్యతిరేకంగా ప్రకటనలు కూడా చేస్తున్నాడు. బుట్టెంగారి పోస్టులన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దాంతో బీసీ సంఘాలు బుట్టెంగారి మీదనే కాకుండా రెడ్డి సామాజికవర్గం మీద తీవ్రస్ధాయిలో మండుతున్నాయి.
ఇలాంటి సమయంలో జరుగుతున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధిగా లంకల దీపక్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాగంటి సునీత పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ తరపున మాత్రమే బీసీ అభ్యర్ధి నవీన్ పోటీలో ఉన్నారు. కాబట్టి నియోజకవర్గంలోని బీసీల ఓట్లు ఎవరికి పడతాయి ? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కారణం ఏమిటంటే బీసీ అభ్యర్ధి కాబట్టి నవీన్ కు బీసీలు ఓట్లేస్తారా ? లేకపోతే రేవంత్ ను వ్యతిరేకిస్తు అభ్యర్ధిని కూడా బీసీలు వ్యతిరేకిస్తారా అన్నది అర్ధంకావటంలేదు. అలాగే బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధులు ఇద్దరు అగ్రవర్ణాలకు చెందిన వారే. వీరిలో మాగంటి సునీత దివంగత ఎంఎల్ఏ, భర్త మాగంటిగోపీనాధ్ మరణం తాలూకు సింపథి ఓట్లపైనే ఎక్కువగా ఆధారపడినట్లు అర్ధమవుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని రేవంత్ ప్రభుత్వం ఏమీ డెవలప్ చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు తదితరులు చేస్తున్న ఆరోపణలు విచిత్రంగా ఉన్నాయి.
విచిత్రం ఎందుకంటే రేవంత్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదంటే అంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏమీ డెవలప్ చేయలేదనే కదా అర్ధం ? తొమ్మిదిన్నరేళ్ళు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్సే. పైగా గోపీ హ్యాట్రిక్ ఎంఎల్ఏ కూడా. అంటే గోపి మూడుసార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎంఎల్ఏగా ఉన్నా ఎలాంటి డెవలప్ చేయలేదనే కదా అర్ధం ? మూడోసారి ఎంఎల్ఏ అయిన కొద్దినెలలకే చనిపోయినా అంతకుముందు తొమ్మిదిన్నరేళ్ళు గోపీనే కదా ఎంఎల్ఏగా పనిచేసింది. ఏకోణంలో చూసినా రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్ చేస్తున్న ఆరోపణలు తిరిగి వాళ్ళకే రివర్సు కొడతాయనటంలో సందేహంలేదు. తాము కూడా నియోజకవర్గాన్ని డెవలప్ చేయలేదు కాబట్టే బీఆర్ఎస్ నేతలు సింపథీ ఓట్లపైనే ఎక్కువగా ఆధారపడినట్లు అర్ధమవుతోంది.
చివరగా లంకల దీపక్ విషయం చూస్తే పోయిన ఎన్నికల్లో కూడా బీజేపీ తరపున పోటీచేసి ఓడిపోయాడు. 2023 ఎన్నికల్లో దీపక్ కు సుమారు 18 వేల ఓట్లొచ్చాయి. పోయిన ఎన్నికల్లో ఓడిపోయాడు కాబట్టి ఆ సింపథితో జనాలు ఉపఎన్నికలో ఓట్లువేసి గెలిపిస్తారనే అంచనాతో బీజేపీ మళ్ళీ దీపక్ కే టికెట్ ఇచ్చినట్లుంది. అంతేకాకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దీపక్ కు గట్టి ప్రత్యామ్నాయం కూడా దొరకలేదేమో.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నియోజకవర్గంలో సుమారు 3.99 లక్షల ఓట్లున్నాయి. ఇందులో బీసీల ఓట్లు సుమారుగా 2 లక్షలున్నాయి. 2 లక్షల బీసీ ఓట్లలో యాదవుల ఓట్లు ఎన్ని అన్నవిషయంలో క్లారిటిలేదు. తర్వాత ముస్లిం మైనారిటి ఓట్లు సుమారు 98 వేలదాకా ఉన్నాయి. సామాజికవర్గాల ఓట్లను బట్టిచూస్తే బీసీ, ముస్లింల ఓట్లే గెలుపును నిర్ణయిస్తుంది. వీటి తర్వాత రెడ్డి, కమ్మ, ఎస్టీ, ఇతర సామాజికవర్గాల ఓట్లున్నాయి. ఒకవేళ సామాజికవర్గాల పరంగా ఓట్లలో చీలికవస్తే బీసీ ఓట్లు నవీన్ కు, రెడ్డి ఓట్లు లంకలకు, కమ్మ ఓట్లు మాగంటికి పోలవుతాయా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుత బీసీవాదన కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపుకు ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి.