‘60 మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కానున్నారు’

టికెట్ కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని, టికెట్టే మీ ఇంటికి వస్తుందని చెప్పారు.;

Update: 2025-07-04 14:58 GMT

తెలంగాణ అసెంబ్లీలో రానున్న కాలంలో 60 మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలుగా తమ గొంతు వినిపించనున్నారని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలో మహిళా రిజర్వేషన్ అమలు కానుందని, అప్పుడు అసెంబ్లీ స్థానాల సంఖ్య 150కు పెరుగుతుందని వివరించారు. వారిలో 60 మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి, శాసనసభలోకి అడుగు పెట్టనున్నారని పేర్కొన్నారు. మహిలా సాధికారతకు తమ ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. ప్రజల సంక్షేమంతో పాటు మహిళలకు ఆర్థికస్థిరత్వాన్ని అందించడం కోసం తమ ప్రభుత్వం పగలెనకా.. రాత్రెనకా శ్రమిస్తోందని అన్నారు. కానీ కొంతమంది మాత్రం.. తమ పాలనలో సంక్షేమం చతికిలబడిందంటూ బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ అంటేనే సంక్షేమం అన్న విషయం వారికి అర్థంకాక, తెలియకనే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని చురకలంటించారు.

‘‘తెలంగాణలో మాకు తిరుగులేదని అహంకారంతో విర్రవీగుతున్న కల్వకుంట్ల గడీలను బద్దలు కొట్టి మూడు రంగుల జెండా ఎగరేశాం. ఇక్కడే ప్రజా పాలనకు నాంది పలికాం. ఈ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చట అని, సంక్షేమపథకాలు అమలు చేయరని, కలిసి ఉండరని చాలా మంది ప్రచారం చేశారు. కానీ నవ్విన వాళ్ల ముందు తలెత్తుకుని నిలబడి.. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టాం. తెలంగాణ మోడల్ ను దేశం అనుసరించేలా తీర్చిదిద్దాం. కులగణనను పూర్తి చేసి బీసీల లెక్క తేల్చాం. దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్థ ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నాం. 18 నెలల్లో రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, పేదలకు సన్న బియ్యం, రైతు రుణమాఫీ చేసి రైతుల రుణ విముక్తులని చేశాం’’ అని చెప్పారు.

ఎవరోస్తారా రండి.. చర్చకు రెడీ..

‘‘వరి వేస్తే ఉరే అని ఆనాటి ప్రభుత్వం చెప్పింది… కానీ వరి వేయండి సన్న వడ్లకు బోనస్ ఇస్తామని మేం చెప్పాం. దేశంలోనే అత్యధిక వరి పండించి తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టాం. ఒంటె పెదవుల కోసం నక్క ఎదురు చూసినట్లు రైతు భరోసా వేయొద్దని గోతికాడి నక్కలా ఎదురు చూశారు.

కానీ 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అందించిన ఘనత ప్రజా ప్రభుత్వానిది. ఈ వేదికగా సవాల్ విసురుతున్నా… మోదీ వస్తాడో, కిషన్ రెడ్డి వస్తాడో, కెసీఆర్ వస్తాడో రండి… రైతులకు మేలు చేసింది ఎవరో అసెంబ్లీలో చర్చిద్దాం రండి. పేదలకు రూ. 5 భోజనం పెట్టే కార్యక్రమానికి ఇందిరమ్మ పేరు పెడితే. కొందరు సన్నాసులు విమర్శలు చేస్తున్నారు. పేదల సంక్షేమం అంటేనే ఇందిరమ్మ.. ఇందిరమ్మ అంటేనే పేదల సంక్షేమం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సులు అద్దెకు అందించి లాభాలు గడించేలా ప్రోత్సహిస్తాం’’ అని తెలిపారు.

లెక్క తేడా వస్తే క్షమాపణ చెప్తా..

‘‘మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాం. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టాం.. ఆత్మగౌరవంతో బ్రతికేలా చర్యలు తీసుకున్నాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా పాలనలో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఈ వేదికగా మహిళలకు పిలుపునిస్తున్నా… స్వయం సహాయక సంఘాలలో చేరండి… ఆర్థికంగా నిలబడండి. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. కిషన్ రెడ్డి, కెసీఆర్ కు సవాల్ విసురుతున్న.. లెక్క ఒక్కటి తగ్గినా నేను క్షమాపణ చెబుతా. 18 నెలల్లో రాష్ట్రానికి 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. వంద నియోజకవర్గాల్లో 20 వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాం’’ అని అన్నారు.

కార్యకర్తలే బ్రాండ్ అంబాసిడర్లు..

‘‘ప్రపంచంతో పోటీపడేలా మన విద్యా ప్రమాణాలు ఉండాలని ప్రణాళికలు వేసుకున్నాం. యువతకు నైపుణ్యాన్ని అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం. 2030 ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించేలా యువతను తీర్చిదిద్దుతాం. పార్టీ కార్యకర్తలే మా బ్రాండ్ అంబాసిడర్లు. సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి. ఈ యుద్ధంలో కల్వకుంట్ల కుటుంబం బద్దలు కావాలి. వచ్చేవి కార్యకర్తల ఎన్నికలు.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవాలి. కార్యకర్తలకు నూటికి నూరు శాతం న్యాయం చేసే బాధ్యత నాది. రాబోయే రోజుల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య 150 కి పెరగబోతోంది. మహిళా రిజర్వేషన్ రాబోతోంది.. 60 మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు’’ అని అన్నారు. అంతేకాకుండా ఎవరూ టికెట్ కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని, టికెట్టే మీ ఇంటికి వస్తుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో 100 అసెంబ్లీ స్థానాలు, 15 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ సొంతం అవుతాయని, రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News