రేవంత్ పాలన ఎలా ఉండబోతుంది!

ఇప్పుడున్న ఊపు, ఉత్సాహం ఆ తర్వాత ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, మంత్రులు సహకరిస్తారా? రేవంత్ అనుకున్న పాలనా ప్రణాళిక పట్టాలెక్కుతుందా?

Producer :  A.Amaraiah
Update: 2023-12-06 10:51 GMT
REVANT (file shot)

'అనుముల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ ముఖ్యమంత్రి’గా.. అనడానికి సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులు భాగ్యనగరానికి తరలివస్తున్నారు. హైదరాబాద్ లాల్ బహదూర్ శాస్త్రీ స్టేడియం మువ్వెల జెండాలతో ముస్తాబవుతోంది. గురువారం మధ్యాహ్నం 1 గంటి తర్వాత ఆయన భారతీయ భౌగోళిక చిత్రపటం యువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ వేదికపై నుంచే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేస్తారని భావిస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి ఎక్కడ ప్రమాణ స్వీకారం చేసినా ఏదో ఒక సంతకం గ్యారంటీ. ఇందులో స్పెషాలిటీ ఏమీ లేదు. అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత రేవంత్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడున్న ఊపు, ఉత్సాహం ఆ తర్వాత ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, మంత్రులు సహకరిస్తారా? రేవంత్ అనుకున్న పాలనా ప్రణాళిక పట్టాలెక్కుతుందా? ఆర్ధికంగా ఎలా నెట్టుకువస్తారనేదే ఇప్పుడందరి మనసుల్ని తొలుస్తున్న ప్రశ్న.

నేను మారిన మనిషిని!

” నేనుండేది జూబ్లీహిల్స్ అయినా నా నుంచి మధ్య తరగతి మనస్తత్వం పోలేదు. ప్రజల గొంతుకనవుతా. ప్రజల కష్టం నాకు తెలుసు. నేను మారిన మనిషిని. కచ్చితంగా సుపరిపాలన అందిస్తా”.. ఓ డిబేట్ లో రేవంత్ చెప్పిన మాట ఇది. ఈ స్టేట్మెంట్ కి ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటకి దగ్గరి పోలిక కనబడుతోంది. ”నేను కోపం అనే నరాన్ని తెంపేసుకున్నా. ఇప్పుడు నేనో మామూలు మనిషిని” అంటాడు వైఎస్ ఆవేళ. ఆ మాటకు తగ్గట్టే 2004-2009 మధ్య కాలంలో సంక్షేమానికి పెద్దపీట వేశారు. ప్రజల మనసుల్లో శాశ్వత ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ మాటల్ని బట్టి ఆయన కూడా అదే బాటలో పయనించనున్నట్టు అర్థమవుతుంది.

రేవంత్ పాలనా ప్రణాళిక ఇలా...

రేవంత్ రెడ్డి పరిపాలనపై తనదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. వచ్చే 5 ఏళ్లకు పాలనా ప్రణాళికను ఖరారు చేసుకున్నారు. అందులో అతి ముఖ్యమైంది పరిపాలనా వికేంద్రీకరణ. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అతి దగ్గరగా వెళ్లి అందరికీ అన్నీ అందేలా చూడడం. నిజంగా ఇది కత్తి మీద సామే. ‘తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ ఇస్తాం. ప్రగతి భవన్ ను ప్రజాభవనంగా, సచివాలయాన్ని జన సంక్షేమ భవనంగా మారుస్తా. ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం` అనే మాటను నిలబెట్టుకునే గట్స్ కావాలి. ప్రజా దర్బార్ మొదలు వారం వారం జనం ఇబ్బందుల్ని తెలుసుకోవడం (గ్రీవెన్స్ సెల్) వరకు చాలా ఇబ్బందులతో కూడుకున్నవే. ప్రజలకు జవాబుదారీగా ఉంటామనేది చెప్పినంత ఈజీ కాదు. మరొకటి అసెంబ్లీ స్థాయి సెక్రటేరియట్. జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై కమిషన్ ఏర్పాటు. కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే వాటిలోని లోపాలను సరిదిద్ది కొనసాగించడం. వాటికి అనుగుణంగా నిధులు రాబట్టడం.

ఏమిటీ అసెంబ్లీ స్థాయి సెక్రటేరియట్...

`వాలంటీర్ల వ్యవస్థను తీసుకువస్తా. అయితే అది ఏపీ మోడల్ కాదు. మాది పోలింగ్ బూత్ స్థాయి వ్యవస్థ. ఎన్నికల కమిషన్ ఏ తరహాలో పోలింగ్ బూత్ వ్యవస్థను తీసుకువచ్చి దానికో వాలంటీర్ ను నియమించి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నది’ రేవంత్ ఆలోచన. ఈ లెక్కన రాష్ట్రంలో 35 వేలకు పోలింగ్ బూత్ వ్యవస్థలు ఏర్పాటవుతాయి. ఆ బూత్ పరిథిలోని ప్రజల సమస్యలను ఆ వాలంటీర్లు పట్టించుకుంటారు. అక్కడ పరిష్కారం కాని సమస్యలను అసెంబ్లీ స్థాయి సెక్రరేటియట్ లో పరిష్కరించాలన్నది ప్రతిపాదన.

ఎలా పని చేస్తుందంటే..

అసెంబ్లీ లెవల్ సెక్రరేటియట్.. ఆ నియోజకవర్గ ప్రజల అవసరాలు తీరుస్తుంది. అసెంబ్లీ సెక్రటేరియట్ లో స్థానిక ఎంఎల్ఎకు, ఎంపీకి కార్యాలయం ఉంటుంది. గ్రీవెన్స్ డే నాడు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూర్చుంటారు. ఆన్ లైన్ లోనే సమస్యల్ని నమోదు చేసి అక్కడికక్కడే పరిష్కరిస్తారు. అక్కడ పరిష్కారం కానివి హైదరాబాద్ లోని సెక్రటేరియట్ కు వస్తాయి. ఇదంతా రెండు మూడు రోజుల వ్యవధిలో జరిగిపోవాలి. ప్రతి వారంలో ఒక రోజు గ్రీవెన్స్ సెల్ ఉంటుంది. ఎన్నికల విధానం ఎలా ఉంటుందో, పాలనా విధానం కూడా అలాగే ఉంటుంది. ప్రజలకు సంపూర్ణ జమ్మేదారీగా ఉంటుంది. అందుకే సిటిజన్ చార్టర్ తీసుకురావాలన్నది రేవంత్ ఆలోచనగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జానారెడ్డి చెప్పారు.

కాంగ్రెస్ అభివృద్ధి నమూనా...

ప్రతి ప్రభుత్వానికీ ఓ అభివృద్ధి నమూనా ఉంటుంది. 2004 నుంచి 2014 కాంగ్రెస్ అభివృద్ధి నమూనా ఉంది. 2014 నుంచి 2013 వరకు కేసీఆర్ నమూనా వచ్చింది. రేవంత్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే “కేసీఆర్ అభివృద్ధి నమూనా ప్రజలకు చేటు తెచ్చింది. కేసీఆర్ ప్రతి స్కీం వెనుక అపారమైన దోపిడీ ఉంది. కేసీఆర్ నమూనా డెవలప్మెంట్ పై నేను ఇప్పటికీ చర్చకు సిద్ధమే“ ఇప్పుడు దాన్ని సరిదిద్దుతానంటోంది కాంగ్రెస్. గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధికి పట్టం కడతామంటోంది. ఇదేదో కేసీఆర్ పై వ్యతిరేకతతో చేయడం లేదంటూ ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్ పాలనలోని మంచి పనులనూ అమలు చేస్తామంటున్నారు రేవంత్.

నిధులు ఎలా తెస్తారంటే...

తెలంగాణ సంపన్న రాష్ట్రమే. ప్రతి నెలా 12 వేల కోట్ల రూపాయల ఆదాయం ఉంటే అంతకుమించిన ఖర్చుంది. అదేమీ పెద్ద కష్టం కాదంటున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయోథ్యా రెడ్డి. కేంద్రం నుంచి జీఎస్టీ రూపంలో 42 శాతం పన్నులు వస్తాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి సంక్షేమాన్ని కొనసాగించేలా ప్రణాళిక ఖరారు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 42 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం. దీనికి అయ్యే రూ.11 వేల కోట్లను సమీకరించడం పెద్ద కష్టమేమీ కాదన్నది కాంగ్రెస్ నేతల వాదన. రాష్ట్రంలో సంక్షేమ పద్దు దాదాపు నెలకు రూ.28,920 కోట్లు ఉండొచ్చని అంచనా. ఇవి గాక ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పథకం, ఉచిత కరెంటు, ఉచిత బస్ ప్రయాణం వంటివి అనేకం ఉన్నాయి. వాటన్నింటికీ నిధులు కావాలంటే కచ్చితంగా కష్టపడక తప్పదన్నది విపక్షాల వాదన. సంక్షేమాన్నీ, అభివృద్ధిని సమతూకంతో నడపాలంటే కేంద్రం సహకారం కావాలి. అయితే రేవంత్ రెడ్డి మాత్రం తాను కచ్చితంగా కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తానంటున్నారు. అది చట్టబద్ధమైన హక్కు అంటున్నారు.

ప్రజా దర్భార్ నిర్వహిస్తా..

వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా దర్బార్ ఉండేది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే ప్రజలతో హైదరాబాద్ బేగంపేటలోని సీఎం క్యాంప్ కార్యాలయం కిటకిటలాడేది. కేసీఆర్ వచ్చాక అది లేకుండా పోయింది. ఇప్పుడు వైఎస్సార్ నాటి పద్ధతిని తిరిగి తెస్తామంటున్నారు రేవంత్ రెడ్డి. “వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నా. మా సమస్యల పరిష్కరించమని ఆయన ఇంటికి వెళ్లి అక్కడే ధర్నాలు చేసిన సంగతీ గుర్తుంది. అంతటి స్వేచ్ఛ ఉండేది. తిరిగి ఆ పరిస్థితిని కల్పిస్తా. ప్రజలతో మమేకం అవుతా” అంటున్నారు రేవంత్. అది ఆచరణలోకి వస్తేనే రేవంత్ కేసీఆర్ కంటే భిన్నమైన వ్యక్తి అవుతాడు. తెలంగాణ ఉద్యమం నాటి రేవంత్ రెడ్డి వేరు ఇప్పటి రేవంత్ రెడ్డి వేరు స్టేట్మెంట్ కి అర్థం చెప్పినవారవుతారు. ప్రజలకు ఇవ్వాల్సినంత స్పేస్ ఇవ్వకపోతే కేసీఆర్ ఎంతగా విమర్శల పాలయ్యారో రేవంత్ రెడ్డికి తెలిసినంతగా మరొకరికి తెలిసే చాన్సే లేదన్నది నగ్న సత్యం.

Tags:    

Similar News