లష్కర్ పోరులో పజ్జన్న ఎలా దిగారంటే...

లష్కర్ పార్లమెంట్ బరిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తిగుళ్ల పద్మారావు అలియాస్ పజ్జన్నను దింపుతున్నట్లు గులాబీ బాస్ కేసీఆర్ శనివారం ఫామ్ హౌస్ సమావేశంలో ప్రకటించారు.

Update: 2024-03-23 11:18 GMT
T Padmarao

లష్కర్ బరిలో పజ్జన్న ఎంపిక వెనుక భారీ కసరత్తే జరిగింది. తెలంగాణ ఉద్యమం ఆరంభం నుంచి టీఆర్ఎస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ మాస్ ఓటర్ల మనసు దోచుకున్న పద్మారావు అందరివాడిగా పేరొందారు. సికింద్రాబాద్ (లష్కర్) అసెంబ్లీ నియోజకవర్గంలో వంతెనలు, రోడ్లు, డ్రైనేజీ, ఫంక్షన్ హాళ్లు నిర్మించడంతో పాటు ప్రజల సంక్షేమానికి పనిచేసిన పద్మారావును నేతలందరి ఏకాభిప్రాయంతో ఎన్నికల బరిలో దించుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కీలక నియోజకవర్గమైన సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు నాయకులెవరూ ముందుకు రాలేదు.దీంతో అధినేత ఆదేశాలతో క్రమశిక్షణ గల నాయకుడిగా తాను పార్లమెంటుకు పోటీ చేస్తున్నట్లు పద్మారావు శనివారం సాయంత్రం ప్రకటించారు.





 

ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో లష్కర్ నేతలతో కేసీఆర్ లంచ్ మీటింగ్


సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసేందుకు గులాబీ బాస్ కేసీఆర్ శనివారం ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో నేతలతో లంచ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్ పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన టి పద్మారావును బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ శనివారం ప్రకటించారు. ఐదు స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న సికింద్రాబాద్ పార్లమెంటును ఈ సారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని కేసీఆర్ నేతలను కోరారు.



 తెరవెనుక ఏం జరిగిందంటే...

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావుకు పార్లమెంటుకు పోటీపై ఆసక్తి కనబర్చలేదని బీఆర్ఎస్ పార్టీకి చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ నాయకుడు చెప్పారు. దీంతో కేసీఆర్ దూతగా వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు సంప్రదింపులతో పద్మారావును ఎంపీ బరిలో నిలబడేలా ఒప్పించారని సమాచారం. గులాబీ బాస్ ఆదేశంతో అయిష్టంగానే పజ్జన్న ఎార్లమెంటు పోరుకు సమాయత్తమయ్యారు. ఎన్నికల వ్యయాన్ని అభ్యర్థే భరించాలని మొదట పార్టీ అధిష్ఠానవర్గం సూచించింది. దీంతో తాను ఎన్నికల ఖర్చు భరించే స్థితిలో లేనని పద్మారావు స్పష్టం చేశారని సమాచారం. ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి కోట్లరూపాయల నిధులు అందినా వాటిని పార్లమెంట్ ఎన్నికల్లో వెచ్చించేందుకు పార్టీ వెనుకాడుతున్నట్లు ఆ పార్టీకి చెందిన కీలక నాయకుడు ఒకరు చెప్పారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ బలగం
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే ఇందులో ఖైరతాబాద్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్లమెంట్ బరిలో నిలిచారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి పద్మారావు ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ముషీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ ఉన్నారు. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. లష్కర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేల బలం, పార్టీ బలగం ఉన్నా వారంతా ఓటమితో నిరాసక్తంగా ఉన్నారు. దీంతో పార్టీ క్యాడరును కార్మోన్ముఖులను చేసి ఎన్నికలకు సమాయత్తం చేయాల్సి ఉందని మరో నాయకుడు వ్యాఖ్యానించారు.

తెలంగాణ భవన్ వెలవెల
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్ వెలవెల బోతోంది. గతంలో అధికారంలో ఉన్నపుడు నేతలు, కార్యకర్తల సందడితో కళకళలాడిన తెలంగాణ భవన్ కు వచ్చే కార్యకర్తలే కరవయ్యారు. పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎవరికి వారు వారి అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో ఓటమి వల్ల ఏర్పడిన నిరాసక్తతతో పార్లమెంటు ఎన్నికల్లో ఎలా ముందుకు పోవాలనేది ప్రశ్నార్థకంగా మారింది. కీలక నియోజకవర్గమైన సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ ఏ మేర ప్రభావితం చూపిస్తుందనేది వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News