నేను రాను బిడ్డో ఈ సర్కారీ కొలువుకీ...

ఒకప్పుడు ఉద్యోగమంటే సర్కారీ కొలువే తప్ప ప్రైవేటు ఉద్యోగం కానే కాదు

Update: 2023-12-10 14:46 GMT
Out Soursing Employees

'గవర్నమెంటోడి సొమ్ము తినబుట్టలేదురా నువ్వు.. ఉద్దేగమంటే అదే కాని ఈ పనికి మాలిన పనేంట్రా అనేది' మన పల్లెల్లో చాలా మామూలుగా వినపడే మాట. ఒకప్పుడు ఉద్యోగమంటే సర్కారీ కొలువే తప్ప ప్రైవేటు ఉద్యోగం కానే కాదు. ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తే వాళ్లని ఊళ్లల్లో చాలా తెలివైన వ్యక్తిగా, ప్రభుత్వ సొమ్ము తినబుట్టిన వ్యక్తిగా పరిగణించే వారు. మరి నేడో. ప్రభుత్వ కొలువులు పక్కకు పోయాయి. ప్రైవేటు, సర్వీసు సెక్టార్‌ ఉద్యోగాలు పెరిగాయి. ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ వంటి పదాలు విరివిగా వినపడుతున్నాయి. ఒకప్పుడు వందల్లో ఉండే జీతాలు ఐదారంకెలకు చేరాయి. ఇప్పుడెందుకీ గొడవనేగా మీ ఉద్దేశం..

ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలంటే మోజు తగ్గింది. సర్కారు ఉద్యోగమంటే భయపడే రోజులు వచ్చాయి. ఒకప్పుడున్నఉద్యోగ భద్రత లేదు. సౌకర్యాలు లేవు. ముల్లొచ్చి అరిటాకు మీద పడ్డా అరిటాకు వెళ్లి ముల్లు మీద పడ్డా అరిటాకుకే నష్టమనే సామెతగా తయారైంది ప్రభుత్వ ఉద్యోగ పరిస్థితి. ఏ అధికారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందో, ఎప్పుడు సస్పెండ్‌ కావాల్సి వస్తుందో అన్నదే దిగులు. ఇక ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల పరిస్థితి అయితే మరీ దారుణం. కనీస వేతనం లేదు, భవిష్యత్‌లో వస్తుందన్న ఆశా లేదు. అదేమని ఎవరైనా నోరెత్తితే వాళ్ల అంతుచూస్తారు బ్యూరాక్రసిలోని పెద్దలు. గ్యారెంటీ లేని కొలువులు, గాలివాటం బతుకులన్నట్టుగా తయారైంది వీళ్ల పరిస్థితి.
ఇంతకీ ఆ ఉద్యోగులు ఎవరు?
రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు మూడు రకాల ఉద్యోగులున్నారు. ఒక వర్గం ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాయించిన వారు. రెండో వర్గం కాంట్రాక్ట్‌ ఉద్యోగులు. మూడో వర్గం ఔట్స్‌ సోర్సింగ్‌ వర్కర్లు లేదా ఉద్యోగులు. రెండు, మూడు వర్గాల వారిని ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న పెద్ద కాంట్రాక్టర్లు నియమించుకున్నారు. ఒక్కో ఉద్యోగానికి అంతో ఇంతో లంచం సైతం పుచ్చుకున్నారన్న అపవాదూ లేకపోలేదు. రాష్ట్రం చీలిపోయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే నాటికి ఎవరైతేనేం 1.70 లక్షల మంది ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వీళ్లకు ఒక ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. దళారుల చేతుల్లో నలిగిపోతున్న వారికి కాస్త ఉపశమనం కలిగించిందన్న భరోసా వచ్చింది. అదెంతో కాలం నిలవలేదు. వేధింపులు, సకాలంలో రాని వేతనాలు, ఉద్యోగం ఉంటుందో ఊడుతుందోననే బెంగ ఈ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను వెంటాడింది.
ఔట్‌ సోర్సింగ్‌ అంటే..
ఈ ఉద్యోగులను ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులంటారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ అంటే ఏమిటి అనుకుంటున్నారా? అంటే నేరుగా ప్రభుత్వం వీరిని ఉద్యోగాల్లోకి తీసుకోకుండా మధ్యలో ఒక సంస్థ ఉండి వారి ద్వారా రిక్రూట్‌ చేసుకుని ఆ ఏజెన్సీకి జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏజెనీస నుంచి ఉద్యోగులకు జీతాలు అందుతాయి.
ఇప్పుడు ఏజెన్సీ ఎవరు నిర్వహిస్తున్నారు?
గత ప్రభుత్వంలో ఏజెన్సీ ఒకటి కాకుండా వేరువేరుగా ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వమే ఒక ఏజెన్సీని ఏర్పాటు చేస్తుందని ప్రకటించి ఆంధ్రప్రదేశ్‌ కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ సొసైటీని ఏర్పాటు చేసింది. ఏ ప్రభుత్వ శాఖయినా ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో ఉద్యోగులను నియమించుకుంటే ఆ వివరాలు ఆప్‌కాస్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. వారి జీతాల డబ్బులు కూడా ఆప్‌కాస్‌కు పంపించాలి. ఆప్‌కాస్‌ వారు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తారు. ఈ విధానం కాస్త ఊరటనిచ్చేదే. అయితే సకాలంలో వీరికి జీతాలు రావటం లేదు.
మినియం టైమ్‌స్కేల్‌ ఇవ్వాలని డిమాండ్‌..
ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు మినిమం టైమ్‌స్కేల్‌ ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇది ఎన్నో ఏళ్లుగా ఉంది. అయినా పరిష్కారం కాలేదు. ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నది. గతంకంటే ఓ మూడువేల వరకు జీతం ప్రభుత్వం పెంచింది. అయితే రెగ్యులర్‌ ఉద్యోగులకు ఇస్తున్న బేసిక్‌ పేను వీరు అడుగుతున్నారు. ప్రభుత్వం నియమించుకున్న ఉద్యోగులకే పనికి తగిన వేతనం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
సంక్షేమ పథకాలకు వీరికి అర్హత లేదు..
ఒక ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి ఉదాహరణకు నెలకు రూ. 6వేలు జీతం వస్తుందనుకుంటే సంత్సరానికి రూ. 72వేలు అవుతుంది. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలకు ఇన్‌కం కనీసంగా రూ. 2.50లక్షల వరకు ఉంది. లక్ష కూడా జీతం దాటని ఉద్యోగికి సంక్షేమ పథకాలు వర్తించకపోవడం దారుణం. అదేమంటే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నారని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఔట్‌ సోర్సింగ్‌లో కాకుండా అదే వేరే ప్రైవేట్‌ కంపెనీల్లో పనిచేసుకునే వారికి ఆదాయాన్ని బట్టి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. అందువల్ల వీరికి కూడా ఇవ్వాలని ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ కోరుతోంది.


Tags:    

Similar News