కుప్పంకు చంద్రబాబు కృష్ణా జలహారతి

మీ ఊరికి VIP ట్రీట్మెంట్ సరే, మిగతా రాయలసీమ మాటేమిటి చంద్రన్నా అంటున్న రైతు నేతలు;

Byline :  The Federal
Update: 2025-08-25 13:39 GMT


కుప్పంకు కృష్ణా జలాలు రావడంతో రైతులు, టీడీపీ శ్రేణులు మైమరిచాయి. ఈ దృశ్యాలతో నా మనసు పులకించిందని సీఎం ఎన్. చంద్రబాబు వ్యాఖ్యానించారు. పంట కాలువలు లేకుండా, రాయలసీమ జిల్లాల్లో చెరువులను కుదించడం వల్ల ఎలా మేలు జరుగుతుందని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

కుప్పం వరకు హంద్రీ నీవా సుజల స్రవంతి ( హెచ్ఎన్ఎస్ఎస్ ) ప్రధాన కాలువలోకి కృష్ణా జలాలు చేరాయి. టీడీపీ శ్రేణులను ఆనందంలో ముంచెత్తింది. దీనివల్ల చెరువుల అనుసంధానానికి మార్గం ఏర్పడిందని కూడా అంటున్నారు. కుప్పంలోని పరమసముద్రం చెరువు వద్ద 30వ తేదీ సీఎం చంద్రబాబు కృష్ణా జలాలకు జల హారతి ఇవ్వనున్నారు. పైలాన్ నిర్మాణంతో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

రాయలసీమ రైతు సంఘం నేతలు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు. పంట కాలువలు లేకుండా, ప్రధాన కాలువతో మేలు జరుగుతుందా? మొదటి పేజ్ జాతికి అంకితం చేసి నేటికి 13 సంవత్సరాలైనా కర్నూలు జిల్లాలో 15వేల ఎకరాలకు కూడా నీరు అందని పరిస్థితి. అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా ఆయకట్టులో 20 శాతానికి కూడా నీరు అందడం లేదని గుర్తు చేస్తున్నారు. ఇదిలావుంటే..
కుప్పంలోకి కృష్ణా జలాలు ప్రవేశించగానే సీఎం ఎన్. చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
"కుప్పంలోకి కృష్ణా జలాలు రావడంతో నా మనసు పులకించింది" అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లకు సుదీర్ఘ కల సాకారం చేయడం ఆనందంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ నెల 29వ తేదీ నుంచి రెండు రోజుల పర్యటనకు రానున్న సీఎం చంద్రబాబు, ఆయన భార్య నారా భువనేశ్వరి కుప్పంలోని పరసముద్రం చెరువు వద్ద జలహారతి ఇవ్వనున్నారు.
జూలై 17: రాయలసీమలోని నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద ఈ ఏడాది తేదీ సీఎం ఎన్. చంద్రబాబు హంద్రీ, నీవా జలాలను రెండు మోటార్లను ఆన్ చేయడం ద్వారా ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు.
ఆగష్టు 22: చిత్తూరు జిల్లా పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా పరవళ్లు తొక్కుతూ, శనివారం పలమనేరు నియోజకవర్గం వి. కోట మండలాన్ని కృష్ణా జలాలు స్పర్శించాయి. ఉదయానికి కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం కొంగాటం గ్రామ సమీపంలోని కాలువలోకి నీరు చేరింది.
ఆగష్టు 24: ఆదివారం ఉదయం శాంతిపురం మండలం మఠం పంచాయతీ సమీపంలోని కాలువలోకి నీరు రాగానే సంబరాలు మిన్నంటాయి. కృష్ణమ్మకు సారె సమర్పించి, ఆ నీటిలో చిందులు తొక్కారు.
కుప్పం బ్రాంచ్ కెనాల్ 123.641 కిలోమీటర్లలో 330 నిర్మాణాలు ఉన్నాయి. ఈ కాలువ నిర్మాణానికి 593.43 కోట్ల రూపాయలు వెచ్చించారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువలోనీటి వల్ల 110 చెరువులకు నీరు మళ్ళించడంతో పాటు, 6,300 ఎకరాలకు సాగునీరు అందుతుందని లెక్కలు వేశారు. 4.02 లక్షల మందికి తాగునీటి కొరత తీరుతుందని ఇంజినీరింగ్ అధికారులు స్పష్టం చేశారు.
స్పందించిన టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్..
"చెరువుల అనుసంధానం సాకారం చేశాం" అని వ్యాఖ్యానించారు. కొండకోనల మీదుగా కృష్ణా జలాలు 550 కిలోమీటర్లు సాగి కుప్పం ప్రాంతాన్నితాకిన సంఘటన చారిత్రాత్మక ఘటనగా మిగులిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టు ఇదీ
 మాజీ సీఎం ఎన్టీరామారావు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు 1985లో పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. తాజా పరిణామాలపై రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి ఏమన్నారంటే..
"ఇది పంట కాలువలు లేని భగీరథ మోసం" అని అభివర్ణించారు. అవాస్తవ ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది మంచిది కాదని వ్యాఖ్యానించారు. ప్రధాన కాలువకు అనుసంధానంగా పంట కాలువలు, చెరువులకు కూడా అదే విధంగా ఏర్పాట్లు చేయకుండా స్వప్నం ఎలా సాకారం అవుతుందని బొజ్జ ప్రశ్నించారు.
జలహారతితో అనుసంధానం..
కుప్పంలోని పరమసముద్రం వద్ద జలహారతి ఇవ్వడానికి సీఎం చంద్రబాబు ఈ నెల 29వ తేదీ తన నియోజకవర్గం పర్యటనకు రానున్నారు. దీనికోసం పరమసముద్రం చెరువు కట్ట బలోపేతం చేయడం తోపాటు ఆ ప్రదేశంలో బహిరంగసభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జలాలతో మిగతా చెరువులను అనుసంధానం చేసే అపూర్వ ఘట్టం గుర్తుండిపోయే విధంగా కాలువగట్టుపై 18 అడుగుల పైలాన్ ఏర్పాటు చేస్తున్నారు.
పరమసముద్రం చెరువు నిండిన తరువాత రెండు ప్రధాన కలుజు (కాలువ) ద్వారా దిగువన ఉన్న వీరప్పనాయని చెరువు ద్వారా మిగతా వాటికి కృష్ణా జలాలను మళ్లించడానికి వీలుగా కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ రెండు చెరువుల కిందనే దాదాపు రెండు వేల ఎకరాల ఆయకట్టు ఉన్నట్లు వ్యవసాయ శాఖాధికారులు చెప్పారు. అంటే చెరువుల అనుసంధానం ఈ పద్ధతి ద్వారా సాకారం అవుతుందని ఎంఎల్సీ కంచర్ల శ్రీకాంత్ వివరించారు.
"ప్రస్తుతం ఈ చెరువుల సమీపంలో కూడా వెయ్యి అడుగుల లోతు బోర్లు తవ్వితే కానీ, పాతాళగంగ పైకి రావడం లేదు. చెరువులు నిండితో భూ గర్భ జలాలు కూడా పెరుగుతాయి" అని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రైతు మనసు పులకించేది ఎప్పుడు?
హంద్రీనీవా ఆయకట్టు పంట పొలాలకు నీరు అందడం లేదు. ప్రధాన కాలువల నుంచి చెరువులు ప్రధానంగా పంట కాలువలు నిర్మించకుండా లక్ష్యం ఎలా సాకారం అతుందనే ప్రశ్నలు తెరమీదకు వచ్చాయి. అంటే హెచ్ఎన్ఎస్ఎస్ బాలారిష్టాల దశను దాటలేదనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి నిరసన వ్యక్తం చేశారు.
"పంట కాలువల వ్యవస్థ అభివృద్ధి చేయకుండా, హంద్రీనీవా ఆయకట్టుకు నీరు అందించకుండా ప్రధాన కాలువ సామర్థ్యం పెంచాం. కుప్పం వరకు నీరు తీసుకుపోతున్నాం" అనే ప్రచారంతో రాయలసీమ రైతులను ఎండగడుతున్నారని బొజ్జా దశరథరామిరెడ్డి మండిపడ్డారు.
ప్రస్థానం.. ప్రగతి ఇదేనా?
హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణానికి 40 సంవత్సరాల క్రితం పాలనాపరమైన అనుమతులు వచ్చాయి. 3850 క్యూసెక్కుల సామర్థ్యం గల ప్రధాన కాలువ ద్వారా 40 టీఎంసీల నీటిని వినియోగించి రాయలసీమలోని నాలుగు జిల్లాలలో ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. 1985 నుంచి 2004 వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులు అనేకసార్లు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన పనులు మాత్రం మొదలు కాలేదు.
ఎక్కడ పూర్తయింది?
రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే హంద్రీనీవా కాలువ వల్ల నిత్యం కరువులో అల్లాడే అనంతపురం జిల్లాలో కూడా పూర్తి స్ధాయిలో పనులు చేయలేదని బొజ్జా దశరథరామిరెడ్డి గుర్తు చేస్తున్నారు.
" 2004 తర్వాత వచ్చిన ప్రభుత్వం హంద్రీనీవా ప్రాజెక్టును మొదలుపెట్టింది. హంద్రీనీవా మొదటి పేజ్ ను (మల్యాల నుంచి జీడిపల్లి రిజర్వాయర్ వరకు కర్నూలు జిల్లాలో 82,000 ఎకరాలకు అనంతపూర్ జిల్లాలో 1,10,000 ఎకరాలకు నీరు అందించే దశ) 2012 నవంబర్ లో జాతికి అంకితం చేసింది.
మొదటి పేజ్ జాతికి అంకితం చేసి నేటికి 13 సంవత్సరాలైనా కర్నూలు జిల్లాలో 15,000 ఎకరాల ఆయకట్టుకు కూడా నీరు అందని పరిస్థితి. అనంతపూర్ జిల్లాలోని హంద్రీనీవా ఆయకట్టులో 20 శాతానికి కూడా నీరు అందడం లేదు.
ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం రెండుసార్లు నిధులు ఖర్చుపెట్టినా కాలువ సామర్థ్యాన్ని 3250 క్యూసెక్కులకు మించి పెంచలేకపోయారు. ప్రధానకాలువ సామర్థ్యాన్ని 3250 క్యూసెక్కులకు పెంచినా కర్నూలు జిల్లాలో 15000 ఎకరాల ఆయకట్టుకు మించి నీరు నేటికీ కూడా అందడం లేదు. అనంతపురం జిల్లా పరిస్థితి కూడా అదే విధంగానే ఉంది" అని బొజ్జా దశరథరామిరెడ్డి వివరించారు.
నంద్యాల జిల్లా మల్యాల వద్ద హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేశారు. హంద్రీనీవా కాలువలో ప్రవాహ సామర్థ్యం 2,400 క్యూసెక్కుల నుంచి 3,500కు పెంచాలనేది లక్ష్యం. అందుకు ప్రధాన కారణం కుప్పం వరకు కృష్ణా జలాలు పారడానికి రెండో ఫేజ్ లో కాలువ వెడల్పు, లైనింగ్ పనులు వంద రోజుల్లో పూర్తి చేయడంలో సీఎం ఎన్. చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇందులో సందేహం లేదు.
"ప్రధాన కాలువకు అనుసంధానంగా పంట కాలువలు లేనప్పుడు ప్రయోజనం ఏమిటి" అని సీపీఎం రాష్ట్ర నేత కందారపు మురళి సందేహం వ్యక్తం చేశారు.
"ఎన్టీరామారావు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాటి నుంచి ఎందరు సీఎంలు మారినా రైతుల తలరాత మారడం లేదు. సేద్యపు నీరు అందడం లేదు" అని మురళీ అన్నారు. కర్నులూ, అనంతపురం జిల్లాల పరిధిలోనే స్థిరీకరించిన ఆయకట్టుకు కృష్ణా జలాలు అందడం లేదు. చిత్తూరు జిల్లాలో 1.10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందననేది హాస్యాస్పదంగా ఉందని మురళీ వ్యాఖ్యానించారు.
నంద్యాల జిల్లా మల్యాల నుంచి 550 కిలోమీటర్ల దూరంలోని కుప్పం వరకు కృష్ణా జలాలు పారడానికి ప్రధాన కాలువలో నీరు పారిస్తున్నారు. మార్గమధ్యలోని రాయలసీమ జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాలకు వెళ్లే డిస్టిబ్యూటరీ కాలువలకు నీరు వదిలితే పరిస్థితి? ప్రధాన కాలువ పరిస్థితి ఏమిటి? శ్రీశైలంలో బ్యాక్ వాటర్ తగ్గినప్పుడు ఏమి చేయబోతారనేది కూడా సమాధానం లేని ప్రశ్నలుగా మిగులుతున్నాయి.
Tags:    

Similar News