తెలంగాణలో ఫస్ట్: అడవి పులికి త్వరలో రేడియో కాలర్
అటవీగ్రామాల ప్రజలు-పులి మధ్య సంఘర్షణ నివారణకు తెలంగాణ అటవీశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పులికి రేడియో కాలర్ అమర్చే ప్రాజెక్ట్ చేపట్టనుంది.
By : Saleem Shaik
Update: 2025-11-27 10:32 GMT
తెలంగాణ అటవీశాఖ తొలి సారి ఒక పులికి రేడియో కాలర్ అమర్చడం ద్వారా...అటవీ గ్రామాల అంచుల వద్ద ఉండే వన్యప్రాణి సంచారాన్ని పర్యవేక్షించేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త సాంకేతిక ప్రయోగం పులి సంచారాన్ని ముందస్తు హెచ్చరికగా మారుస్తూ, పులులు, అటవీ గ్రామాల ప్రజల మధ్య మానవ–వన్యప్రాణుల ఘర్షణ ప్రమాదాలను నివారించే దిశగా ఒక పెద్ద అడుగు వేయనుంది.
తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి పులి కదలికలను గుర్తించేందుకు వీలుగా దీనికి రేడియో కాలర్ అమర్చాలని అటవీశాఖ వన్యప్రాణి విభాగం అధికారులు నిర్ణయించారు. వరల్డ్ వైడ్ ఫండ్ నేచర్ స్వచ్ఛంద సంస్థ రేడియో కాలర్ ను తెలంగాణ అటవీశాఖకు అందించింది. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన రెండు పులులు బెల్లంపల్లి, లక్కెట్టిపేట ప్రాంతాల అటవీ గ్రామాల్లో సంచరిస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పులులు అటవీ గ్రామాలపై పడక ముందే వాటి కదలికలను గుర్తించి పులి సంచరిస్తున్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేలా రేడియో కాలర్ వ్యవస్థ పనిచేయనుంది.
మహారాష్ట్రలో రేడియో కాలర్ విజయవంతం
మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వులోని ఒక పులిని ట్రాంక్విలైజ్ చేసి దానికి రేడియో కాలర్ అమర్చి, దాన్ని సహ్యాద్రి టైగర్ రిజర్వుకు తరలించారు. పులి కదలికలను కనుగొనేందుకు వీలుగా మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు నవంబరు 21వతేదీన రేడియో కాలర్ పరికరాన్ని పులికి అమర్చి దాని కదలికలను గుర్తించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో తెలంగాణలోని పులికి కూడా రేడియో కాలర్ అమర్చాలని నిర్ణయించారు.
రేడియో కాలర్ అంటే ఏమిటీ?
అటవీ ప్రాంత గ్రామాల్లో సంచరిస్తున్న పులిని గుర్తించి దాన్ని పశువైద్యాధికారులు, అటవీశాఖ అధికారులు కలిసి ట్వాంక్విలైజ్ చేసి దాని మెడలో రేడియో కాలర్ ను అమరుస్తారు. ఇలా పులి మెడలో వేసిన రేడియో కాలర్ సహాయంతో దాని కదలికలను ఎప్పటి కప్పుడు గుర్తించవచ్చని అటవీశాఖ వన్యప్రాణుల విభాగం ఓఎస్‌డీ ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పులి కదలికలను రేడియో కాలర్ ద్వారా దాని సంకేతాలను గుర్తించేందుకు ఒక ప్రత్యేక జీపులో యాంటెన్నా ఏర్పాటు చేసి పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో దీన్ని తిప్పుతుంటారు. పులి యాంటెన్నా ఉన్న జీపు కు కిలోమీటరు దూరంలో ఉంటే దాని సంకేతాలు బీప్ అంటూ వస్తుంటాయి. దీంతో రేడియోకాలర్ బీప్ సంకేతాలతో పులి కదలికలను గుర్తించి అటవీ గ్రామాల ప్రజలను ముందస్తుంగా అప్రమత్తం చేస్తామని ఎ శంకరన్ వివరించారు. పులి అటవీగ్రామాల ప్రజలపై దాడి చేయకుండా ఉండేలా, పులి, మనుషుల మధ్య ఘర్షణ జరగకుండా నివారించేందుకు వీలుగా ఈ రేడియో కాలర్ పనిచేయనుంది. మంచిర్యాల ప్రాంతంలో సంచరిస్తున్న పులికి రేడియో కాలర్ అమర్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తాము నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి లేఖ రాశామని, ఎన్టీసీఏ నుంచి అనుమతి రాగానే పులికి మత్తు మందు ఇచ్చి దానికి రేడియోకాలర్ అమరుస్తామని ఓఎస్డీ ఎ శంకరన్ వెల్లడించారు.
అరణ్యభవన్ కేంద్రంగా టైగర్ ప్రొటెక్షన్ మానిటరింగ్ సెల్
తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్, కవ్వాల్, ఏటూరునాగారం, శ్రీశైలం నాగార్జునసాగర్ పులుల అభయారణ్యాల్లోని పులులు సంచరించే కీలక ప్రాంతాలను పర్యవేక్షించేందుకు వీలుగా అరణ్యభవన్ కేంద్రంగా టైగర్ ప్రొటెక్షన్ మానిటరింగ్ సెల్ ను బుధవారం ఏర్పాటు చేశారు.తెలంగాణలోని మారుమూల అటవీప్రాంతాల్లోని కీలకమైన పులులు సంచరించే ప్రదేశాల్లో సోలార్ పవర్, వైర్ లెస్ ఇంటర్ నెట్ సహాయంతో పనిచేసేలా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని అరణ్య భవన్ లోని ఓ గదిలో 8 టీవీ స్క్రీన్లతో వాటిని అనుసంధానం చేశారు.
పులుల కదలికల పర్యవేక్షణ
అరణ్య భవన్ లోని స్టేట్ కమాండ్ సెంటర్‌ను రెండు కొత్త ప్రాంతీయ కేంద్రాలతో నేరుగా అనుసంధానం చేశామని టైగర్ ప్రొటెక్షన్ మానిటరింగ్ సెల్ ఇన్ చార్జి, తెలంగాణ వన్యప్రాణుల పరిరక్షణ విబాగం డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వి ఆంజనేయులు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను కవర్ చేసేలా మన్ననూర్, కవ్వాల టైగర్ రిజర్వ్‌ను కవర్ చేసేలా మంచిర్యాలల్లో ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. తమ కేంద్రం పులుల సంచారం డేటా సేకరణతోపాటు ప్రత్యక్ష నిఘా పెడుతుందని ఆయన పేర్కొన్నారు. 24 గంటల పాటు పులుల కదలికలను పర్యవేక్షించడానికి తాము సీసీటీవీ నెట్‌వర్క్‌లు, కెమెరా ట్రాప్‌లు, జీపీఎస్ ట్రాకర్‌లతో సహా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని ఆంజనేయులు తెలిపారు. ‘‘అడవుల చుట్టూ డిజిటల్ షీల్డ్ని సృష్టించడంతోపాటు వన్యప్రాణుల వేట ప్రయత్నాలను లేదా అక్రమంగా అడవిలోకి వేటగాళ్ల ప్రవేశాన్ని వెంటనే గుర్తించడానికి మాకు వీలు కల్పిస్తుంది’’అని డీసీఎఫ్ ఆంజనేయులు వివరించారు.
టైగర్ ప్రొటెక్షన్ మానిటరింగ్ సెల్ ఏం చేస్తుందంటే...
రాష్ట్రంలోని అమ్రాబాద్, కవ్వాల పులుల అభయారణ్యాలతోపాటు ఇతర అటవీప్రాంతాలు, చెక్ పోస్టులు, జాతీయవనాలు,మృగవని పార్కు,కేబీఆర్ పార్కుల్లో నిరంతరం నిఘా వేసి పులులు, చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటుంది. ‘‘టైగర్ రిజర్వ్‌లు, వన్యప్రాణుల అభయారణ్యాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించడానికి మేం మూడు అంచెల కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నామని, ఈ నెట్‌వర్క్ అటవీ అంచుల దగ్గర నివసించే మా పౌరుల భద్రత మా ప్రధాన ప్రాధాన్యత’’అని వి ఆంజనేయులు వెల్లడించారు. ‘‘ఒక పులి మానవ నివాసం వైపు కదులుతుంటే, వ్యవస్థ తక్షణమే మమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. సంఘర్షణ జరగడానికి ముందే మా రెస్పాన్స్ టీమ్‌లను మోహరించవచ్చు, మానవులు, జంతువుల భద్రతను నిర్ధారిస్తుంది. మా ఫీల్డ్ ఆఫీసర్లకు కఠినమైన ప్రోటోకాల్‌లను ఏర్పాటు చేశాం. వన్యప్రాణుల కదలిక , అటవీ సంఘటనలకు సంబంధించిన డేటాను ప్రతిరోజూ సాయంత్రం 5:30 గంటలకు ధృవీకరించి అప్‌లోడ్ చేస్తాం. దీనివల్ల ప్రభుత్వం ప్రతిరోజూ గ్రౌండ్ రియాలిటీతో ఖచ్చితమైన, తాజా చిత్రాలు పొందవచ్చు’’ అని డీసీఎఫ్ ఆంజనేయులు చెప్పారు.
రేడియో కాలర్, టైగర్ ప్రొటెక్షన్ మానిటరింగ్ సెల్ ఏర్పాటుతో వన్యప్రాణుల పరిరక్షణకు మార్గం సుగమం కానుంది. రేడియో కాలర్ ప్రయోగం కేవలం ఒక సాంకేతిక ప్రయోగం మాత్రమే కాదు. ఇది అటవీ గ్రామాలు, పులుల మధ్య ఉన్న భద్రతకు, మనవులు–వన్యప్రాణుల మధ్య ఘర్షణను నివారించడానికి ఒక విజయవంతమైన అధునాతన విధానం.