ఐ బొమ్మ రవి మళ్లీ మూడ్రోజుల కస్టడీకి
బ్యాంకుఖాతా, నెట్ వర్క్ సంబంధించిన సమాచారం కోసం
పైరసీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ కేసులో ప్రధాన నిందితుడైన ఇమంది రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసు కస్టడీలో కీలక విషయాలు వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు, ముఖ్యంగా అతడి బ్యాంకు ఖాతాలు, నెట్‌వర్క్‌కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల ఐబొమ్మ కేసులో రవిని అరెస్టు చేసిన పోలీసులు, కోర్టు జోక్యంతో ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. ఆ సమయంలో కొన్ని కీలక ఆధారాలను సేకరించారు. అతడి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా లభ్యం కాలేదని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి కస్టడీకి అనుమతించాలంటూ నాంపల్లి క్రిమినల్ కోర్టును ఆశ్రయించారు.
పోలీసుల అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం, మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో చంచల్‌గూడ జైలు నుంచి రవిని సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విచారణలో అతడి నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించింది, ఆర్థిక మూలాలపై పోలీసులు దృష్టి పెట్టారు.
ఐ బొమ్మ నిర్వాహకుడు రవిని మరో ఏడు రోజుల కస్టడీని కోరినప్పటికీ కోర్టు మాత్రం మూడ్రోజుల కస్టడీకి అనుమతించింది. ఇప్పటికే ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని బుధవారం అతడిని 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు చెంచల్ గూడ జైలుకు తరలించారు.వేలాది చిత్రాలను హెచ్ డి క్వాలిటీతో తన పైరేటెడ్ వెబ్ సైట్ ద్వారా ఉచితంగానే ప్రసారం చేస్తున్న రవి బ్యాంకు ఖాతాలో ఉన్న మూడున్నర కోట్ల రూపాయలను సీజ్ చేశారు.