సిట్ ముందుకు కేసీఆర్ ఓఎస్‌డీ
ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో సిట్ స్పీడ్ పెంచింది.
ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఒకరి తర్వాత ఒకరుగా అనుమానితులను, నిందితులను, బాధితులను విచారిస్తోంది. ఇప్పటికే ఇందులో హస్తం ఉందని భావించిన పలువురు అధికారులను కూడా సిట్ విచారించింది. ఈ క్రమంలోనే ప్రభావకర్ రావుతో పాటు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావులను కూడా సిట్ విచారించింది. తాజాగా ఈ కేసులో ప్రశ్నించడానికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఓఎస్‌డీ రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు పిలిచారు. గురువారం ఉదయం అతనిని సిట్ అధికారులు ప్రశ్నించారు.
టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధకిషన్ రావు.. 2024 మార్చిలో ఇచ్చిన ఒక స్టేట్‌మెంట్ ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రాధాకిషన్ వ్యాఖ్యల్లో అప్పటి సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కేసీఆర్ కుటుంబ సభ్యలు, బీఆర్ఎస్‌లో సన్నిహితుల వ్యవహారాలు చక్కబెట్టడానికి తాము పని చేశామని రాధ కిషన్ రావు స్టేట్‌మెంట్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాజశేఖర్ రెడ్డిని విచారించి, ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు.