2015 గ్రూప్-2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట

సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సస్పెండ్ చేసిన సీజే.

Update: 2025-11-27 07:20 GMT

తెలంగాణలో 2015 గ్రూప్-2 ర్యాంకర్ల అంశం కీలక మలుపు తీసుకుంది. ఇటీవల 2015 గ్రూప్-2 పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అప్పటి నుంచి విధుల్లో ఉన్న వారి పరిస్థితి ఏంటి? అన్న చర్చ మొదలైంది. కాగా తాజాగా ఈ ఉత్తర్వులను హైకోర్టు సీజేతో కూడిన ధర్మాసనం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును కొందరు టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో ఛాలెంజ్ చేశారు. దీంతో వారి పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై 2015 గ్రూప్-2 ర్యాంకర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే 2015-16 గ్రూప్-2 ఎంపిక జాబితాను సింగిల్ బెంచ్ కొట్టివేసింది. కాగా డివిజన్ బెంచ్ మాత్రం.. సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా డబుల్ బబ్లింగ్, వైట్‌నర్ యూజ్, తుడిచివేతలున్న పార్ట్‌-బీ పత్రాలను పునఃమూల్యాంకనం చేయడం కుదరదని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు, సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా వ్యవహిరించే అధికారం టీజీపీఎస్‌సీకి లేదని డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది.

జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్‌ జరిగినట్లు స్పష్టమైన నేపథ్యంలో, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చర్యలు తగిన విధంగా లేవని కోర్టు పేర్కొంది. 2019 అక్టోబర్‌ 24న విడుదల చేసిన ఫలితాలను చట్టవిరుద్ధంగా భావిస్తూ రద్దు చేసింది. సాంకేతిక కమిటీ సూచనలు, హైకోర్టు దిశానిర్దేశాల ప్రకారం తిరిగి మూల్యాంకనం చేసి అర్హుల జాబితాను విడుదల చేయాలని కమిషన్‌కు ఆదేశించింది. ఈ మొత్తం ప్రక్రియను ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని కోర్టు స్పష్టం చేసింది.

Tags:    

Similar News