ట్యాపింగ్ కేసు కేసీఆర్ మెడకు చుట్టుకుంటోందా ?
కేసీఆర్ కు ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖరరెడ్డిని గురువారం సిట్ అధికారులు విచారించారు
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టెలిఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ మెడకు బిగుసుకుంటోందా ? తాజాగా జరిగిన ఒక డెవలప్మెంట్ అందరిలోను ఇదే అనుమానాన్ని పెంచేస్తోంది. ఇంతకీ తాజాగా జరిగిన డెవలప్మెంట్(Telephone Tapping) ఏమిటంటే కేసీఆర్ కు ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖరరెడ్డిని గురువారం సిట్ అధికారులు విచారించారు. అసలు కేసీఆర్(KCR) ఓఎస్డీని విచారించాల్సిన అవసరం సిట్ అధికారులకు ఏమొచ్చింది ? ఏమొచ్చింది అంటే ఇదేకేసులో అరెస్టయి విచారణను ఎదుర్కొంటున్న డీసీపీ రాధాకిషన్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఓఎస్డీని సిట్ అధికారులు విచారించినట్లు సమాచారం.
ట్యాపింగ్ కేసులో కీలకపాత్ర పోషించిన పోలీసు అధికారుల్లో డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ కూడా ఒకరన్న విషయం అందరికీ తెలిసిందే. మిగిలిన అధికారులను విచారించిన సిట్ అధికారులకు డీసీపీ విచారణలో కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖరరెడ్డి ప్రస్తావన రావటం ఆశ్చర్యం కలిగించింది. కేసీఆర్ కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ లో సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకు వీలుగా ప్రత్యర్ధుల ఫోన్లను తాము ట్యాపింగ్ చేసేవారమని రాధాకిషన్ సిట్ అధికారులకు చెప్పారు. ఎవరెవరి దగ్గర నుండి ట్యాపింగ్ చేయాలని ఆదేశాలు వచ్చేవనే వివరాలను కూడా రాధాకిషన్ చెప్పినట్లు తెలిసింది. ట్యాపింగ్ చేయాలని తమకు ఆదేశాలు ఇచ్చేవారిలో కేసీఆర్ కు ఓఎస్డీగా పనిచేసిన రెడ్డి పేరును డీసీపీ చెప్పారు. అందుకనే సిట్ అధికారులు ఓఎస్డీగా పనిచేసిన రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించారు.
దాదాపు మూడుగంటల విచారణలో సిట్ అధికారులకు రెడ్డి అనేక విషయాలను వివరించినట్లు సమాచారం. టెలిఫోన్-కేసీఆర్ కు సంబంధించిన అనేక అంశాలను రెడ్డి విచారణలో పూసగుచ్చినట్లు చెప్పారని పోలీసువర్గాల సమాచారం. రెడ్డి ఇచ్చిన స్టేట్మెంటును సిట్ అధికారులు రికార్డుచేశారు. సిట్ విచారణలో రెడ్డి చెప్పిన విషయాలు ఏమిటన్నది ఇంకా వెలుగులోకి రాలేదు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు కొందరు మంత్రులు పదేపదే ట్యాపింగ్ లో కీలక సూత్రదారి కేసీఆరే అని ఆరోపిస్తున్నారు. అలాగే ట్యాపింగ్ లో కీలకపాత్రదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టీ ప్రభాకరరావును పోలీసులు ఇంకా అరెస్టుచేసి విచారించలేదు. సుప్రింకోర్టు ఇచ్చిన వెసులుబాటుతో సిట్ విచారణకు ప్రభాకరరావు హాజరవుతున్నా పెద్దగా సహకరించటంలేదు. కారణం ఏమిటంటే ప్రభాకరరావును అరెస్టు చేయకూడదని సుప్రింకోర్టు ఆదేశాలున్నాయి కాబట్టే.
పోలీసులు అరెస్టుచేస్తారు, తమదైన రీతిలో విచారిస్తారనే భయంలేకపోతే ఎవరైనా విచారణకు సహకరిస్తారా ? ఇపుడు ప్రభాకరరావు విషయంలో జరుగుతున్నది ఇదే. పోలీసుల అరెస్టు విషయంలో సుప్రింకోర్టు రక్షణలేకపోయుంటే ప్రభాకరరావు ట్యాపింగ్ కు సంబంధించిన అన్నీవిషయాలను ఎప్పుడో సిట్ అధికారులకు చెప్పేసుండేవారేమో. ఏదేమైనా తొందరలోనే ప్రభాకరరావుకు సుప్రింకోర్టు రక్షణ తొలగిపోతుందని పోలీసులు ఆశాభావంతో ఉన్నారు. ప్రభాకరరావును అరెస్టుచేసి విచారించేందుకు పోలీసులు సుప్రింకోర్టులో దాఖలుచేసిన పిటీషన్ విచారణలో ఉంది. ఈలోగానే కేసీఆర్ కు ఓఎస్డీగా పనిచేసిన రెడ్డిని సిట్ అధికారులు విచారించటం కీలకమైన డెవలప్మెంట్ అనే అనుకోవాలి. విచారణలో ఓఎస్డీ ఏమిచెప్పారనే విషయాలను బట్టి కేసీఆర్ పైన సిట్ యాక్షన్ తీసుకుంటుందన్నది ఆదారపడుంటుంది. ఏదేమైనా అటు ప్రభాకరరావు, ఇటు రెడ్డి చెప్పిన, చెప్పబోయే విషయాలు కేసీఆర్ మెడకు గట్టిగా చుట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.