సిగాచీ ఘటనలో పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
బాధ్యులను ఇప్పటికీ గుర్తించకపోవడం, అరెస్టులు లేకపోవడం పై కోర్టు ప్రశ్నించింది.
సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు దర్యాప్తుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై దాఖలైన పిల్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ముఖ్య న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ పోలీసుల దర్యాప్తు తీరును కఠినంగా ప్రశ్నించారు.
“ఇది సాధారణ ప్రమాదం కాదు… 54 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇంత పెద్ద ఘటన జరిగితే ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతోందని చెప్పడం ఎలా?” అని సీజే తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 237 మంది సాక్షులను విచారించినప్పటికీ, దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
పేలుడు ఘటనకు బాధ్యులను ఇప్పటికీ గుర్తించకపోవడం, అరెస్టులు లేకపోవడం పై కోర్టు ప్రశ్నించింది. ఇంత పెద్ద మృతుల సంఖ్య నమోదైన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. “ఇలాంటి విపత్కర ఘటనలో దర్యాప్తు అధికారిగా డీఎస్పీని మాత్రమే ఎందుకు నియమించారు?” అని సీజే వ్యాఖ్యానించారు.
దర్యాప్తు పురోగతిపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని అదనపు అడ్వకేట్ జనరల్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి వ్యక్తిగతంగా హాజరుకావాలని సూచించింది. కేసు విచారణను వచ్చే నెల 9కు వాయిదా వేసింది.
సిగాచీ పేలుడు ఘటనలో 54 మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. అయితే దర్యాప్తులో వచ్చిన ఆలస్యం, బాధ్యులపై చర్యలు లేకపోవడం మీద హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అధికార యంత్రాంగంపై ఒత్తిడిని పెంచాయి.