తల్లి పాలలోకీ ప్రవహిస్తున్న యురేనియం

భూగర్భ జలాలే, ప్రాణాల్ని హరించే విషతుల్యంగా మారుతున్నాయి!

Update: 2025-11-27 11:56 GMT

తల్లి పాలలో యురేనియం వుండ‌టం ఏంటి? అమ్మో ఆ మాట వింటేనే వ‌ళ్లు జ‌ల‌ద‌రిస్తోంది. బిహార్‌లోని ఆరు జిల్లాల్లో నివసించే కొందరు తల్లుల చ‌నుపాల శాంపిల్స్ ప‌రీక్షిస్తే యురేనియం (యు-238, 5 పిపిబి) ఉన్నట్టు గుర్తించారు. భోజ్‌పుర్, సమస్తీపుర్, బేగుసరాయ్, ఖగాఢియా, కటిహార్, నలంద జిల్లాల్లో 17 నుంచి 35 ఏళ్ల వయసున్న 40 మంది మహిళలపై ఈ పరిశోధన జరిగింది. దీని కోసం ఒక్కో గ్రూపు ఒక మహిళ నుంచి నేరుగా శాంపిళ్లు సేకరించింది.

ఈ శాంపిళ్లను వైశాలిలోని ఎన్ఐపీఈఆర్‌లో పరీక్షించారు. ఎల్‌సీ-ఐసీపీ-ఎంఎస్‌గా పిలిచే మెషీన్‌తో ఈ శాంపిళ్లను విశ్లేషించారు. కటిహార్ జిల్లాలో సేకరించిన తల్లి పాలలో యురేనియం స్థాయి ఎక్కువగా 5.25 మైక్రోగ్రాములు ఉన్నట్టు తేలింది. తక్కువ యురేనియం స్థాయి భోజ్‌పుర్‌ తల్లుల్లో కనిపించింది. నలందలో పాలిచ్చే తల్లుల్లో సగటున 2.35 మైక్రోగ్రాములు యురేనియం ఉన్నట్టు, ఖగాడియాలో 4.035 మైక్రో గ్రాములున్నట్టు గుర్తించారు. వారిలో 70 శాతం మంది పిల్లల రక్తంలోనూ యురేనియం గుర్తించారు.

"అస‌లు త‌ల్లి పాల‌లో యురేనియం అవ‌శేషాలు వుండ‌టం ఏమిటి? ఎందుకు ఈ డౌట్ వ‌చ్చింది? అంటే అక్కడి నీళ్లలోనో, ఆహారంలోనో యురేనియం ఆన‌వాళ్ళు గుర్తించి వుండాలి.  పాలిచ్చే త‌ల్లుల‌పై ఏమైనా ప్ర‌భావం వుందా అని స్ట‌డీ చేశారు. 40 మంది పాలిచ్చే తల్లుల పాలను శాంపిల్స్ తీసుకుని విశ్లేషించారు. అన్ని నమూనాలలో యురేనియం (యు-238) ఉన్నట్లు తేలింది," అని ప‌ర్యావ‌ర‌ణ వేత్త దొంతి న‌ర్సింహారెడ్డి ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు. 

"ఈ త‌ల్లుల పాలు తాగిన 70 శాతం మంది శిశువులకు క్యాన్సర్ ప్రమాదం వున్న‌ప్పటికీ, మొత్తం యురేనియం స్థాయి అనుమతించిన పరిమితుల కన్నా తక్కువగా ఉంది,"  అని ఈ అధ్యయనంలో ప్రధానంగా పాల్గొన్న ఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన డాక్టర్ అశోక్ శర్మ తెలిపారు.

"యురేనియం ఆన‌వాళ్లు ఉండ‌టం అతి ప్ర‌మాద‌క‌రం. సేఫ్ లెవెల్ అంటున్నారు. దీనికి సంబంధించి అధ్య‌య‌నాలు ఎక్క‌డా జ‌ర‌గ‌లేదు. సేఫ్ లెవెల్ అనేది త‌ల్లికి కావ‌చ్చు. బేబీకి కాదు. బేబీ రేడియేష‌న్ తో క్యాన్స‌ర్‌కు గురికాక త‌ప్ప‌దు,"  అని దొంతి న‌ర్సింహారెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

"వాస్తవానికి అక్క‌డి స్థానిక ప్ర‌జ‌లు తాగుతున్న, వాడుతున్న నీటిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన పరిమితి కంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా యూరేనియం ఉంది," అని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్ డిఎం ఏ) సభ్యుడు, బాబా అటామిక్ రీసర్చ్ సెంటర్ మాజీ గ్రూప్ డైరెక్టర్ అయిన అణు శాస్త్రవేత్త డాక్టర్ దినేశ్ కె. అస్వాల్ ఓ ఇంటర్ వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 

బీహార్ నుంచి వచ్చిన తల్లి పాల నమూనానలో 5 పిపిబి (పార్ట్స్ ఫర్ బిలియన్ ) వరకూ యురేనియం ఉన్నట్లు పట్నాసోని మహవీర్ క్యాన్సర్ సంస్థాన్, పరిశోధన కేంద్రం, లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ లోని ఎయిమ్స్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన అధ్యయనంలో తేలింది.  బీహార్ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో ఈ అధ్యయనం ఫలితాలను ప్రచురించారు. 

ఏక్క‌డో బీహార్‌లో క‌దా ఈ దారుణం అని అనుకుంటున్నారా?  తెలుగు రాష్ట్రాల్లోనూ యురేనియం డేజంర్ బెల్స్ మోగిస్తోంది.  గుంటూరు జిల్లా తురకపాలెం పరిసరాల్లోని నీటి వనరుల్లో యురేనియం అవశేషాలు ఉన్నట్లు తేలింది. ఈ నీటిలో యురేనియంతో పాటు స్ట్రాన్షియం, ఈకోలి బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు గుర్తించారు.

కృష్ణా జ‌లాల్ని హైద‌రాబాద్‌కు తీసుకువ‌స్తున్న నేప‌థ్యంలో నాగార్జున‌సాగ‌ర్ స‌మీపంలోని భూగ‌ర్భ జ‌లాల్లో యురేనియం ఆన‌వాళ్ళు వున్న‌ట్లు గ‌తంలో హైద‌రాబాద్ మెట్రో వాట‌ర్ వ‌ర్క్స్ అధికారులు చెప్పారు. అయితే ఆ త‌రువాత దానిపై మాట్లాడ‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌ని ప‌ర్యావ‌ర‌ణ వేత్త దొంతి న‌ర్సింహారెడ్డి తెలిపారు. గ‌త కొంత కాలంగా పలువురు శాస్త్రవేత్తలు నాగార్జునసాగర్‌లోని విజయవిహార్‌ అతిథిగృహంలో బస చేస్తూ.. నాగార్జునసాగర్‌ రైట్‌బ్యాంక్‌ సమీపంలో ఆంధ్రా వైపున ప్‌లైటెక్‌ ఎరోడ్రమ్‌లో రెండు చాపర్లను పెట్టుకుని ఏరియల్‌ సర్వే నిర్వహిస్తున్నారు. అయితే వారు ఇతర ఖనిజాల కోసం సర్వే జరుపుతున్నట్లు చెబుతూ వస్తున్నారు.  ఇటీవల అమ్రాబాద్‌ అటవీ ప్రాంతంలో చాపర్ల ద్వారా సర్వే నిర్వహించారు. యూసీఐఎల్‌ (యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) అధికారులు ఈ ప్రాంతంలో పర్యటిస్తుండటంతో అన్వేషణ కొనసాగుతున్నట్లు ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.  ఈ గుట్టల నుంచి వర్షపు నీరంతా నాగార్జునసాగర్‌ జలాశయంలో కలుస్తుంది. ఇక్కడ యురేనియం తీస్తే తాగు, సాగు నీరు కలుషితమై బీహార్ త‌ల్లుల‌కు శివువుల‌కు ప‌ట్టిన గ‌తే ప‌డుతుంద‌ని ప్రజలు భయపడుతున్నారు. 

Similar News