రసవత్తరంగా కర్నాటకం.. మాట నిలబెట్టుకోండంటూ డీకే ట్వీట్

ప్రపంచంలోని ఎవరైన మాట ఇస్తే దానికే కట్టుబడి ఉండాలని సందేశం

Update: 2025-11-27 12:05 GMT
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్

కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై కాంగ్రెస్ లో హైడ్రామా కొనసాగుతోంది. తనకు కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డీకే శివకుమార్ తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

వాగ్ధానాలను నిలబెట్టుకోవడం ప్రపంచంలో పేరు మోసిన కాంగ్రెస్ కు ఇది అత్యవసరం అని ఆయన నేరుగా హైకమాండ్ ను ఉద్దేశించి సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేశారు.

గత కొద్ది రోజులుగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వర్గాల మధ్య బలపదర్శనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇన్ని రోజులుగా ముసుగులో గుద్దులాటలా ఉన్న వ్యవహారం డీకే చేసిన ట్వీట్ తో బహిరంగమైంది.

నాయ్యమూర్తి అయినా, రాష్ట్రపతి అయినా లేదా ఇంకేవరైన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, దానిని గౌరవించి తీరాలని శివకుమార్ వ్యాఖ్యానించారు.

‘‘మాట శక్తి, ప్రపంచ శక్తిని ఒక సామెత ఉంది. అంటే మనం ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవాలి. అది ప్రపంచంలోని అతిపెద్ద శక్తులలో ఒకటి. అది న్యాయమూర్తి అయిన, అధ్యక్షుడైనా, నేను అయినా.. ప్రతి ఒక్కరు మాట మీద నిలబడాలి. పద శక్తే.. ప్రపంచ శక్తి’’ అని గురువారం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
కుర్చీ విలువ..
వేదికపై నిలబడిన వారికి కుర్చీ విలువ అర్థం కాదని, వారికీ లభించే కుర్చీని వదిలీ ఇతరుల కుర్చీని ఆక్రమించుకోవాలని చూస్తారని పరోక్షంగా సిద్ధరామయ్యపై విమర్శలు గుప్పించారు.
‘‘నా వెనక నిలబడి ఉన్న వారికీ కుర్చీ విలువ తెలియదు. వారికి దొరికే కుర్చీల్లో కూర్చోవడానికి బదులుగా, అనవసరంగా నిలబడి ఉంటారు’’ అని ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య పోరాటం జరుగుతున్న సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాల తరువాత నాయకత్వ మార్పు ఉంటుందని శివకుమార్ శిబిరం ప్రచారం చేసుకుంటుండగా, ఆయన వ్యతిరేకులు దీనిని తిరస్కరిస్తూ వస్తున్నారు.
కర్ణాటకలో నాయకత్వ మార్పు జరిగితే బీజేపీ బయట నుంచి మద్దతు ఇస్తుందని బీజేపీ వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం హై కమాండ్ దే అని మాజీ ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడ అన్నారు.
రాహుల్ కు నివేదిక..
కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలను ఆ పార్టీ హైకమాండ్ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ గురించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఓ నివేదికను రాహుల్ గాంధీకి సమర్పించారు.
మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ, చిక్కులు, కులాలు, ముఖ్యమంత్రి మార్పు వల్ల  సంభవించే పరిణామాలపై రాహుల్ కు సమగ్రంగా నివేదిక సమర్పించారు. నాయకత్వ మార్పుపై డీకే శివకుమార్ చేసిన ఎమ్మెల్యేల సంతకాల సేకరణపై కూడా రాహుల్ గాంధీ అసహనంగా ఉన్నట్లు తెలిసింది.
మరోవైపు డీకే మాత్రం తన ప్రయత్నాలను ఆపడం లేదు. ఎన్నికల్లో గెలిచాక అధికార మార్పిడి ఒప్పందం ప్రకారం.. సిద్ధరామయ్యనే స్వచ్చందంగా రాజీనామా చేయించడానికి ఒప్పించాలని సతీష్ జార్కిహోళీని ని డీకే కోరినట్లు వార్తలు వచ్చాయి.


Tags:    

Similar News