తెలంగాణ సైన్సు టీచరమ్మకి నేషనల్ అవార్డ్

ఈ సూర్యాపేట టీచర్ పట్టుదలకు పర్యాయపదం... ‘ఫెడరల్ తెలంగాణ’తో అవార్డు అనుభూతిని పంచుకున్న పవిత్ర;

Update: 2025-08-25 11:36 GMT
విద్యార్థులకు సైన్సు పాఠం బోధిస్తున్న ఉత్తమ టీచర్ మారం పవిత్ర

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం పెన్ పహాడ్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల సైన్సు ఉపాధ్యాయురాలు మారం పవిత్రకు జాతీయ స్థాయిలో ఉత్తమ టీచరుగా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని డిల్లీలోని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సోమవారం మధ్యాహ్నం ఆమెకు ఫోన్ ద్వారా తెలియచేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా పవిత్ర ఎంపిక చేసినట్లు కేంద్ర అధికారులు తెలిపారు.ఈ ఫోన్ కాల్ తో పాఠశాలలో సైన్సు పాఠాలు బోధిస్తున్న పవిత్ర టీచరు ఆనందానికి అవధుల్లేవు. జాతీయ స్థాయిలో ఉత్తమ టీచరుగా పవిత్ర టీచరు ఎంపికైందని తెలుసుకున్న విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. పవిత్ర పట్టుదలకు పర్యాయపదం. కుటుంబ కారణాల వల్ల ఆమె డిగ్రీ చదవుకంటే ముందే వివాహమయింది. వివాహం ఆమెకు ప్రతిబంధకమని భావించలేదు. పెళ్లయ్యాక డిగ్రీ పూర్తి చేశారు. ఆపైన బీఈడీ, ఎంఈడీ కూడా చదివి ఉపాధ్యారాయులయ్యారు. ఈ పట్టుదలతోనే ఆమె పిల్లలకు పాఠాలు బోధిస్తూ ఇపుడు జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.




 జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన పవిత్ర ‘ఫెడరల్ తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.




 జాతీయ అవార్డు ఎలా వరించిందంటే...

‘‘నా పేరు మారం పవిత్ర. నేను గత 15 ఏళ్లుగా ఉన్నత పాఠశాలలో బయాలజీ సైన్సు పాఠాలు చెబుతున్నాను.6వతరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు బయలాజికల్ సైన్సు పాఠాలు చెబుతుంటాను. పాఠశాలలోనే కాకుండా ఇంట్లోనూ విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా సైన్సు పాఠాలు తయారు చేస్తుంటాను. ఇన్ ఫర్ మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా విద్యార్థులకు ఆడియో, వీడియో, ఆటపాటల ద్వారా పాఠాలు చెబుతున్నాను.విద్యార్థులు గేమ్స్ ఆడుతూ సైన్సు పాఠాలు నేర్చుకునేలా కార్డ్ గేమ్స్, బోర్డు గేమ్స్ బోధనను ప్రారంభించాను.



 క్యూఆర్ కోడ్ ద్వారా ఆడియో,వీడియో పాఠాలు

బయాలజీ సైన్సులో కఠినమైన పాఠాలను సులభంగా ఆడియో, వీడియోల ద్వారా క్యూ ఆర్ కోడ్ సాయంతో వినేలా ఆడియో,వీడియో పాఠాలు రూపొందించాను.దూరదర్శన్, టీశాట్ ద్వారా వీడియో పాఠాలు కూడా రూపొందించాను.



 వివాహం తర్వాత చదువుకొని...ఉపాధ్యాయురాలై...

డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నపుడు నాకు నిధాల మన్మథరెడ్డితో వివాహమైంది. పెళ్లి తర్వాత డిగ్రీని పూర్తి చేసి, ఎంఎస్సీ, బీఈడీ, ఎంఈడీ చదివి ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించాను. పెళ్లి చదువుకు ఆటంకం కాదని నిరూపిస్తూ నా భర్త తోడ్పాటుతో నిరంతరం చదివి ఉద్యోగం సాధించాను. విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాకుండా వారిని సైన్సు ఫేర్ లకు సమాయత్తం చేసి పలు అవార్డులు వచ్చేందుకు కృషి చేశాను. ’’ అని పవిత్ర వివరించారు.



 సూర్యాపేట సైన్స్ టీచరుకు అవార్డులెన్నో...

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన మారం పవిత్రకు 2023వవ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు లభించింది. 2021వ సంవత్సరంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ సైంటిస్ట్ అవార్డు దక్కింది. సైన్సు బోధనలో వినూత్న పద్ధతులు పాటించిన పవిత్రకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ సైంటిస్ట్ అవార్డు ప్రదానం చేశారు. 2022వ సంవత్సరంలో సూర్యాపటే జిల్లాలో బెస్ట్ టీచర్ అవార్డు లభించింది. సైన్స్ అకాడమీ టెక్ మహేంద్ర నుంచి ట్రాన్స్ ఫర్మేషన్ ఎడ్యుకేటర్ అవార్డు దక్కింది.



 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా...

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ అవార్డు 2025 తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయురాలు మారం పవిత్రకు లభించింది. ఈ అవార్డు ప్రదానోత్సవం సెప్టెంబరు 5వతేదీన న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరగనుంది. ఈ అవార్డు కింద ప్రశంసా పత్రంతోపాటు రూ.50వేల నగదు బహుమతి, వెండి పతకాన్ని అందజేస్తామని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ తెలిపింది.

జిల్లా అధికారుల ప్రశంసలు

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన మారం పవిత్రకు సూర్యాపేట జిల్లా విద్యాశాఖాధికారి కె అశోక్,సూర్యాపేట జిల్లాపరిషత్ డిప్యూటీ సీఈఓ డి శిరీష, జిల్లాపరిషత్ పెన్ పహాడ్ మండల అభివృద్ధి అధికారి ఏ జానయ్య తదితర అధికారులు అభినందించారు.


Tags:    

Similar News