ప్రతిపక్షం విలువ ఇప్పుడే గుర్తుకొచ్చిందా ?

‘బలమైన ప్రతిపక్షం ఉన్నపుడే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది’..తాజాగా చేవెళ్ళ బహిరంగసభలో బీఆర్ఎస్ అధినేత కేసీయార్ చెప్పిన మాటలివి.

Update: 2024-04-14 08:40 GMT

‘బలమైన ప్రతిపక్షం ఉన్నపుడే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది’..తాజాగా చేవెళ్ళ బహిరంగసభలో బీఆర్ఎస్ అధినేత కేసీయార్ చెప్పిన మాటలివి. ఇపుడీ మాటలకు ఎందుకింత ప్రాధాన్యత వచ్చిందంటే అధికారంలో ఉన్న పదేళ్ళల్లో ఇదే కేసీయార్ ప్రతిపక్షాలను పూచికపుల్లతో సమానంగా చూశారు. ఏ విషయంలో కాని, సమస్య వచ్చినపుడు కాని ప్రతిపక్షాలను అసలు లెక్కేచేయలేదు. ఉద్యమపార్టీని అని చెప్పుకునే కారుపార్టీ అధినేత తాను అధికారంలో ఉన్నపుడు రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు, నిరసనలు చేసేందుకు లేదన్నారు. ఆందోళనలకు కేంద్రబిందువైన ఇందిరాపార్కు వేదికపై నిషేధం విధించారు. ఇందిరాపార్క్ దగ్గర ఆందోళనకారులు చేరుకునేందుకు లేకుండా కేసీయార్ పదేళ్ళపాటు ప్రత్యేకంగా పోలీసులను కాపలాగ ఉంచారు.

ఇక ప్రభుత్వానికి సంబంధించి కేసీయార్ పాలనపై ప్రతిపక్షాలు చాలాసార్లే ఆందోళనలు చేశాయి. ప్రతిపక్షాలు ఆందోళనలు చేసినపుడల్లా రాష్ట్రాభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయంటు వాటిపై కేసీయార్ చాలాసార్లు నోరుపారేసుకున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల అవసరంలేదన్నట్లుగా చాలాసార్లు మాట్లాడారు. తన పాలనా వైఫల్యాలకు కూడా ప్రతిపక్షాలే కారణాలని నిందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. పంటలకు గిట్టుబాటు ధరలు రావటంలేదని ఖమ్మం, వరంగల్ రైతులు ఆందోళనలు చేసినపుడు వాళ్ళకి మద్దతుగా నిలబడిన ప్రతిపక్షాలను కేసీయార్ తో పాటు కేటీయార్, హరీష్ రావులు శాపనార్ధాలు పెట్టారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీయార్ ఆధ్వర్యంలో ప్రభుత్వమే ఆందోళనలు, దీక్షలు చేయటానికి మాత్రం ఇందిరాపార్క్ వేదికను ఉపయోగించుకున్నారు.

ఇందిరాపార్కు తనకు మాత్రమేనా ?

కేంద్రానికి వ్యతిరేకంగా తాను ఆందోళనలు చేసిన కేసీయార్ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసే అవకాశం మాత్రం ప్రతిపక్షాలకు ఇవ్వలేదు. తన పదేళ్ళ పాలనలో ప్రతిపక్షాలను, ప్రతిపక్ష నేతలపై ఎన్నోరకాలుగా అణిచివేతకు పాల్పడ్డారు. ఏ విషయంలో అయినా సరే తనను కలవటానికి ప్రతిపక్షాల నేతలు ప్రయత్నిస్తే అపాయిట్మెంట్ కూడా ఇవ్వలేదు. చివరకు సెక్రటేరియట్ లోకి ప్రతిపక్షాలను అనుమతించలేదు. ప్రతిపక్షాలను అంత చులకనగా చూసిన కేసీయార్ చివరకు ప్రజాగ్రహానికి గురై ప్రతిపక్షంలో కూర్చోవాల్సొచ్చింది. ప్రతిపక్షంలో కూర్చోగానే వెంటనే కేసీయార్ కు ప్రతిపక్షం విలువ, ప్రాధాన్యత గుర్తుకురావటమే విచిత్రంగా ఉంది. ప్రతిపక్షాలు బలంగా ఉంటేనే ప్రజాసమస్యలు పరిష్కారమవుతాయని చెప్పటమే విడ్డూరం. అంటే తాను అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షాలుండకూడదు. బీఆర్ఎస్ ఓడిపోతే మాత్రం ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకుంటున్నారు.

నైతిక అర్హత లేదు

ఇదే విషయమై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు ప్రతిపక్షాల గురించి, ప్రజాస్వామ్యంగురించి మాట్లాడే నైతిక అర్హత అసలు కేసీయార్ కు లేదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని గౌరవించని, ప్రజాస్వామ్యాన్ని అణిచివేసిన కేసీయార్ ఇపుడు ప్రతిపక్షం గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించటంలాగే ఉంటుందన్నారు. నిజంగానే కేసీయార్ కు ప్రజాస్వామ్యంపైన, చట్టంపైన అంత గౌరవం ఉంటే కాంగ్రెస్, టీడీపీ ఎంఎల్ఏలను తన పార్టీలోకి ఎలా లాక్కున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గంలోని సహచరులను కూడా ఏ విషయంలోను కేసీయార్ నోరిప్పనీయలేదన్న విషయాన్ని మురళి గుర్తుచేశారు. ప్రజాస్వామ్యం, ప్రతిపక్షం గురించి కేసీయార్ మాట్లాడటం పెద్ద జోక్ గా అభివర్ణించారు.

ప్రతిపక్షాలు ఉండకూడదన్నదే కేసీయార్


ఇదే విషయమై కాకతీయ యూనివర్సిటి రిటైర్డ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ కూరపాటి వెకంటనారాయణ మాట్లాడుతు తెలంగాణాలో ప్రతిపక్షాలను నిర్వీర్యంచేసిందే కేసీయార్ అన్నారు. ప్రజాస్వామ్యం గురించి కేసీయార్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. పదేళ్ళ పాలనలో ప్రతిపక్షాలను లేకుండా చేయాలని ప్రయత్నాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య బద్దంగా జరిగిన ఎన్నికల్లో టీడీపీని నామరూపాలు లేకుండా చేసిందే కేసీయార్ అన్నారు. జాతీయపార్టీ, తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ ఎంఎల్ఏలను లాక్కున్నదే కేసీయార్ అన్న విషయాన్ని ఎవరు మరచిపోరన్నారు. ప్రతిపక్షాలను అణచివేస్తు పదేళ్ళు రాష్ట్రాన్ని హిట్లర్ లాగ పాలించిన కేసీయార్ కూడా ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షాలు బలంగా ఉండాలని చెప్పటమే విచిత్రంగా ఉందన్నారు. తన పాలనాకాలంలో ఒక్కసారి కూడా ప్రతిపక్షాలతో అఖిలపక్ష సమావేశం పెట్టలేదన్న విషయాన్ని కూరపాటి ప్రస్తావించారు. కేసీయార్ దాష్టికాలను భరించలేక చివరకు ప్రజలే ఎన్నికల్లో ఓడించి కేసీయార్ కు బుద్ధిచెప్పారని కూరపాటి స్పష్టంచేశారు.

Tags:    

Similar News