మలయాళ సినీ పరిశ్రమలో మాదకద్రవ్యాల వినియోగంపై దర్యాప్తుకు ఆదేశాలు!
సినిమా షూటింగ్, సంబంధిత పనులు జరిగే ప్రదేశాలలో మాదక ద్రవ్యాలు, మద్యం విచ్చలవిడిగా వాడకాన్ని నిరోధించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
మలయాళ సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఇవాళ మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సిట్‌కు కేరళ హైకోర్ట్ మరో బాధ్యత అప్పజెప్పింది. సినిమా షూటింగ్, ప్రొడక్షన్ పనులు జరిగే ప్రదేశాలలో మాదక ద్రవ్యాలు, మద్యం విస్తృతంగా వాడటంపై కూడా దర్యాప్తు చేయాలని సిట్‌ను ఆదేశించింది. జస్టిస్ హేమ కమిటీ నివేదిక, సంబంధిత అంశాలపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(పిల్)ను విచారిస్తున్న కేరళ హైకోర్ట్ స్పెషల్ డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలను జారీ చేసింది. సినిమా షూటింగ్, సంబంధిత పనులు జరిగే ప్రదేశాలలో మాదక ద్రవ్యాలు, మద్యం విచ్చలవిడిగా వాడకాన్ని నిరోధించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
జస్టిస్ హేమ కమిటీ నివేదికను తాము పూర్తిగా చదివామని, కమిటీ నమోదు చేసిన అనేక సాక్షుల వాంగ్మూలాలను బట్టి చూస్తే తీవ్రమైన నేరాలు జరిగినట్లు తాము భావిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. అయితే బాధితుల పేర్లు, వివరాలు బయటకు తెలియకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని సిట్‌ను ఆదేశించింది.
కమిటీ ముందు వాంగ్మూలాలు ఇచ్చిన సాక్షులు ఎవరూ ఈ కేసు దర్యాప్తులో సహకరించటంలేదని, పోలీసులకు వాంగ్మూలాలు ఇవ్వటంలేదు అని సిట్ అధికారులు కోర్టుకు తెలుపగా, సాక్షులు విధిగా వాంగ్మూలాలు ఇవ్వాలని తాము చెప్పలేమని పేర్కొంది. సాక్షులు సహకరించనప్పుడు, కేసు దర్యాప్తులో ముందుకు వెళ్ళటానికి తగిన రుజువులు లేనప్పుడు బీఎన్ఎస్ఎస్(భారతీయ నాగరిక్ సురక్షా సంహిత చట్టం) లోని సెక్షన్ 176 కింద తగిన చర్యలు తీసుకోవాలని స్పెషల్ డివిజన్ బెంచ్ సూచించింది.
2017లో ఒక మలయాళ హీరోయిన్‌పై అత్యాచారం జరిగిన తర్వాత మళయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు, లోబరుచుకోవటాలపై అధ్యయనం చేయటానికి కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇటీవల బహిర్గతం అయిన తర్వాత పలువురు నటులు, దర్శకులపై లైెంగిక వేధింపుల ఆరోపణలు రావటంతో దీనిపై దర్యాప్తు చేయటానికి కేరళ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్ట్ 25న ఏడుగురు సభ్యులతో ఒక సిట్‌ను నియమించింది.