బీహార్: నితీష్ మంత్రివర్గంలో రాజకీయ వారసులు..

10 మందికి స్థానం కల్పించిన జేడీ(యూ) చీఫ్..

Update: 2025-11-22 13:35 GMT
Click the Play button to listen to article

బీహార్‌(Bihar)లో ఎప్పుడు ఎన్నికలొచ్చినా అటు బీజేపీ(BJP) కాని, ఇటు JD(U) నుంచి కాని వినిపించే మాట ఒక్కటే. ఆర్జేడీ(RJD) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని, కుటుంబ పాలన పార్టీలను దూరం పెట్టండని ఊదరగొడతారు.

కాని ప్రస్తుతం నితీష్ కుమార్(Nitish Kumar) క్యాబినెట్‌లో మంత్రులయిన కొంతమంది కుటుంబనేపథ్యాన్ని పరిశీలిస్తే వారంతా రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారేనని స్పష్టమవుతోంది. ఇదివరకు ఉపముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన పిల్లలేనని తేటతెల్లమవుతుంది.

నవంబర్ 20వ తేదీన ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్‌తో పాటు మరో 26 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో దాదాపు 10 మంది మంత్రులు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే.

బీజేపీ ఎమ్మెల్యేలు సామ్రాట్ చౌదరి, నితిన్ నబిన్, రామ నిషాద్, శ్రేయసి సింగ్, జేడీ (యూ) శాసనసభ్యులు విజయ్ కుమార్ చౌదరి, సునీల్ కుమార్, జేడీ(యూ) ఎమ్మెల్సీ నుంచి మంత్రి పదవి దక్కించుుకున్న అశోక్ చౌదరి ఉన్నారు. ఇక మిత్రపక్షాల కోటాలో హెచ్ఎఎం MLC సంతోష్ సుమన్, ఆర్ఎల్ఎం నాయకుడు దీపక్ ప్రకాష్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వీరంతా బీహార్‌లోని ప్రముఖ రాజకీయ కుటుంబాలకు చెందినవారు.


సామ్రాట్‌కు కీలక పాత్ర..

బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. తన కుటుంబానికి కంచుకోటగా ఉన్న తారాపూర్ నుంచి గెలుపొందారు. ఈయన తండ్రి, ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు, మాజీ మంత్రి అయిన శకుని చౌదరి ఇక్కడి నుంచే ఆరుసార్లు గెలుపొందారు. శకుని ఒకప్పుడు లాలూ ప్రసాద్, నితీష్ కుమార్ ఇద్దరికీ దగ్గరగా మెలిగారు. 1990 ప్రాంతంలో వచ్చిన సమతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో శకుని ఒకరు.

కుష్వాహా (కోయేరి) సామాజిక వర్గానికి చెందిన ఓబీసీ నేత అయిన సామ్రాట్ .. జనవరి 2024 నుంచి నవంబర్ 19, 2025 వరకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2005 నుంచి తాను నిర్వహించిన హోం శాఖను ఈ సారి నితీష్ సామ్రాట్‌కు అప్పగించారు. సామ్రాట్ ఎదుగుదల వెనక అమిత్ షా మద్దతు ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి కాకపోయినా..ఆర్జేడీ, జేడీ(యూ) సంయుక్త పాలన తర్వాత 2018లో బీజేపీలో చేరారని చెప్పారు. మోదీ సామ్రాట్‌ను " బడా ఆద్మీ " (పెద్ద మనిషి)ని చేస్తానని తారాపూర్ ర్యాలీలో షా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.


సంతోష్ సుమన్..

మరో రాజవంశీయుడు సంతోష్ సుమన్. ఇతను కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ పెద్ద కుమారుడు. HAM జాతీయ అధ్యక్షుడు అయిన సుమన్ 2000 సంవత్సరం నుంచి నితీష్ నేతృత్వంలోని ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో HAM ఆరు స్థానాల్లో పోటీచేసి ఐదింటిని గెలుచుకుంది. మాంఝీ కోడలు దీపా మాంఝీ, ఆయన కుమారుడి అత్త జ్యోతి మాంఝీ కూడా ఎమ్మెల్యేలే. ఇప్పటికీ మాంఝీ కుటుంబం నియంత్రణలో పార్టీ ఉంది.


దీపక్ ప్రకాష్..

మరో కొత్త మంత్రి, ఆర్‌ఎల్‌ఎంకు చెందిన దీపక్ ప్రకాష్. ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ క్యాబినెట్ బెర్త్‌ దక్కించుకున్నారు. ఈయన ఆర్‌ఎల్‌ఎం చీఫ్, మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా పెద్ద కుమారుడు. నవంబర్ 19 వరకు దీపక్ తల్లి, ససారాం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే అయిన స్నేహలతా కుష్వాహాకు మంత్రి పదవి ఇస్తారని ఊహాగానాలు వచ్చాయి. కానీ చివరి నిముషంలో పార్టీ దీపక్‌ను ఎంపిక చేసింది. ఆర్‌ఎల్‌ఎం పోటీ చేసిన ఆరు సీట్లలో నాలుగు సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు ఆర్‌ఎల్‌ఎం చీఫ్ ఉపేంద్ర కుష్వాహా రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయన భార్య ఎమ్మెల్యే. కుమారుడు మంత్రి అయ్యారు. మొదట్లో దీపక్‌ను మహువా స్థానం నుంచి పోటీ చేయించాలనుకున్నారు కుష్వాహా. కానీ ఎన్‌డీఏ సీట్ల పంపకాల్లో ఆ స్థానం ఎల్‌జెపి(ఆర్)కి వెళ్లిందని పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. దాంతో దీపక్‌కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చి మంత్రి పదవి కేటాయించారు.


నితిన్ నబిన్..

బీజేపీకి చెందిన నితిన్ నబిన్ మరో రాజవంశ కుటుంబీకుడు. ఇతను బీజేపీ మాజీ నేత నవీన్ కుమార్ సిన్హా కుమారుడు. 2005లో ఎన్డీఏ అధికారంలోకి రాకముందు సిన్హా, సుశీల్ కుమార్ మోదీ, అశ్విని కుమార్ చౌబేలతో పాటు బీజేపీకి చెందిన ప్రముఖ వ్యక్తులలో ఒకరు. నితీష్ మొదటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారం పగ్గాలు చేపట్టాక, తన తండ్రి ఆకస్మిక మరణం అనంతరం నితిన్ రాజకీయాల్లోకి వచ్చారు.


రమా నిషాద్..

రమా నిషాద్.. ఈమె బీజేపీ మాజీ ఎంపీ అజయ్ నిషాద్ భార్య. మాజీ కేంద్ర మంత్రి జై నారాయణ్ ప్రసాద్ నిషాద్ కోడలు కూడా. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయ వంశపారంపర్యం కారణంగా ఆమెకు క్యాబినెట్ బెర్తు దక్కింది.


శ్రేయసి సింగ్..

షూటర్ నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన శ్రేయసి సింగ్ ఎవరో కాదు. మాజీ కేంద్ర మంత్రి దిగ్విజయ్ సింగ్ కూతురు. సమతా పార్టీ కాలంలో నితీష్‌కు దగ్గరగా ఉంటూ ఐదుసార్లు ఎంపీగా పనిచేశారు. ఆమె తల్లి పుతుల్ సింగ్ కూడా గతంలో ఎంపీగా పనిచేశారు.


అశోక్ చౌదరి..

అశోక్ చౌదరి. జేడీ(యూ) మాజీ మంత్రి మహావీర్ చౌదరి కుమారుడు. అశోక్ చౌదరి నితీష్‌కు సన్నిహితుడు. జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ అశోక్ చౌదరిపై అవినీతి ఆరోపణలు చేసినా ఆయనను పార్టీలోకి తీసుకున్నారు. జేడీ(యూ)లో చేరడానికి ముందు కాంగ్రెస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగా పనిచేశారు.


విజయ్ కుమార్ చౌదరి..

సరైరంజన్ నుంచి గెలిచిన జేడీ(యూ) అభ్యర్థి విజయ్ కుమార్ చౌదరి కూడా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగదీష్ ప్రసాద్ చౌదరి కుమారుడు. రాజకీయ నాయకుడిగా మారిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ మాజీ మంత్రి చంద్రికా రామ్ కుమారుడు. మరో జేడీ(యూ) మంత్రి లెసి సింగ్.. 20 ఏళ్ల క్రితం కోర్టు గదిలో కాల్చి చంపిన సమతా పార్టీ నాయకుడు, గ్యాంగ్‌స్టర్ భార్య.


కుటుంబ పార్టీగా మిగిలిపోయిన ఆర్జేడీ..

ఆర్జేడీ కుటుంబ రాజకీయాల్లో మునిగిపోయింది. లాలూ ప్రసాద్ భార్య రబ్రీ దేవి ఎమ్మెల్సీ. ఆయన చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ ప్రతిపక్ష నాయకురాలిగా మారనున్నారు. పెద్ద కుమార్తె మీసా భారతి ఎంపీ. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మాజీ మంత్రి.


నిశాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా?

కానీ నితీష్ కుటుంబంలో ఇప్పటివరకు ఎవరూ రాజకీయాల్లోకి రాలేదు. ఆయన ఏకైక కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి వస్తారనే పుకార్లు కార్యరూపం దాల్చలేదు. అయితే NDA అఖండ విజయం తర్వాత నిశాంత్ రాజకీయాల్లోకి వచ్చి JD(U) బాధ్యతలు చేపట్టాలని మళ్ళీ డిమాండ్ బాగా వినిపిస్తుంది. నితీష్‌కు ఇప్పుడు 74 ఏళ్లు. ఇంకా రాజకీయ వారసుడిని పేర్కొనకపోవడంతో అందరి దృష్టి నిశాంత్‌పైనే ఉంది. రాజకీయ రాజవంశీయుల జాబితాలో నిశాంత్ పేరు కూడా చేరుతుందో, లేదో చూడాలంటే ఇంకాస్త సమయం వేచిచూడాలి. 

Tags:    

Similar News