హైదరాబాద్ హార్స్ రైడింగ్ క్లబ్‌కు వెళ్లొద్దాం రండి

హైదరాబాద్‌కు మొదటిసారి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. అదెలా? ఏమా కథ తెలుసుకోవాలంటే ఛల్ ఛల్ గుర్రం ఛలాకీ గుర్రం అంటూ పోలో అండ్ రైడింగ్ క్లబ్‌కు వెళ్లి రావాల్సిందే...

Update: 2024-03-07 02:08 GMT
POLO (Photo Credit : HPRC)

ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ ఏరీనా పోలో ఛాంపియన్‌షిప్ 2024 పోటీలకు మన హైదరాబాద్ నగరం వేదికగా నిలిచింది. నగర శివార్లలోని గండిపేట అజీజ్ నగర్ గ్రామంలోని హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్‌ వివిధ దేశాల పోలో క్రీడాకారులతో సందడిగా మారింది. మన తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ సౌజన్యంతో సాగుతున్న ఇంటర్నేషనల్ అరెనా పోలో ఛాంపియన్ షిప్ 2024 పోటీలు మార్చి 3వతేదీ నుంచి 10 వతేదీ వరకు 8 రోజుల పాటు జరుగుతున్నాయి. పోలో క్వార్టర్, సెమీస్, కన్సోలేషన్, ఫైనల్స్ పోటీలు ప్రేక్షకుల సందడి మధ్య సాగుతున్నాయి. ఈ పోటీల్లో మొట్టమొదటి సారి అమెరికా దేశానికి చెందిన రెండు పోలో జట్లు, లక్సెంబర్గ్,స్పెయిన్ దేశాలకు చెందిన పోలో జట్లు పాల్గొంటుండటం విశేషం. ఈ అంతర్జాతీయ పోలో ఛాంపియన్‌షిప్ పోటీల్లో మన దేశానికి చెందిన రెండు జట్లు పాల్గొంటున్నాయి. న్యూఢిల్లీ, జైపూర్, నోయిడా, బెంగళూరు నగరాల్లో సాగే ఈ అంతర్జాతీయ పోలో ఛాంపియన్‌షిప్ పోటీలు నేడు హైదరాబాద్ నగరానికి విస్తరించాయి. ఈ టోర్నికి చెందిన జెర్సీని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై ఆవిష్కరించారు.


పోలో ఎలా ఆడతారు అంటే...
గుర్రంపై కూర్చొని స్వారీ చేస్తూ జట్టుగా ఆడే అటే పోలో. ఈ ఆటలో ప్రత్యర్థి జట్టుకు వ్యతిరేకంగా గోల్ చేయడమే లక్ష్యం. ఆటగాళ్లు ఒక చిన్న తెల్లటి ప్లాస్టిక్ బంతిని ప్రత్యర్థి జట్టు గోల్‌లో వేయడం ద్వారా స్కోర్ చేస్తారు. దీనికి ఒక పొడుగైన పిడి కలిగిని మేలట్‌ను వాడుతారు. సంప్రదాయక పోలో ఆటను పచ్చగడ్డి ఉన్న మైదానంలో ఆడుతారు. ప్రతి పోలో జట్టులో నలుగురు ఆటగాళ్లు గుర్రాలపై స్వారీ చేస్తూ ఉంటారు.మధ్య ఆసియాలోని ఇరాన్‌కు చెందిన ప్రజలు ఆడే ఈక్వెస్ట్రియన్ ఆటల నుంచి ఈ పోలో క్రీడ ఉద్భవించింది.



 గుర్రాలపై పెరిగిన ఆసక్తి...

పోలో క్రీడను నలుగురు ఆటగాళ్లతో కూడిన రెండు జట్లు గుర్రంపై స్వారీ చేస్తూ అడుతుంటారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన పోలో జట్లతో హైదరాబాద్ నగరంలో నడుస్తున్న పోటీలతో ఇండియన్ పోలో సీజన్ సందడి ప్రారంభమైంది. ఈ పోలో పోటీలతో గుర్రాలపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఎందరో ఔత్సాహికులైన ప్రేక్షకులు పోలో క్రీడను చూస్తూ మైమరచిపోతున్నారు. రాజుల క్రీడ అయిన పోలోకు హైదరాబాదీలు స్వాగతం పలుకుతున్నారు. గుర్రాలను పరుగెత్తిస్తూ సాగుతున్న ఈ పోలో క్రీడల్లో అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా పాల్గొంటున్నారు.



 ఆరు పోలో జట్ల మధ్య పోరు

ఇండియా పోలో టీమ్ 1 లో మహ్మద్ అర్సలాన్ ఖాన్, చైతన్య ఆర్ కుమార్, మహమ్మద్ నయీముద్దీన్, యన్నపల్లి ఆనంద్ ఉన్నారు. ఇండియా టీమ్ 2లో యూసుఫ్ ఆజ్మీ, సయ్యద్ షహబాజ్ అహ్మద్, కౌశిక్ కుమార్, మీర్జా ముహమ్మద్ బేగ్ లున్నారు. యునైటెడ్ స్టేట్స్ నుంచి ఈ పోటీల కోసం రెండు జట్లు పోలో జట్లు వచ్చాయి. యూఎస్ఏ టీం1లో స్లోన్ స్టెఫాన్ కిస్, మెగాన్ ఫిలిన్, జాకీ క్లెంటెనెర్, యూఎస్ఏ టీం2లో కరోలిన్ విస్సర్స్, ఎలిజబెత్ పెక్, డార్న్ కాక్స్, లూకీ క్లెంటెనర్ లు ఆడుతున్నారు. లక్సెంబర్గ్ జట్టులో కాం స్మిత్, అలెగ్జాండర్ లూడార్ఫ్, విషాల్ సింగ్, స్పెయిన్ పోలో జట్టులో మటియో అల్వరెజ్ ఉర్బి, పంచో అకొష్టా, పాల్ పెజ్జుట్టిలు ఆడుతున్నారు. పోలో అంతర్జాతీయ పోటీల ముగింపు కార్యక్రమం ఈ నెల 10వతేదీన జరగనుంది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారని రైడింగ్ క్లబ్ కార్యదర్శి రియాజ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



 పురాతన కాలం నుంచే పోలోకు హైదరాబాద్ కేంద్రం

పోలో క్రీడను భారతదేశంలోని హైదరాబాద్‌లో మొట్ట మొదటి పోలో సీజన్ 1878వ సంవత్సరంలో జరిగింది.అప్పట్లో హైదరాబాద్‌లో జరిగిన టోర్నమెంట్‌లో ప్రతిష్ఠాత్మకమైన బాంబే ప్రెసిడెన్సీ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. సికింద్రాబాద్‌లో ఉన్న బ్రిటిష్ అశ్విక దళ రెజిమెంట్‌ వారి స్వంత పోలో టీమ్‌ను ప్రారంభించింది. లార్డ్ కిచెనర్, సర్ విన్‌స్టన్-చర్చిల్, ది డ్యూక్ ఆఫ్ విండ్సర్, తర్వాత ప్రిన్స్ ఆఫ్ వేల్స్, ఎర్ల్ మౌంట్ బాటన్ వంటి ప్రముఖులు కూడా హైదరాబాద్‌లో పోలో ఆడారు. హెచ్.హెచ్. నిజాం 6, పైగా అమీర్, నవాబ్ సాలార్ జంగ్, సర్ అఫ్సర్-ఉల్-ముల్క్, ఫక్రుల్ ముల్క్ అనే రాజులు పోలో క్రీడను ప్రోత్సహించారు. దీంతో హైదరాబాద్ పోలోకు ప్రధాన కేంద్రంగా మారింది. అప్పట్లో హైదరాబాద్ నగరంలో 17 పోలో మైదానాలుండేవి.


హైదరాబాద్‌లో ఎన్నెన్నో పోలో మైదానాలు
హైదరాబాద్, బొంబాయి, బెంగళూరు, మద్రాస్‌లో జరిగిన అన్ని ప్రధాన పోలో టోర్నమెంట్‌లలో మన గోల్కొండ జట్టు విజయం సాధించింది. హైదరాబాద్‌లో 17 పోలో మైదానాలు ఉండటంతో ప్రతిరోజూ పోలో ఆడేవారు.దీంతో ఈ ఆట ప్రజాదరణ పొందింది. నగరంలోని ఫతే మైదాన్ పోలో గ్రౌండ్, సికింద్రాబాద్, ఫలక్‌నుమా ప్యాలెస్, మలక్‌పేట్ ప్రాంతాల్లో పోలో మైదానాలుండేవి. అయితే మలక్‌పేట మైదానం రేస్‌కోర్స్ గా మారింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, అశ్వికదళ రెజిమెంట్లను యాంత్రికీకరించారు. దీంతో గుర్రాల స్థానంలో జీపులు,యుద్ధ ట్యాంకులు రావడంతో పోలోకు ఎదురుదెబ్బ తగిలింది. అయినా అప్పటి ప్రభుత్వ సహకారంతో పోలో క్రీడ ప్రేమికులు 1956వ సంవత్సరంలో ఆంధ్ర‌ప్రదేశ్ రైడింగ్ క్లబ్‌ను స్థాపించారు.

లక్సెంబర్గ్‌ జట్టుపై భారత్-2 విజయం
హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్‌లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్-2 జట్టు లక్సెంబర్గ్‌పై ఇంటర్నేషనల్ ఎరీనా పోలో ఛాంపియన్‌షిప్‌లో తిరుగులేని విజయం సాధించి తమ సత్తాను చాటింది. కౌశిక్ కుమార్ యొక్క అత్యుత్తమ ప్రదర్శనతో భారతదేశం-2 జట్టు మైదానంలో ఆధిపత్యం చెలాయించింది. చివరికి 15-5 స్కోర్‌లైన్‌తో లక్సెంబర్గ్‌పై విజయం సాధించింది. కౌశిక్ కుమార్ యొక్క అద్భుతమైన ఆటతీరుతో ఏడు గోల్‌లను సాధించారు. కౌశిక్ ప్రయత్నాలకు మద్దతుగా యూసుఫ్, సయ్యద్ షాబాజ్ అహ్మద్,మీర్జా మహమ్మద్ బేగ్ కొన్ని గోల్‌లు సాధించి సహకరించారు.

గుర్రపుస్వారీ చేయాలంటే...
గుర్రపు స్వారీని ఆస్వాదించాలనుకున్నా, పోలో క్రీడను నేర్చుకోవాలనుకున్నా హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్‌ బాసటగా నిలుస్తుందని పోలో క్రీడాకారుడు ఫయాజుద్దీన్ చెప్పారు. తనకు గుర్రపు స్వారీ అంటే ఎంతో ఇష్టమని, అందుకే స్వారీ చేయడంలో శిక్షణ పొందానంటారు హైదరాబాద్ టెక్ వర్క్ కు చెందిన రాఘవేంద్ర బాణూరు. అద్భుతమైన గుర్రాలపై స్వారీ చేయడంలో ఉన్న థ్రిల్ మరవలేనిదంటారు రాఘవేంద్ర. కల్నల్ షా మీర్జా బేగ్ హైదరాబాద్‌లో అత్యుత్తమ పోలో ప్లేయర్. ఇతను ప్రపంచంలోని గొప్ప పోలో ఆటగాళ్లలో ఒకరిగా నిలిచారు.


ఛల్ ఛల్ గుర్రం చలాకీ గుర్రం అంటూ చిన్నారుల హార్స్ రైడింగ్
హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్‌లో చిన్నారులు కూడా గుర్రపుస్వారీ నేర్చుకుంటున్నారు. ఛల్ ఛల్ గుర్రం చలాకీ గుర్రం అంటూ చిన్నారుల హార్స్ రైడింగ్ చేస్తుండటం ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది. అంతర్జాతీయ పోలో ఛాంపియన్ షిప్ పోటీలతో హైదరాబాద్ నగరంలో హార్స్ రైడింగ్ పై పిల్లల్లో మక్కువ పెరిగింది. నిపుణులైన బోధకులు పిల్లలకు హార్స్ రైడింగ్ పాఠాలు చెబుతున్నారు. నగరంలో చిన్నారులకు హార్స్ రైడింగ్ లో శిక్షణ ఇవ్వడంతోపాటు సమర్ధులైన పోలో క్రీడాకారులను తమ క్లబ్ తయారు చేస్తుందని రైడింగ్ క్లబ్ కార్యదర్శి రియాజ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

హైదరాబాద్ రైడింగ్ క్లబ్ ప్రస్థానం
హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ (హెచ్‌పీ‌ఆర్‌సీ) 2005 సంవత్సరంలో పునరుద్ధరించారు. నాటి నుంచి ప్రతీ ఏటా హైదరాబాద్ నగరంలో పోలో,ఈక్వెస్ట్రియన్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. హైదరాబాద్ రైడింగ్ క్లబ్ దేశవ్యాప్తంగా పలు టోర్నమెంట్‌లను గెలుచుకుంది. రాయల్ వెస్ట్రన్ ముంబై, ఇండియన్ ఓపెన్ ఛాంపియన్‌షిప్ ను కైవసం చేసుకుంది.మన రాష్ట్రం వెలుపల జరిగిన పోలో టోర్నమెంట్‌లలో పాల్గొనడమే కాకుండా,ఏటా హైదరాబాద్‌లో జాతీయ పోలో సీజన్‌ను కూడా రైడింగ్ క్లబ్ నిర్వహిస్తుంది. ఈ క్లబ్ 2014 సంవత్సరం నుంచి షో జంపింగ్, డ్రస్సేజ్ అండ్ హ్యాక్స్ వంటి ఈక్వెస్ట్రియన్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 12 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ రైడింగ్ క్లబ్ ప్రస్థుతం అంతర్జాతీయ ఏరీనా పోలో ఛాంపియన్‌షిప్ 2024 నిర్వహిస్తోంది. ప్రస్థుతం రైడింగ్ క్లబ్ లో స్వారీకి ఉపయోగించే 170 మేలు జాతి గుర్రాలున్నాయి.

ఎందరో సినీప్రముఖులు హార్స్ రైడర్స్...
మన టాలీవుడ్ కు చెందిన ఎందరో సినీనటులు హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ లో సభ్యులుగా ఉన్నారు. సినీ హీరోల్లో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, గోపిచంద్, తారక్, అమల తదితరులు హార్స్ రైడింగ్ క్లబ్ సభ్యత్వం తీసుకున్నారు. సినీనటులే కాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ రైడింగ్ క్లబ్ సభ్యుడు కావడం విశేషం. గుర్రపు స్వారీ చేయడం అంటే ప్రముఖ సినీనటుడు రాంచరణ్ కు ఎంతో ఇష్టం. రాంచరణ్ గతంలో ఓ గుర్రాన్ని సైతం కొన్నారు. హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ యజమానులు కావడంతో పోలో పోటీలకు రాంచరణ్, భార్య ఉఫాసన వచ్చారు.


ఎన్నెన్నో విజయాలు...
హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ పలు విజయాలు సాధించింది. 2013వ సంవత్సరం మార్చి నెలలో హెచ్‌పీ‌ఆర్‌సీ పోలో జట్టు అమెచ్యూర్స్ రైడింగ్ క్లబ్ కప్ ముంబై ను కైవసం చేసుకుంది. 2013లో రేమండ్స్ కప్ ముంబై,2012వ సంవత్సరంలో బెంగుళూరులో అరేనా పోలో ఛాంపియన్‌షిప్,సీఎం కప్ – 6 గోల్,ఆర్మీ కమాండర్స్ కప్,ఇండియన్ ఓపెన్ ఛాంపియన్‌షిప్, ప్రిన్స్ ఆఫ్ బెరార్ కప్,ప్రిన్స్ ఆఫ్ బెరార్ కప్, నవాబ్ ఆఫ్ పటౌడీ కప్, ఢిల్లీ ఆర్ఎంఆర్ఎం ట్రోఫీ,మాస్టర్స్ కప్ కోల్‌కతాలను హైదరాబాద్ రైడింగ్ క్లబ్ సాధించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన పోలో మైదానంలో మేలుజాతి గుర్రాలపై హార్స్ రైడింగ్ చేస్తూ హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు పోలో క్రీడాకారులు అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించి పెట్టారు.




Tags:    

Similar News