‘మెడిగడ్డ’ పొట్ట విప్పిచూడు పురుగులుండు

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో జరిగిన లొసుగులను వెల్లడిస్తున్న విజిలెన్స్ విచారణ

Update: 2024-02-08 02:05 GMT
Madigadda barrage

గోదావరి నది మీద గత ప్రభుత్వం ఎంతో ప్రతష్టాత్మకంగా నిర్మించిన  మేడిగడ్డ కూలిపోతున్న ఆందోళన మొదలయింది. విచారణ సాగే కొద్ది మేడిగడ్డ   బ్యారేజి ఒక మేడిపండు తేలిపోతున్నది. ఈ  బ్యారేజీలో గత ఏడాది కుంగిన 7తోపాటు ప్రభావితమైన 6,8 బ్లాకులను ఎల్ అండ్ టీ కాకుండా సబ్ కాంట్రాక్టరు నిర్మించారని విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. కాంట్రాక్టర్ కట్టకుండా సబ్ కాంట్రాక్టర్ కట్టేందుకు కారణమెవరు? ఈ సబ్ కంట్రాక్టర్ ఎవరు? వాళ్లుకు ఎవరు అనుమతిచ్చారు.  అన్నీ ప్రశ్నలే.

 ఈ నేపథ్యంలో గత ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలో ఇరిగేషన్ రంగంలో కీలకపాత్ర పోషించిన ఇద్దరు సీనియర్ అధికారులు, ఇ ఎన్ సి లు నల్లా వెంకటేశ్వర్లు, మురళీ ధర్ రావులను   నిన్న తొలగించడం విచారణలో ఒక కీలకమయిన మలుపు.

మొత్తానికి మేడిగడ్డ బ్యారేజి కూలిపోతుందని విచారణలో తెేలింది. ఈ విషయాన్ని ఎవరో కాదు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డియే వెల్లడించారు.

బుధవారం నాడు సూర్యాపేట జిల్లా కోదాడలో  ఒక సమావేశంలో మాట్లాడుతూకెసిఆర్ ప్రభుత్వం కట్టిన మరొక ప్రాజక్టు అన్నారం కూడా ముప్పు ఎదుర్కొంటూ ఉందని కూడా ఆయన వెల్లడించారు.   

మేడిగడ్డ బ్యారేజీకి చెందిన  పిల్లర్లు కొన్ని గత ఏడాది అక్టోబరు 21వతేదీన కుంగిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల క్యాంపెయిన్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఈ ప్రమాదం జరగడం భారత రాష్ట్ర సమితి ఓడిపోయేందుకు దారి తీసిన కారణాలలో ఒకటని చెబుతారు. మేడిగడ్డ బ్యారేజ్ గత ముఖ్యమంత్రి కెసిఆర్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిర కాళేశ్వరం  ప్రాజక్టులో భాగం.ఎన్నికల ప్రచారం లో కెసిఆర్ ప్రధానంగా కాళేశ్వరం గురించే మాట్లాడుతూ వచ్చారు. అయితే, కేంద్ర మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నద్దా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  మాత్రం ఈ ప్రాజక్టు అవినీతి, అది కెసిఆర్ కు ఎటిఎం గా ఉపయోగపడిందని చెబుతూ వచ్చారు.  పిల్లర్లు కూలిపోవడంతో అవినీతి ఆరోపణలకు ఊతం వచ్చింది. ఇపుడు విజిలెన్స్ అవినీతి, ఎటిఎం అనేది నిజమేనా అనేలా ఆశ్చర్యకరమయిన విషయాలు వెల్లడవుతున్నాయి.

విజిలెన్స్ విచారణ విస్మయాలు

 బ్యారేజీ దిగువ భాగంలో సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు దెబ్బతిన్నాయని దీనివల్ల డౌన్ స్ట్రీమ్ వెంట్ లు, సీసీ ఆఫ్రాన్లు, స్టోన్ ఆఫ్రాన్లు దెబ్బతిన్నాయని విజిలెన్స్ నివేదిక పేర్కొంది.

బ్యారేజీ నిర్మాణపనులు పూర్తి అయిన తేదీలలో కూడా స్పష్టత లేదు. వేర్వేరు తేదీలతో రికార్డులు దర్శనమిచ్చాయి. పూర్తి అయిన తేదీ చెల్లింపులకే కాదు, మరమ్మతులకు  సంబంధించి చాలా ముఖ్యమయిన తేదీ. ప్రాజక్టు  2020జూన్ లో పూర్తయిందని ఎల్ అండ్ టి చెబుతూ ఉంది.రికార్డులో అనేక తారీఖలున్నాయి.  2019 జూన్ 12, సెప్టెంబర్ 10 అని, మరొక చోట 2020 ఫిబ్రవరి 15 అని అధికారులు తమ ఇష్టమొచ్చినట్లు రాసుకున్నట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడయింది. ఒక వైపు ఎల్ అండ్ టి నిర్మాణ పూర్తయిందని చెబుతూ ఉంది. మరొక వైపు రికార్డులలో పూర్తికాలేదని ఎల్ అండ్ టి పేర్కొంది.ఈ తేదీలు కుంగిన బ్లాక్ లను ఎవరు రిపేర్ చేయాలనేదాన్ని నిర్ణయించేందుకు పనికొస్తాయి.

అయితే తాము నీటిపారుదల శాఖ అధికారులను డ్రాయింగ్ లు ఇవ్వాలని కోరినా వారు ఇవ్వక పోవడంతో తాము మరమ్మతు పనులు చేయలేక పోయామని ఎల్ అండ్ టి నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొంది. నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడానికి వీలుగా బ్యారేజీ రీ డిజైన్లు చేయాల్సి ఉండగా దానికి నిర్మాణసంస్థ నిరాకరించిందని విజిలెన్స్ అధికారుల పరిశీలనలో తేలింది. పునరుద్ధరణ పనులు చేయాలంటే మళ్లీ ఒప్పందం చేసుకోవాలని ఎల్ అండ్ టి కోరింది. 

పెరిగిన ప్రాజెక్టు అంచనా వ్యయం


మేడిగడ్డ బ్యారేజీ అంచనాలను పెంచడంతోపాటు కనీస నిర్వహణ చేపట్టలేదని విజిలెన్స్ నివేదికలో పేర్కొంది.మొదట రూ.,185332కోట్లతో మేడిగడ్డ బ్యారేజీని నిర్మించాలని నిర్ణయించగా 2016 మార్చి 1వతేదీన రూ.2591కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. మళ్లీ 2018మే 19వ తేదీన ఈ అంచనాలను రూ.3260కోట్లకు, 2021 సెప్టెంబరు 6వతేదీన రూ.413 కోట్లకు పెంచారని విజిలెన్స్ తెలిపింది. నిర్ణీతసమయంలో బ్యారేజీ నిర్మాణం పూర్తి అయినప్పటికీ అంచనా వ్యయం మాత్రం 133.67 శాతం పెంచారని విజిలెన్స్ అధికారులు తేల్చిచెప్పారు.


విచారణకు నిపుణుల కమిటీ


బ్యారేజీ కుంగిపోయాక జాతీయ డ్యామ్ సేఫ్టీ అధారిటీకి చెందిన ఆరుగురు నిపుణుల బృందం వస్తే వారికి తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు పూర్తి సమాచారం ఇవ్వలేదు.గత ఐదేళ్ల కాలంలో మేడిగడ్డ పంపు హౌస్ నుంచి 900 టీఎంసీల నీటిని ఎత్తిపోయాల్సి ఉండగా కేవలం 162 టీఎంసీల నీటినే ఎత్తిపోశారని నివేదిక తెలిపింది. బ్యారేజీ కుంగుబాటుకు కారణాలు తెలుసుకునేందుక నిపుణుల కమిటీని నియమించాలని విజిలెన్స్ అధికారులు సిఫారసు చేశారు. మేడిగడ్డ బ్లాక్ 7 పనులు క్రమపద్ధతిలో జరగలేని వెల్లడైంది.

ప్రాజెక్టుల లోపాలపై సర్కారు శ్వేతపత్రం

బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం ఆయకట్టు భూములకు సాగునీరందించడానికి కాకుండా అనుచిత ప్రయోజనాల కోసం చేపట్టారని కాంగ్రెస్ సర్కారు ఆరోపించింది. ప్రాజెక్టుల నిర్మాణంలో లోపాలు, వైఫల్యాలపై కాంగ్రెస్ సర్కారు శ్వేతపత్రాన్ని సిద్ధం చేశారు. గతంతోపాటు 2014 నుంచి 2023 వరకు నీటిపారుదల రంగంపై వెచ్చించిన నిధులు, సాగులోకి వచ్చిన ఆయకట్టు వివరాలతో శ్వేతపత్రాన్ని సిద్ధం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం రూ.93,872 కోట్లు వెచ్చించగా, కేవలం 98వేల ఎకరాలకే సాగునీరు ఇచ్చారని గుర్తించారు.

ప్రాజెక్టుల నిర్మాణలోపాలు, కాగ్, విజిలెన్స్ నివేదికలపై అసెంబ్లీలో చర్చ

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణ జరిపిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తన నివేదికను జనవరి 29వతేదీన ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కాగ్ నివేదిక కూడా అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయనున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టనున్న శ్వేత పత్రం, కాగ్ నివేదిక, విజిలెన్స్ మధ్యంతర నివేదిక, కృష్ణాప్రాజెక్టుల జల వివాదాలపై గురువారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి చర్చ జరగనుంది.

ఇద్దరు ఇరిగేషన్ ఈఎన్సీలపై సర్కారు వేటు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతి, అక్రమాలపై కాంగ్రెస్ సర్కారు సీరియస్ అయింది. రామగుండం నీటిపారుదల శాఖ ఈఎన్‌సి నల్లా వెంకటేశ్వర్లును సర్కారు తొలగించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, మూడు పంపుహౌస్ లు వెంకటేశ్వర్లు హయాంలోనే జరిగాయని, వీటి నిర్మాణంలో అక్రమాలపై బాధ్యుడిగా తేల్చి అతన్ని ఉద్యోగం నుంచి సర్కారు తొలగించింది. 2013వ సంవత్సరంలో పదవీ విరమణ చేసినా కొనసాగుతున్న మురళీధర్ రావును రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. కృష్ణా ప్రాజెక్టుల వివాదానికి కారణమైన మురళీధర్ రావును రాజీనామా చేయాలని సర్కారు కోరింది.

మొత్తంమీద గురువారం నుంచి జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రాజెక్టులు నిర్మాణ లోపాలపై ఆసక్తికర చర్చలు జరగనున్నాయి.

Tags:    

Similar News