పేద విద్యార్థులకు లెక్కల మాస్టారి ఉచిత వీడియో పాఠాలు
‘‘సొంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడుపడవోయ్’’అన్న గురజాడ మాటలను అనుసరిస్తూ పేద విద్యార్థులకు ఉచితంగా గణితం పాఠాలు చెబుతున్నారు లెక్కల మాస్టారు శరత్ చంద్ర.
By : Saleem Shaik
Update: 2024-07-27 18:36 GMT
హైదరాబాద్ నగరంలోని నల్లకుంట శివం రోడ్డులో ఉన్న లెక్కల మాస్టారు కొంపెల్లి శరత్ చంద్ర గత 35 ఏళ్లుగా ఇంటర్ విద్యార్థులకు గణితం బోధిస్తున్నారు.తనకు దేవుడు ఇచ్చిన విజ్ఞానాన్ని ఉచితంగా పేద విద్యార్థులకు అందించాలనే ఉన్నతాశయంతో గణిత పాఠాలను వీడియో తీయించి వాటిని అందుబాటులోకి తీసుకువచ్చారు.ఎందరో విద్యార్థులకు గణిత పాఠాలు చెప్పడంతో పాటు వందమంది విద్యార్థులను ఐఐటీకి పంపిన ఘనత శరత్ చంద్రది. అధ్యాపకుడిగా తన జర్నీ గురించి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
35 ఏళ్లుగా విద్యార్థులకు గణితం పాఠాలు
‘‘నా స్వస్థలం వరంగల్ జిల్లా.ఖమ్మంలో డిగ్రీ వరకు చదివి హైదరాబాద్ వచ్చి ఉస్మానియా యూనివర్శిటీలో పోస్టుగ్రాడ్యుయేషన్ చేశాను. ఓయూలో పీజీలో 4వ ర్యాంకు సాధించాను. నేను పీజీ చదువు పూర్తయ్యాక గణితంలో అధ్యాపకుడిగా ఏడేళ్ల పాటు నారాయణ జూనియర్ కళాశాలలో పనిచేశాను.ఇంటరుమీడియెట్ తోపాటు జేఈఈ మెయిన్స్, అడ్వాన్సుడ్,ఎంసెట్, బిట్ శాట్ పరీక్షలకు గణిత పాఠాలు చెబుతున్నాను. అనంతరం నల్లకుంట శివం రోడ్డులో శరత్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నాను. నాకు లభించిన విజ్ఞానాన్ని విద్యార్థులకు చెప్పాలనే లక్ష్యంతో గత 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను.’’
వంద మందికి పైగా విద్యార్థులకు ఐఐటీ సీట్లు
‘‘గణితంలో విద్యార్థులకు పాఠాలు చెప్పడం వల్ల నా కళాశాల నుంచి వందమందికి పైగా ఐఐటీ సీట్లు లభించాయి. పేద విద్యార్థులకు కూడా ఉచితంగా పాఠాలు చెప్పాలనే ఉన్నతాశయంతో నేను గణిత పాఠాలను బోధిస్తూ, దాన్ని వీడియోలు తీయించి వాటిని ఆన్ లైన్ వెబ్ సైట్ లో పోస్టు చేస్తున్నాను. పేద విద్యార్థులకు ఉచితంగానే పాఠాలు చెప్పడమే కాకుండా వారి సందేహాలను తీరుస్తూ గణితంలో విద్యార్థులు అధిక మార్కులు సాధించేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. విద్య వ్యాపారంగా మారిన నేటి తరుణంలో నాకున్న విజ్ఞానాన్ని విద్యార్థులకు బోధించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను.’’
కరోనా సమయంలో వీడియో పాఠాలు
‘‘కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో విద్యార్థులకు వీడియో పాఠాలు చెప్పేవాడిని. మా కళాశాల విద్యార్థులే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్థులకు కూడా తన వీడియో పాఠాలు చేరాలనే లక్ష్యంతో నా వద్ద చదువుకున్న విద్యార్థి అర్వింద్ సహాయంతో గణిత పాఠాల బోధనను వీడియో తీయించాను. గణిత వీడియో పాఠాలను శరత్ ఆన్ లైన్ క్లాసులు పేరిట వెబ్ సైట్ ప్రారంభించి అందులో యూట్యూబ్ పాఠాలు పోస్టు చేశాను. నా వీడియో పాఠాలు వేలాది మంది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ’’
రికార్డెడ్ వీడియో క్లాసులు
‘‘నేను చేసిన రికార్డెడ్ వీడియో క్లాసులు జేఈఈ పరీక్షల కోసం కోచింగ్ కు ఉపయోగపడుతున్నాయి.ఇంటరు ఫస్ట్ ఈయర్, సెకండ్ ఈయర్ తోపాటు జేఈఈ విద్యార్థులకు 425 బెస్ట్ పాపులర్ వీడియోలు ఆన్ లైన్ లో పోస్టు చేశాను.’’
విద్యా బోధనలోనే సంతృప్తి
‘‘విద్యార్థులు అందరికీ నాణ్యమైన విద్యను అందించడంలోనే నాకు సంతృప్తి లభిస్తుంది. చాలా మంది విద్యార్థులు మీ ఆన్ లైన్ గణిత పాఠాల వల్ల మేం మంచి మార్కులు సాధించామని ఫోన్లు చేసి చెబుతుంటారు. అలా విద్యార్థుల ప్రశంసలతో మరింత మందికి నా గణిత పాఠాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. లాక్ డౌన్ సమయంలో నేను ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా వివిధ కాన్సెప్ట్‌లను బోధించాను. శరత్ జూనియర్ కళాశాల విద్యార్థులే కాకుండా మారుమూల ప్రాంతాల్లోని చాలా మంది పేదవిద్యార్థులు గొప్ప ప్రయోజనం పొందారు.గణితాన్ని సులభంగా అర్థమయ్యేలా బోధిస్తున్నాను. విద్యార్థుల సందేహాలు తీరుస్తుంటాను.పదిమంది విద్యార్థులకు ఉపయోగపడాలన్నదే నా లక్ష్యం.నాకున్న గణిత పరిజ్ఞానాన్ని విద్యార్థులకు ఉపయోగపడాలన్నదే నా జీవిత లక్ష్యం. దీని కోసం నా వంతు కృషి చేస్తూనే ఉంటాను’’అని ముగించారు లెక్కల మాస్టారు శరత్ చంద్ర. ఆన్ లైన్ వీడియో పాఠాల కోసం https://www.sarathonlineclasses.com ను క్లిక్ చేయండి.