హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఎంబీటీ దూరం
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీకి ఎంబీటీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. తమ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఎంబీటీ ప్రకటించింది.
By : The Federal
Update: 2024-04-25 09:04 GMT
హైదరాబాద్ పాత నగరంలో మజ్లిస్ పార్టీ తర్వాత మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ)కి బలముంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యాకుత్‌పురా నుంచి పోటీ చేసి ఎంబీటీ అభ్యర్థిగా అంజదుల్లాఖాన్ పోటీ చేసి సత్తా చాటారు. ఏఐఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్ మెరాజ్ విజయం సాధించినా, ఎంబీటీ అభ్యర్థి ఖాన్ కేవలం 880 ఓట్ల తేడాతో ఓడిపోయారు.సమాజం కోసం తాము త్యాగం చేసేందుకే హైదరాబాద్‌లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని ఎంబీటీ పార్టీ అధ్యక్షుడు ఫర్హతుల్లా ఖాన్ తెలిపారు. మొదట్లో పార్లమెంటు బరిలో దిగాలని యోచించినా, ఆలోచించి పోటీ చేయకూడదని ఆ పార్టీ నిర్ణయించింది. ఎంబీటీ నేతలందరితో సంప్రదింపులు జరిపి ఈ నిర్ణయానికి వచ్చామని ఫర్హతుల్లా ఖాన్ తెలిపారు.
హైదరాబాద్ పరిస్థితుల దృష్ట్యా పోటీ నుంచి వైదొలిగాం...
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంబీటీ అభ్యర్థి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే తమకు దాదాపు 2 లక్షల ఓట్లు సులువుగా వస్తాయని ఫర్హతుల్లా ఖాన్ చెప్పారు. కాని తమ కార్యకర్తలు పోటీ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారని, అందుకే సమాజం కోసం తాము ఎన్నికల బరి నుంచి తప్పుకున్నామని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లా ఖాన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుత దేశవ్యాప్త, హైదరాబాద్ స్థానిక పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని ఖాన్ చెప్పారు. సమాజం ఐక్యంగా ఉండి మతతత్వ శక్తులను ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. ఓట్లు చీలితే బీజేపీ బలపడుతుందని ఖాన్ చెప్పారు.
కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ వలీవుల్లా సమీర్ ప్రచారం ప్రారంభం
హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ వలీవుల్లా సమీర్ గురువారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా ప్రచారాన్ని ఆరంభించారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాసయాదవ్ పేరు ప్రకటించినా, ఆ పార్టీ ప్రచారం జోరందుకోలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీతో మజ్లిస్ కు రహస్య అవగాహన ఉంది. అయితే ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మజ్లిస్ ఎప్పుడై అధికార పార్టీలతో కలిసి ఉంటోందని గత పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. గతంలో అసదుద్దీన్ ఒవైసీ సీఎం రేవంత్ రెడ్డితో వేదిక పంచుకోవడం, సీఎంతో కలిసి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సమీక్షా సమావేశాల్లో పాల్గొనడాన్ని చూస్తే అధికార కాంగ్రెస్ పార్టీ కూడా మజ్లిస్ తో రహస్య ఒప్పందం ఉందని విదితమవుతుందని పాతబస్తీకి చెందిన సీనియర్ ఇస్లామిక్ జర్నలిస్టు మహ్మద్ ముజాహిద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
మాధవీలతను ‘కట్ ది కైట్’ అని కోరిన కేంద్రమంత్రి
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి కొంపెల్లి మాధవి లత హైదరాబాద్‌ను భాగ్యనగర్ అని పేరు మార్చి పిలిచారు. మాధవీలత కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో కలిసి చార్మినార్ నుంచి ర్యాలీతో కలెక్టరు కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థిని ‘గాలిపటం కత్తిరించండి’ అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కోరారు.
బంగారు పెన్నుతో సంతకం చేసిన మాధవీలత
మాధవి లత బంగారు రంగు కలంతో సంతకం చేసి హైదరాబాద్ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మోదీ కా పరివార్ అని చెక్కిన ఈ పెన్ను భాగ్యనగర బంగారు భవిష్యత్తుకు ప్రతీకగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. మాధవీ లత వచ్చినప్పటి నుంచి ఒవైసీ కనిపించడం లేదని, ఇక్కడ 40 ఏళ్లు పాలించి పేదల హక్కులను కాలరాసిన వారి గాలిపటం కోయాల్సిన అవసరం ఉందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. మాధవి లతతో కలిసి మాజీ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ముందు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో కేంద్రమంత్రి పూజలు చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎంపీ అభ్యర్థి ప్రచారానికి దూరం
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తన గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం ప్రచారానికి దూరంగా ఉన్నారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న రాజాసింగ్ బీజేపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కార్యక్రమానికి రాలేదు. గోషామహల్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి కూడా రాజాసింగ్ డుమ్మా కొట్టారు. హైదరాబాద్ బీజేపీ ఇన్ చార్జీగా ఉన్న రాజాసింగ్ మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తనదైన శైలిలో మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.